Kantara Movie Telugu Review : కాంతార మూవీ తెలుగు రివ్యూ.. చివరి 20 నిమిషాలు పూనకాలే
15 October 2022, 11:20 IST
- Kantara Movie Review In Telugu: కాంతార మూవీ సైలెంట్ గా వచ్చి కన్నడ బాక్సాఫీస్‌ను షేక్ చేంది. కాంతార తెలుగులోనూ రిలీజ్ అయింది. రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా ఎలా ఉంది?
కాంతార తెలుగు రివ్యూ
Kantara Cinema Review In Telugu : కాంతార మూవీ కన్నడ సినీ పరిశ్రమలో సరికొత్త ఆకర్షణగా నిలిచింది. కన్నడ సినిమాల కంటెంట్ మారుతున్నట్టు కనిపిస్తుంది. దక్షిణ కన్నడకు చెందిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బీ శెట్టి 'RRR'గా ప్రసిద్ధి చెందిన వీళ్లు కన్నడ సినిమాపై ఎక్కువ ప్రభావమే చూపిస్తున్నారు. సినిమాను కొంత మేరకు మార్చేస్తున్నారని అనిపిస్తుంది.
కాంతార నటీనటులు : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, ఉగ్రం రవి తదితరులు
నిర్మాణం : హొంబాళే ఫిల్మ్స్
దర్శకత్వం : రిషబ్ శెట్టి
సంగీతం : అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రాఫర్ : అరవింద్ కశ్యప్
kantara story: కాంతార కథ
అడవిలో ఒక ఊరు. ఆ గ్రామానికి భూస్వామ్య ప్రభువు (అచ్యుత్ కుమార్) ఉంటాడు. తరతరాలుగా పల్లె ప్రజలకు ఆ కుటుంబమే అండా. ప్రజలందరితోనూ మంచిగా ఉంటూ వాళ్లకు సమస్యలు వస్తే ముందు నిలుచుంటాడు ఊరి పెద్దమనిషి. కావాల్సిన సాయం చేస్తాడు. అతడికి కొన్ని పనుల్లో సహాయంగా శివ(రిషబ్ శెట్టి) ఉంటాడు. స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు అడవిలోకి వేటకు వెళ్తాడు. ఇదే సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్ గా మురళీ(కిశోర్) వస్తాడు. శివ చేస్తున్న పనులను చూసి స్మగ్లర్ అనుకుంటాడు.
శివ ఎప్పుడూ ఊరి కోసం పోరాడుతుంటాడు. చట్టం అందరికీ వర్తిస్తుందని చెప్పే మురళీ ఎవరికీ అండగా నిలబడేవాడు కాదు. అయితే అటవీ భూమిని ఆక్రమించుకున్నారని ఊరికి సరిహద్దులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు ఫారెస్ట్ ఆఫీసర్. శివ ప్రియురాలు లీల(సప్తమి గౌడ) ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఫారెస్ట్ గార్డ్‌గా చేరి ప్రభుత్వ అటవీ భూమిని సర్వే చేయడంలో డిపార్ట్‌మెంట్‌కి సహాయం చేస్తుంది. ఈ క్రమంలోనే అనుకోని సంఘటన జరిగి శివ జైలుకు వెళ్తాడు.
ఇదే సమయంలో శివ చిన్ననాటి మిత్రుడు హత్యకు గురవుతాడు. దైవరాధన చేసే తన చిన్ననాటి మిత్రుడు చనిపోయిన విషయం తెలిసి జైలులో ఉన్న శివ తట్టుకోలేక పోతాడు. హత్య వెనక ఫారెస్ట్ ఆఫీసర్ మురళి ఉన్నాడని శివకు ఊరి పెద్దమనిషి చెబుతాడు. ఇంతకీ హత్య చేసింది ఎవరు? ఊరి పెద్దమనిషి ఎవరి వైపు? తన గ్రామం కోసం భూమిని శివ కాపాడుకున్నాడా? లేదా? అసలు భూమిని ఎవరు స్వాధీనం చేసుకోవాలనుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కాంతార ఎలా ఉందంటే:
కాంతారా అంటే అడవి అని అర్థం. లోకల్ కంటెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల మందుకు వచ్చింది. దక్షిణ కన్నడలోని భూత కోలా, కంబళ, కోళ్ల పందాలను చిత్రంలో చక్కగా చూపించారు. ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలుగుతుంది. కథలో ట్విస్టులు కూడా బాగుంటాయి. ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా ప్రేక్షకులను కట్టిపడేస్తాడు దర్శకుడు. ఫ్యూడలిజం, పర్యావరణ పరిరక్షణ, అటవీ భూమి ఆక్రమణల గురించి చెబుతూనే.. జానపద సాహిత్యం, భూత కోల, దైవారాధన, నాగారాధన, కంబళ వంటి స్థానిక సంస్కృతులను చూపిస్తాడు దర్శకుడు.
అటవీ సంపద స్మగ్లింగ్, గ్రామీణ నేపథ్యం, తీర ప్రాంతంలో తరతరాలుగా పాటిస్తున్న భూత కోలాను చాలా చక్కగా చూపించారు. ఈ సినిమాలోని కన్నడ భాష కూడా.. స్థానిక దక్షిణ కన్నడ యాసలో ఉంటుంది. కానీ స్థానిక సంస్కృతిని ప్రదర్శించాలనే ఉత్సాహంతో కొన్ని పద్ధతులను గ్లామరైజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. కమర్షియల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.
కథ చూసేందుకు తెలిసినదే కదా.. అనిపిస్తుంది. కానీ ఎంతో భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది. పల్లెటూరు, అడవిలో నివసించే.. ప్రజల ప్రేమ, అమయకత్వం, నమ్మితే ఏదైనా చేసే మనస్తత్వం.. గుండెను తాకుతాయి. రిషబ్ శెట్టి.. నటన, దర్శకత్వ ప్రతిభ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
శివ పాత్రలో రిషబ్ శెట్టి ఇరగదీశాడు. ఎక్కడా రిషబ్ శెట్టి అని కనిపించదు. కేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఇమేజ్ అంటూ.. క్యారెక్టర్ ను ఎక్కువ చేయలేదు. ఎంత కావాలో అంతే రిషబ్ చేశాడు. సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ అంతే. అడవిలో ఉండే స్వచ్ఛత, నిజాయితీ అర్థమైపోతుంది. ఇక లీలాగా సప్తమీ గౌడ కూడా తన నటనతో ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులకు పరిచమున్న కిషోర్ కుమార్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆకట్టుకున్నాడు. భూస్వామిగా అచ్యుత్ కుమార్ బాగా నటించాడు. ఇతర నటీనటులకూ వంక పెట్టడానికి లేదు.
ఇక కాంతార మూవీకి మ్యూజిక్, లొకేషన్లు ప్రధాన బలం. సినిమా మెుత్తం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం కొన్ని సందర్భాల్లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ పనితనం కనిపిస్తుంది. కంబళ సన్నివేశాల చిత్రీకరణ అద్భుతంగా తీశారు. చివరి 20 నిమిషాలు సినిమా మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
కా రేటింగ్ : 4/5