RGV on Kantara: చిన్న సినిమా రికార్డులు బ్రేక్ చేస్తోంది.. కాంతారాపై రాంగోపాల్ వర్మ
17 October 2022, 18:31 IST
- RGV on Kantara: ఓ చిన్న సినిమా పెద్ద సినిమాల రికార్డులు బ్రేక్ చేస్తోందంటూ కాంతారా మూవీపై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఈ కన్నడ సినిమా ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.
తెలుగులోనూ వచ్చిన కాంతారా మూవీ
RGV on Kantara: మరో కన్నడ సినిమా ఇప్పుడు ఇండియాను ఊపేస్తోంది. ఈ ఏడాది కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు పెద్దగా హడావిడి లేకుండా ఓ చిన్న సినిమాగా రిలీజైన కాంతారా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కన్నడ నాట సూపర్ హిట్ అయిన ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళంలలో డబ్ చేసి రిలీజ్ చేశారు.
రిషబ్ శెట్టి డైరెక్టర్‌గా, హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాపై సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా ఈ మూవీని ఆకాశానికెత్తాడు. సోమవారం ట్వీట్ చేసిన అతడు.. ఈ చిన్న సినిమా పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తోందంటూ వర్మ కామెంట్ చేశాడు.
"కేవలం సూపర్ స్టార్లు, భారీ నిర్మాణ విలువలు, అత్యద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొస్తాయని అందరు ఫిల్మ్‌వాలాలు ఓ నిర్ణయానికి వచ్చిన సమయంలో ఓ చిన్న సినిమా, పెద్ద ముఖాలు ఎవరూ లేని కాంతారా పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తోంది" అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయడం విశేషం.
ఆర్జీవీ ఒక్కడే కాదు.. తెలుగు, కన్నడ, తమిళ సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులంతా కాంతారా మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ ధనుష్ కూడా కాంతారా కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ ట్వీట్ చేశాడు. ప్రభాస్, కిచ్చా సుదీప్, అనుష్క శెట్టి, పృథ్విరాజ్ సుకుమారన్, శిల్పా శెట్టి, కంగనా రనౌత్‌లాంటి వాళ్లంతా కాంతారాను ఆకాశానికెత్తారు.
కాంతారా మూవీ ప్రస్తుతం హయ్యెస్ట్ రేటెడ్ ఇండియన్ మూవీగా కూడా నిలిచిన విషయం తెలిసిందే. మరో కన్నడ సినిమా కేజీఎఫ్ 2 రికార్డును కాంతారా బ్రేక్ చేసింది. ఈ సినిమా అక్టోబర్ 15న తెలుగులోనూ రిలీజ్ కాగా.. రెండు రోజుల్లోనే రూ.11 కోట్లు వసూలు చేయడం విశేషం.