Ram Charan Janhvi Kapoor: కన్ఫమ్.. రామ్ చరణ్‌తో జాన్వీ రొమాన్స్.. ఆమె తండ్రి ఏం చెప్పాడంటే?
19 February 2024, 11:47 IST
- Ram Charan Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ జత కట్టనుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూరే కన్ఫమ్ చేయడం విశేషం.
రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించిన బోనీ కపూర్
Ram Charan Janhvi Kapoor: తెలుగులో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీలో నటిస్తున్న బాలీవుడ్ నటి, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. త్వరలోనే రామ్ చరణ్ తోనూ జత కట్టనుంది. నేషనల్ అవార్డు విన్నర్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చరణ్ చేస్తున్న మూవీలో జాన్వీనే హీరోయిన్ అని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించాడు.
రామ్ చరణ్, జాన్వీ మూవీ
ఈ మధ్యే ఐడ్రీమ్ మీడియాతో మాట్లాడిన జాన్వీ తండ్రి, బాలీవుడ్ నిర్మాత్ బోనీ కపూర్.. ఆమె నెక్ట్స్ తెలుగు ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. ప్రస్తుతం జాన్వీ తెలుగులో దేవర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. త్వరలోనే ఆమె రామ్ చరణ్ తో కలిసి నటించబోతోందని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
బుచ్చిబాబు సానాతో చరణ్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. "నా కూతురు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేసింది. అందులో ఆమె గడిపిన ప్రతి క్షణాన్ని జాన్వీ ఆస్వాదించింది. త్వరలోనే రామ్ చరణ్ తోనూ సినిమా చేయబోతోంది. తారక్, చరణ్ చాలా బాగా నటిస్తున్నారు. ఆమె ఈ మధ్య చాలా తెలుగు సినిమాలు చూస్తోంది.
వాళ్లతో కలిసి పని చేయడం తన అదృష్టంగా ఆమె భావిస్తోంది. ఆ సినిమాలు బాగా ఆడతాయని అనుకుంటున్నాను. ఆమెకు అక్కడ మరిన్ని అవకాశాలు రావాలి. అంతేకాదు తమిళంలో సూర్యతోనూ నటించబోతోంది. నా భార్య (శ్రీదేవి) వివిధ భాషల్లో నటించింది. నా కూతురు కూడా అదే చేస్తోంది" అని బోనీకపూర్ అన్నాడు.
హైదరాబాద్‌లో ఇల్లు కొంటా
బోనీ కపూర్ భార్య శ్రీదేవి మొదట తెలుగు సినిమాలతోనే పేరు సంపాదించింది. ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాతే బాలీవుడ్ వైపు చూసింది. ఆమె కూతురు జాన్వీ మాత్రం బాలీవుడ్ తో అరంగేట్రం చేసి మెల్లగా తెలుగులోకి వస్తోంది. దీంతో ఆమె కోసం, తన భార్య కోసం హైదరాబాద్ లో తాను ఓ ఇల్లు కొనాలని భావిస్తున్నట్లు బోనీ చెప్పాడు.
"నేను నా 12 సినిమాలను హైదరాబాద్ లో తీశాను. అప్పట్లో ఈ సిటీ ఇంకా అభివృద్ధి చెందుతోంది. కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు సిటీ చాలా మారిపోయింది. అప్పట్లో నేనే సిటీలో కారు డ్రైవ్ చేసుకుంటూ తిరిగే వాడిని. ఇప్పుడు నన్ను గైడ్ చేయడానికి ఎవరైనా స్థానికులు ఉండాల్సి వస్తోంది. నేను నా భార్య కోసం హైదరాబాద్ లో ఇల్లు కొనాలని అనుకున్నా. ఎందుకంటే ఆమె ఇక్కడ చాలా సినిమాల్లో నటించింది. ఇక్కడ ఆంధ్రా ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్లం" అని బోనీ చెప్పాడు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ నటీమణుల్లో ఒకరిగా ఎదుగుతోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన దేవర మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని మొదట చెప్పినా.. ఇప్పుడు అక్టోబర్ 10కి వాయిదా వేశారు. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమాలో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.