Devara Release Date: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ ఆరు నెలలు వాయిదా పడింది. మొదట ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని భావించిన ఈ సినిమా.. ఇప్పుడు అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శుక్రవారం (ఫిబ్రవరి 16) ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. సమ్మర్ లో వస్తుందనుకున్న సినిమా.. దసరా పండగకు రానుంది.
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న మూవీ దేవర. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ రాగా.. రిలీజ్ వాయిదా పడనుందని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 5న రిలీజ్ కావడం సాధ్యం కాదని అన్నారు. మొత్తానికి అనుకున్నట్లే దేవర మూవీ ఏప్రిల్ 5న కాకుండా ఈ ఏడాది అక్టోబర్ 10న రాబోతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులతోపాటు విలన్ పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో ఆలస్యమైంది.
అయితే శుక్రవారం (ఫిబ్రవరి 16) దేవర మేకర్స్ అనూహ్యంగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ వస్తున్నట్లు ఎవరూ అంచనా వేయలేదు. దసరా పండగకు ముందు మూవీని తీసుకురానున్నట్లు చెప్పి మేకర్స్ ఆశ్చర్యపరిచారు. ముందు ప్రకటించిన తేదీ కంటే ఆరు నెలలు ఆలస్యంగా దేవర రానుంది. గతంలో 2018లోనూ తారక్ నటించిన అరవింద సమేత మూవీ రిలీజై పెద్ద హిట్ అయింది.
దీంతో ఆ సెంటిమెంట్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో తారక్ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ కూడా అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఎర్ర సముద్రంలో తారక్ రక్తపుటేరులు పారించాడు.
దేవర మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ఈ మధ్యే నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ వెల్లడించాడు. అయితే మేకర్స్ తో కుదిరిన ఒప్పందం మేరకు థియేటర్లలో సినిమా రిలీజైన 56 రోజుల తర్వాత గానీ దేవర మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం లేదు. సాధారణంగా ఈ మధ్యకాలంలో నెల నుంచి 45 రోజుల మధ్య సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.
అయితే దేవర మూవీకి ఉన్న హైప్ నేపథ్యంలో థియేట్రికల్, ఓటీటీ రిలీజ్ కు మధ్య గ్యాప్ కాస్త ఎక్కువ ఉండాలని మేకర్స్ స్పష్టం చేశారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై నెలకొన్న ఆసక్తి నేపథ్యంలో ఈ భారీ మొత్తం చెల్లించడానికి నెట్‌ఫ్లిక్స్ వెనుకాడలేదు. ఈ మధ్యే ఆ సంస్థ సీఈవో హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను కలిశాడు.
టాపిక్