Premalu Review: ప్రేమలు మూవీ రివ్యూ - మలయాళం యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?
13 April 2024, 12:19 IST
Premalu Review: మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రలో నటించిన ప్రేమలు మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో వంద కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?
ప్రేమలు మూవీ రివ్యూ
Premalu Review: ప్రేమలు...ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తోంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మలయాళం మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో రిలీజైంది. ప్రేమలు మూవీలో నస్లేన్ కే గఫూర్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించాడు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గిరీష్ ఏడీ ఈ మూవీని తెరకెక్కించాడు. ప్రేమలు మూవీ ఎలా ఉందంటే?
సచిన్, రీనూ లవ్‌స్టోరీ...
సచిన్ (నస్లేన్ కే గఫూర్) జీవితాన్ని జాలీగా గడపాలని కలలుకనే నవతరం కుర్రాడు. అంజలి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కాలేజీ చివరి రోజు తన ప్రేమను ఆమెకు చెబుతాడు. తాను మరొకరితో ప్రేమలో ఉన్నట్లు చెప్పిన అంజలి అతడికి హ్యాండిచ్చి వెళ్లిపోతుంది. ఆ లవ్ బ్రేకప్ బాధలో ఉండగానే అతడి యూకే వీసా రిజెక్ట్ అవుతోంది. ఇంట్లో వాళ్ల పోరుపడలేక గేట్ కోచింగ్ పేరుతో అబద్ధం చెప్పి మరో ఫ్రెండ్ అమూల్‌తో కలిసి హైదరాబాద్ వస్తాడు సచిన్.
అతడికి ఓ పెళ్లిలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే రీనూ రాయ్ (మమితా బైజు) పరిచయం అవుతుంది. తొలిచూపులోనే రీనూతో ప్రేమలో పడతాడు సచిన్. ఆమెకు తన ప్రేమను చెప్పలేక సతమతమవుతుంటాడు. రీనూ కూడా సచిన్‌తో క్లోజ్‌గా ఉంటుంది. రీనూ తనపై చూపించే కేరింగ్‌ను ప్రేమగా పొరపడిన సచిన్ చివరకు ధైర్యం ఆమెకు ఐ లవ్ యూ చెబుతాడు.
అతడి ప్రపోజల్‌ను రీనూ తిరస్కరిస్తుంది. నిన్ను నేను ప్రేమించలేదని, నీపై నాకు ఎప్పుడూ ఆ ఫీలింగ్ కలగలేదని సమాధానం చెబుతుంది? ఆ తర్వాత ఏం జరిగింది? లవ్ బ్రేకప్ బాధను మర్చిపోవడానికి హైదరాబాద్ వదిలిపెట్టిన సచిన్ ఎక్కడికి వెళ్లిపోయాడు? అతడిని రీనూ మళ్లీ కలిసిందా? రీనూ, సచిన్‌ను విడగొట్టడానికి ప్రయత్నించిన ఆది ఎవరు అన్నదే ప్రేమలు మూవీ కథ.
ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్...
యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్ చాలా వరకు బాధ్యతలేకుండా జులాయిగా తిరిగే మాస్ అబ్బాయి, మంచి పొజిషన్ ఉన్న క్లాస్ అమ్మాయి జీవితాల చుట్టే తిరుగుతుంటాయి. ఈ ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్‌ను ఎంతో మంది దర్శకులు ఎన్నో రకాలుగా తెరకెక్కించారు. ప్రేమలు కూడా అలాంటి రొటీన్ లవ్‌స్టోరీనే.
లిప్‌లాక్‌లు, ఫైట్లు లేవు...
హీరోయిన్ ప్రేమను దక్కించుకోవడానికి హీరో ఇందులో విలన్స్‌తో ఫైట్లు, ఛేజ్‌లు చేయడు. హీరోహీరోయిన్లు విడిపోవడానికి, కలవడానికి పెద్దగా ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉండవు. రొమాన్స్, లిప్‌లాక్‌లు ఉండవు.
మూడు, నాలుగు ముక్కల్లో ఎండ్ అయ్యే సింపుల్ స్టోరీని తన ట్రీట్‌మెంట్‌తో కొత్తగా చెప్పాడు దర్శకుడు. సినిమాటిక్ లవ్‌స్టోరీలా కాకుండా ప్రేమ, బ్రేకప్‌ల విషయంలో నేటి యూత్ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? వారి నడవడిక, యాసభాషలు ఏ విధంగా ఉంటున్నాయన్నది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు.
నాచురల్ ట్రీట్‌మెంట్...
హీరోహీరోయిన్లతో పాటు వారి చుట్టూ కనిపించే క్యారెక్టర్స్‌ది యాక్టింగ్ అనే ఫీల్ ఎక్కడ కలగదు. జీవితంలో సెటిల్ కానీ, ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా తిరిగే కుర్రాడు ఎలా ఉంటాడో అలాగే హీరో పాత్ర కనిపిస్తుంది. హీరోయిన్ పాత్రలో సగటు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌లానే జోవియల్‌గా కనిపిస్తుంది. ఆఫీస్ టెన్షన్స్, ప్రపోజల్స్, రిజెక్ట్ చేస్తే వచ్చే ఇబ్బందులను క్యాజువల్‌గా స్క్రీన్‌పై ఆవిష్కరించాడు. నేటి అమ్మాయిలు, అబ్బాయిల మధ్య స్నేహాలు, సరదాలను చాలా క్లీన్‌గా ఎలాంటి వల్గారిటీ లేకుండా చూపించాడు.
మీమ్స్ ట్రోల్స్...
సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిన మీమ్స్,ట్రోల్స్‌ను డైలాగ్ రూపంలో సినిమాలో చాలా బాగా వాడుకున్నాడు. అవన్నీ యూత్‌కు బాగా కానెక్ట్ అయ్యాయి. అదే ప్రేమలు సినిమాకు సక్సెస్‌గా నిలిచింది.
ప్రేమలు తరహాలో తెలుగులో ఎన్నో సినిమాలొచ్చాయి. తొలి ప్రేమ, మనసంతా నువ్వే, ఏ మాయచేశావే ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. వాటితో పోలిస్తే కథ, కథనాల పరంగా ప్రేమలు సినిమాలు ఎలాంటి కొత్తదనం లేదు. కేవలం ట్రీట్‌మెంట్ మాత్రమే కొత్తది.
మమితా బైజు స్పెషల్ అట్రాక్షన్...
ఈ సినిమాకు మిమితా బైజు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రీనూ పాత్రలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, నాచురల్ పర్ఫార్మెన్స్‌తో ఫిదా చేసింది. బొమ్మరిల్లులో జెనిలీయాలో సినిమా మొత్తం తన డామినేషన్‌కనిపిస్తుంది. సచిన్ పాత్రలో నస్లేన్ కూడా ఆకట్టుకున్నాడు. సగటు కుర్రాడి పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయాడు.
మంచి ఛాయిస్...
ఆహా ఓటీటీలో ప్రేమలు స్ట్రీమింగ్ అవుతోంది. యూత్‌ఫుల్, బ్యూటీఫుల్ లవ్‌స్టోరీని చూడాలనుకునేవారికి ఈ వీక్ మంచి ఛాయిస్‌గా ఈ మూవీ నిలుస్తుంది.