Tollywood: పుష్ప 2 ఎఫెక్ట్ - ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు - టాలీవుడ్‌కు షాకిచ్చిన సీఏం
21 December 2024, 17:04 IST
Tollywood: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చేది లేదని అసెంబ్లీలో ప్రకటించారు. సినిమా ప్రముఖుల వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రేవంత్ రెడ్డి అన్నారు.
టాలీవుడ్
Tollywood: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఏం ఫైర్ అయ్యారు. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇవ్వమని అన్నాడు. సినిమా ఇండస్ట్రీ కారణంగా ఓ ప్రాణం పోయిందని, తాను సీఏంగా ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీకి ఎలాంటి ప్రత్యేకమైన రాయితీలు కల్పించేది లేదని అన్నాడు.
అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిందని సీఏం అన్నారు. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
పుష్ప 2 ప్రీమియర్...
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని మృతి చెందింది. ఆమె కొడుకు వెంటిలేటర్‌పై చికిత్సను పొందుతోన్నాడు. ఈ ఘటనపై ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో స్పందించింది.
ఒక్కరూ కూడా చూడటానికి వెళ్లలేదు...
అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు వెళ్లినందుకు హీరోలతో సినిమా సినిమా ఇండస్ట్రీవాళ్లందరూ పరామర్శించడానికి అతడి ఇంటికి వెళ్లారు. కానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని చూడటానికి ఒక్కరూ కూడా వెళ్లలేదని సీఏం రేవంత్ రెడ్డి అన్నాడు.
అనుమతి లేకున్నా...
సంధ్య థియేటర్‌కు రావడానికి పోలీసులు అనుమతి నిరాకరించిన కూడా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారని, క్రాస్‌రోడ్స్‌లో తన కారు రూప్ టాప్‌లో నుంచి చేతులు ఊపుతూ వెళ్లడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారని సీఏం అన్నాడు. థియేటర్ గేట్లు ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు లోపలికి చొచ్చుకొని రావడంతో తొక్కిసలాట జరిగి మహిళా అభిమాని రేవతి చనిపోయిందని సీఏం తెలిపారు.
పరిస్థితి అదుపు దాటిందని థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పిన అల్లు అర్జున్ వినలేదని సీఏం అన్నారు. అరెస్ట్ చేయాల్సివస్తుందని అన్న తర్వాత కూడా కారు రూప్ టాప్‌లో నుంచి బయటకు చూస్తూ చేతులు ఊపుకుంటూ అల్లు అర్జున్ వెళ్లిపోయారని సీఏం ఫైర్ అయ్యాడు.
ప్రాణాలు పోతుంటే ఊరుకోం...
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినందకు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ నీచమైన భాషలో కామెంట్స్ చేస్తున్నారని సీఏం తెలిపారు. సినిమాలు తీస్తూ డబ్బులు సంపాదించుకొండి. ప్రభుత్వం నుంచి రాయితీలు, అనుమతులు పొందండి. కానీ సినిమా వాళ్ల కారణంగా ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మాత్రం ఉపేక్షించదు అంటూ సినీ ప్రముఖుల్ని ఉద్దేశించి సీఏం కామెంట్స్ చేశారు.
కిమ్స్ హాస్పిటల్‌కు సినిమాటోగ్రఫీ మినిస్టర్...
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిలో వైద్యం పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు.
శ్రీతేజ్ వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని...తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద 25 లక్షల చెక్కును వారి కుటుంబానికి ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. హాస్పిటల్ కి వెళ్లి చెక్కును శ్రీతేజ్ తండ్రికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అందజేయనున్నారు.