NNS August 8th Episode: అరుంధతి, భాగీ అక్కాచెల్లెళ్లని తెలుసుకున్న అమర్- ఆత్మను బంధించిన ఘోరా- చేతులెత్తేసిన గుప్తా
08 August 2024, 6:00 IST
Nindu Noorella Saavasam August 8th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 8వ తేది ఎపిసోడ్‌లో అరుంధతి తండ్రి రామ్మూర్తి, చెల్లెలు భాగమతి అని అమర్, రాథోడ్ తెలుసుకుని ఆశ్చర్యపోతారు. మరోవైపు అరుంధతి ఆత్మను ఘోరా బంధిస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 8వ తేది ఎపిసోడ్
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 8th August Episode) అరుంధతి పెరిగిన ఆశ్రమానికి వెళ్లి తన చిన్నప్పటి వస్తువుల గురించి ఆరా తీస్తాడు అమర్. ఆ పాపని వదిలేసినప్పుడు ఒక పట్టుపంచె మాత్రమే ఉందని చెప్పడంతో దాన్ని తీసుకుంటాడు.
వదిలేసిన పంచె వివరాలు
ఆ పట్టుపంచె తీసుకుని ఇంటికి వెళ్తూ.. ఆరు తన కోరికను నా ద్వారా తీర్చుకోడానికే ఆ డైరీని నా చేత చదివించిందనుకుంటా అని రాథోడ్‌తో అమర్ అంటాడు. అవును సార్.. ఎలాగైనా మేడమ్ గారి తల్లిదండ్రులను కనిపెట్టాలి అంటాడు రాథోడ్. ఆశ్రమానికి వెళ్లి అరుంధతితో వదిలేసిన పంచె చూపించి తన వివరాలు చెప్పమంటాడు అమర్.
అది చూసి ఇది సరిపోతుంది సార్.. దీని ఆధారంగా ఆమె వివరాలు కనుక్కోవచ్చు అంటుంది వార్డెన్. రిజిస్టర్ చూసి అరుంధతి కోసం తన తండ్రి కూడా వెతుకున్నారని చెబుతుంది. అది విని షాకవుతాడు అమర్. అదేంటి.. అంటే.. నా ఆరుని తన తల్లిదండ్రులు వదిలించుకోలేదా? అని బాధపడతాడు. అరుంధతి కోసం ఆ పెద్దాయన తిరగని ఆశ్రమం లేదు. కలవని వార్డెన్ లేదు అంటుంది ఆ వార్డెన్.
మిస్సమ్మ వాళ్లకోసమే సార్
ఆయన అడ్రస్‌గానీ, ఫోన్ నెంబర్‌గానీ ఉంటే ఇవ్వమంటాడు రాథోడ్. తప్పకుండా అంటూ రిజిస్టర్ చూసి అరుంధతి తండ్రి పేరు రామ్మూర్తి, చెల్లెలు పేరు భాగమతి అని చెబుతుంది వార్డెన్. అది విన్న అమర్ షాక్ అవుతాడు. వార్డెన్ చెప్పేది విని ఆశ్చర్యపోయిన రాథోడ్.. అంటే.. మనం వెతుకుతున్నది మిస్సమ్మ వాళ్లకోసమే సార్ అని అంటాడు.
ఎక్కడో ఉన్న మేడమ్ గారు ఇక్కడ ఉన్న మిస్సమ్మపై అంత ప్రేమ ఎందుకు చూపించారో ఇప్పుడు అర్థమైంది సార్. మిస్సమ్మ మన ఇంటికి ఎందుకు వచ్చిందో, మీ ఇద్దరికి దేవుడు ఎందుకు ముడి వేశాడో ఇన్నాళ్లూ అర్థం కాలేదు సార్. కానీ, తన అక్క కుటుంబానికి అండగా ఉండటానికే మిస్సమ్మ మనింటికి వచ్చింది సార్.. తన రక్త సంబంధం కాబట్టే తన రక్తం దారబోసి మరీ అమ్ము పాపని కాపాడింది అని భాగీ చేసినవన్నీ గుర్తు చేస్తాడు రాథోడ్.
పాతికేళ్లుగా ఆశగా
అరుంధతి, భాగమతికి ఉన్న పోలికలు, ఇద్దరి మాటలు, ప్రేమ అన్నీ తలుచుకుంటాడు అమర్. ఏం మాట్లాడాలో అర్థంకాక అమర్ గొంతు మూగబోతుంది. పదండి సార్ వెంటనే రామ్మూర్తి గారికి మీరు వెతుకున్న మీ పెద్దకూతురు మా మేడమే అని చెబుదాం అంటాడు రాథోడ్. ఏమని చెబుతాం రాథోడ్. ఆయన పాతికేళ్లుగా ఆశగా వెతుకుతున్న కూతురు బతికి లేదని చెబుదామా అని బాధపడతాడు అమర్.
మరోవైపు ఘోరా అరుంధతి ఆత్మను బంధించేందుకు పూజ మొదలు పెడుతాడు. మనోహరి కూడా పూజలో కూర్చుంటుంది. పూజని ఎలాగైనా ఆపాలని అందుకు తనకు సాయం చేయమని చిత్రగుప్తుని తీసుకుని ఘోరా దగ్గరకు వెళ్తుంది అరుంధతి. కానీ, అస్థికలు ఘోరా దగ్గర ఉండటంతో చిత్రగుప్తుడు ఏం చేయలేకపోతాడు. ఏదైనా చేసి ఆ పూజని ఆపండి గుప్తగారు అని వేడుకుంటుంది అరుంధతి.
నువ్వే ఆపాలి
విధికి ఎదురెళ్లింది నువ్వు, ఆ పూజని కూడా ఆపాల్సింది నువ్వే అంటాడు గుప్త. కానీ, అరుంధతి ఏం చేయలేకపోతుంది. ఘోరా అరుంధతి ఆత్మను బంధిస్తాడు. ఘోరా చెర నుంచి అరుంధతి ఆత్మ తప్పించుకుంటుందా? నిజం తెలిసిన అమర్ ఏం చేయనున్నాడు? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 09న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!