Nayanthara vs Doctor: ఆ డాక్టర్‌తో నయనతారకు ఉన్న గొడవేంటి? మూర్ఖులతో వాదించొద్దంటూ చేసిన పోస్ట్ వైరల్
30 July 2024, 10:17 IST
- Nayanthara vs Doctor: ఓ లివర్ డాక్టర్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార మండిపడుతోంది. మూర్ఖులతో వాదించకూడదు అంటూ ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఆ డాక్టర్‌తో నయనతారకు ఉన్న గొడవేంటి? మూర్ఖులతో వాదించొద్దంటూ చేసిన పోస్ట్ వైరల్
Nayanthara vs Doctor: సమంత చేస్తున్న హెల్డ్ పాడ్‌కాస్ట్ పై ఆ మధ్య ఓ డాక్టర్ ఎలా మండిపడ్డారో తెలుసు కదా. ఆ తర్వాత ఆమె తన పాడ్‌కాస్ట్ లకు కేవలం సమాచారం కోసమే అంటూ ఓ డిస్‌క్లెయిమర్ కూడా జోడిస్తోంది. తాజాగా నయనతార కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. మందార టీతో ఎన్నో లాభాలంటూ ఆమె చేసిన ఓ పోస్టుపై ఓ డాక్టర్ మండిపడటంతో నయన్ తీవ్రంగా స్పందించింది.
నయనతార వర్సెస్ డాక్టర్
నయనతార ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్ లో మందార టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చెబుతూ ఓ పోస్ట్ చేసింది. డయాబెటిస్ నుంచి మొటిమల వరకు ఎన్నింటినో ఈ టీ బాగు చేస్తుందని ఆమె చెప్పింది. ఈ పోస్టుపై ఓ హెపటాలజిస్ట్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ స్పందించాడు. సోషల్ మీడియాలో లివర్ డాక్ గా పేరుగాంచిన ఆయన.. అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నావంటూ నయన్ పై మండిపడ్డాడు.
దీనికి నయనతార పరోక్షంగా స్పందిస్తూ ఇన్‌స్టా స్టోరీలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రముఖ రచయిత మార్క్ ట్వెయిన్ చెప్పిన పాపులర్ సేయింగ్ ఒకదానిని ఆమె తన స్టోరీలో పోస్ట్ చేసింది. "మూర్ఖులతో ఎప్పుడూ వాదించకూడదు. వాళ్ల తమ స్థాయికి మిమ్మల్ని దిగజార్చి తమ అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు" అన్నది దాని అర్థం. నయన్ ఆ డాక్టర్ ను ఉద్దేశించి చేసిన పోస్టే ఇది అంటూ అభిమానులు ఫిక్సయ్యారు.
మందార టీపై నయన్ ఏమన్నదంటే?
నయనతార మందార టీ ప్రయోజనాలు చెబుతూ ఓ పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసింది. తన హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్ మున్మున్ గనేరివాల్ చెప్పినట్లుగా చెబుతూ.. "వర్షాకాలంలో మందార టీ చాలా మంచిది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్లు మీ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే మున్మున్ గనేరివాల్ ను సంప్రదించండి" అని పోస్ట్ చేసింది.
దీనిపై లివర్ డాక్ ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించారు. "మందార టీ టేస్టు బాగుంటుందన్న దగ్గరే ఆమె ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ అంతకంటే ముందుకెళ్లి తమ ఆరోగ్య నిరక్షరాస్యతను చాటుకుంది. మందార టీతో డయాబెటిస్, హైబీపీ, మొటిమలు, యాంటిబ్యాక్టీరియల్, ఫ్లూ నుంచి కాపాడుతుందని చెప్పింది. వీటిలో ఏదీ నిరూపించబడలేదు" అని అన్నారు.
ఆ తర్వాత నయన్ పోస్ట్ డిలీట్ చేసినా.. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని కూడా నిందించారు. దీంతో నయన్ కూడా ఆ డాక్టర్ కు ఇలా పరోక్షంగా తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా సమాధానం ఇచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు. గతంలో సమంత కూడా ఇలాగే తన హెల్త్ పాడ్‌కాస్ట్ లో తాను నెబ్యులైజర్ ద్వారా ఆవిరి తీసుకునే ఫొటో పోస్ట్ చేస్తూ.. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ మిశ్రమాన్ని ఆవిరి పట్టుకోండని చెప్పింది. దీనిపై ముంబైకి చెందిన ఓ డాక్టర్ తీవ్రంగా స్పందిస్తూ.. ఆమెను జైల్లో పెట్టాలని డిమాండ్ చేయడం గమనార్హం.