Mohan Babu Wife Letter: మంచు మనోజ్‌కి లేఖతో ట్విస్ట్ ఇచ్చిన మోహన్ బాబు భార్య నిర్మలా దేవి
17 December 2024, 14:22 IST
Manchu family dispute: మంచు ఫ్యామిలీ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కి చేరగా.. పోలీసులు ఒకవైపు విచారణ చేస్తున్నారు. మరోవైపు వరుసగా ఫిర్యాదులు, వివరణలతో ఫ్యామిలీ నుంచి లేఖలు విడుదల అవుతున్నాయి.
మోహన్ బాబు, మనోజ్, నిర్మలా దేవి
మంచు ఫ్యామిలీలో గొడవలు గత 10 రోజుల నుంచి సినిమాల్లో మించిన ట్విస్ట్‌లతో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తొలుత మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య మొదలైన గొడవ.. మంచు విష్ణు ఎంట్రీతో పీక్స్‌కి చేరింది. ఆ తర్వాత మధ్యలో రిపోర్టర్‌పై మోహన్ బాబు దాడి.. కేసులు.. విష్ణు, మనోజ్‌పై పోలీసుల బైండోవర్‌తో గొడవలు సర్దుమణిగినట్లు కనిపించింది.
లేఖ వదిలిన నిర్మలా దేవి
కానీ.. మోహన్ బాబు భార్య నిర్మలా దేవి పుట్టినరోజుతో మళ్లీ గొడవలు తెరపైకి వచ్చాయి. మంచు విష్ణు తన కుట్రలో భాగంగా ఇంట్లోని జనరేటర్‌లో పంచదార పోసినట్లు మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో కలకలంరేగింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతుండగా.. మోహన్ బాబు భార్య నిర్మలా దేవి ఓ లేఖని విడుదల చేశారు.
సీసీటీవీ ఫుటేజీతో ఫిర్యాదు
పహాడి షరీఫ్ పోలీసులను ఉద్దేశిస్తూ నిర్మలా దేవి రాసిన ఆ లేఖలో ఏముందంటే.. ‘‘డిసెంబరు 14న నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు మంచు విష్ణు జల్‌పల్లిలోని ఇంటికి కేసు తీసుకొచ్చి నా బర్త్‌డే సెలెబ్రేట్ చేశాడు. దానికే నా చిన్న కుమారుడు మంచు మనోజ్.. విష్ణు ఇంటికి వచ్చినప్పుడు ఉన్న సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టి.. అతను గొడవ చేసినట్లు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది’’ అని అందులో రాసుకొచ్చారు.
మనోజ్ మాటల్లో నిజం లేదు
‘‘మంచు విష్ణు కేక్ తీసుకొచ్చిన మాట నిజమే.. నాతో కాసేపు ఉండి కేక్ కట్ చేయించి ఆ తర్వాత తన రూములో ఉన్న వస్తువులను మాత్రమే తీసుకెళ్లాడు. ఈ ఇంట్లో మంచు మనోజ్‌కి ఎంత హక్కు ఉందో మంచు విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. మంచు విష్ణు ఇంట్లోకి వచ్చి ఎలాంటి గొడవ చేయలేదు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో నిజం లేదు’’ అని నిర్మలా దేవి ఆ లేఖలో రాసుకొచ్చారు.
తన వస్తువులు తీసుకెళ్లాడు
‘‘జల్‌పల్లిలోని ఇంట్లో పని చేసేవాళ్లు.. తాము పనిచేయలేమని మానేసి వెళ్లిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదు. అతను కేవలం ఇంటికి వచ్చి నా బర్త్‌డే సెలెబ్రేట్ చేసి.. రూములోని తన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాడు. అంతకు మించి ఇక్కడ ఏమీ గొడవ జరగలేదు’’ అని నిర్మలా దేవి క్లారిటీ ఇచ్చారు.
జనరేటర్‌లో పంచదార
మంచు మనోజ్ మాత్రం గత ఆదివారం భిన్నమైన వాదన వినిపించారు. ‘‘అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో కొందరు బౌన్సర్లతో కలిసి విష్ణు ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న జనరేటర్లలో పంచదార పోయించాడు. దాంతో శనివారం రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జనరేటర్‌లో పంచదార పోయడంతో అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది’’ అని మంచు మనోజ్ ఆరోపించారు.