Longest running TV Show: 57 ఏళ్లుగా కొనసాగుతున్న టీవీ షో ఇది.. 16 వేలకుపైగా ఎపిసోడ్లు.. ఏ టీవీ సీరియల్ సాటిరాదు
09 September 2024, 10:27 IST
- Longest running TV Show: ఇండియాలో ఏకంగా 57 ఏళ్లుగా కొనసాగుతున్న టీవీ షో ఏదో తెలుసా? ఈ షో ఇప్పటికే 16 వేలకుపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇంకా నడుస్తూనే ఉంది. ఈ షో దరిదాపుల్లో మరో షో లేకపోవడం విశేషం.
57 ఏళ్లుగా కొనసాగుతున్న టీవీ షో ఇది.. 16 వేలకుపైగా ఎపిసోడ్లు.. ఏ టీవీ సీరియల్ సాటిరాదు
Longest running TV Show: టీవీ సీరియల్స్ కొన్నేళ్ల పాటు వేల ఎపిసోడ్స్ సాగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ టీవీ షో ముందు ఆ సీరియల్స్ ఏవీ నిలవలేవు. ఇండియాలో సుదీర్ఘంగా సాగుతున్న టీవీ షో ఇది. ఏకంగా 57 ఏళ్లుగా, 16780కిపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకొని ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ టీవీ షో పేరేంటో తెలుసా? దూరదర్శన్‌లో వచ్చే కృషి దర్శన్.
కృషి దర్శన్.. 57 ఏళ్లుగా..
ఇండియాలో అత్యంత సుదీర్ఘంగా సాగుతున్న టీవీ షోగా ఈ కృషి దర్శన్ నిలిచింది. 57 ఏళ్లుగా కొనసాగుతూనే ఉండటం అంటే మాటలు కాదు. ఇదొక వ్యవసాయ కార్యక్రమం కావడం విశేషం. ఈ 57 ఏళ్లలో ఇప్పటికే 16780 షోలు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మన దేశంలో ఏ ఇతర షో దీని దరిదాపుల్లో కూడా లేదు.
వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెళకువలు, పశు పోషణ, చేపల పెంపకం, గ్రామీణాభివృద్ధిలాంటి అంశాల గురించి ఈ షోలో నిపుణులు వివరిస్తూ ఉంటారు. వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియాలో సుమారు ఆరు దశాబ్దాలుగా ఈ షో కోట్లాది మంది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
కృషి దర్శన్ ప్రారంభమైందిలా?
కృషి దర్శన్ 57 ఏళ్ల కిందట అంటే 1967లో ప్రారంభమైంది. ఆ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ షోని ప్రారంభించారు. ఆ ఏడాదితో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 20 ఏళ్లు పూర్తయింది.
మొదటలో ఈ షో కేవలం దూరదర్శన్ నేషనల్ ఛానెల్లో మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. అయితే 2015 నుంచి డీడీ కిసాన్ లోనూ వస్తోంది. ప్రతి ఎపిసోడ్ 30 నిమిషాల పాటు ఉంటుంది. మొదట్లో దేశ రాజధాని అయిన ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న 80 గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఈ షో.. తర్వాత దేశమంతా వచ్చింది.
లాంగెస్ట్ రన్నింగ్ మ్యూజిక్ షో ఇదే
ఇండియాలో లాంగెస్ట్ రన్నింగ్ టీవీ షోగా కృషి దర్శన్ కు పేరుంది. మరి లాంగెస్ట్ రన్నింగ్ మ్యూజిక్ షో ఏదో తెలుసా? సుదీర్ఘంగా కొనసాగుతున్న షోలలో ఇది కృషి దర్శన్ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ షో పేరు చిత్రహార్. ఇది కూడా డీడీ నేషనల్ లోనే టెలికాస్ట్ అవుతోంది.
ఈ షో 42 ఏళ్లుగా ఆ ఛానెల్లో వస్తోంది. ఆగస్ట్ 15, 1982లో ఈ చిత్రహార్ షో ప్రారంభమైంది. ఇప్పటికే 12 వేలకుపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. హిందీ సినిమాల్లో టాప్ సాంగ్స్ ఈ షోలో వస్తుంటాయి. ఇప్పటికీ డీడీ నేషనల్ ఛానెల్లో ఈ షో వస్తూనే ఉంది.
టాప్ 5లో ఉన్న మిగతా షోలు ఇవే
కృషి దర్శన్, చిత్రహార్ తర్వాత టాప్ 5లో మిగిలిన షోస్ చూసుకుంటే.. డీడీ నేషనల్ లోనే వచ్చే రంగోలి అనే మ్యూజిక్ మూడో స్థానంలో ఉంది. ఈ షో 1989లో ప్రారంభం కాగా.. ఇప్పటి వరకూ 11500 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.
ఆ తర్వాత జీ టీవీలో 1995లో ప్రారంభమైన సరిగమప షో 29 ఏళ్లుగా 1568 ఎపిసోడ్లతో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐదో స్థానంలో స్టార్ ప్లస్, సోనీ ఛానెల్స్ లో వచ్చిన గేమ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి నిలుస్తోంది. ఈ షో 2000లో ప్రారంభం కాగా.. ఇప్పటి వరకూ 1230 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.