Emergency release date: కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. అచ్చూ ఇందిరా గాంధీలాగే..
Emergency release date: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్ ను మంగళవారం (జనవరి 23) అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మరో పవర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
Emergency release date: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న మరుసటి రోజే తన నెక్ట్స్ మూవీ ఎమర్జెన్సీ రిలీజ్ అనౌన్స్ చేసింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటిస్తున్న ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం కూడా కంగనానే కావడం విశేషం. అంతేకాదు ఇందిర పాత్రకు ఆమె అతికినట్లు సరిపోయిందని పోస్టర్ చూస్తేనే స్పష్టమవుతోంది.
చీకటి రోజుల ఎమర్జెన్సీ
ఆ చీకటి రోజుల వెనుక జరిగిన స్టోరీని ఈ సినిమా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నానంటూ కంగనా ఈ ఎమర్జెన్సీ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. మంగళవారం (జనవరి 23) తన ఇన్‌స్టాలో ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ వెల్లడించింది. "ఇండియా చీకటి రోజుల వెనుక స్టోరీని చూడండి. జూన్ 14, 2024న ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాను. అత్యంత భయంకరమైన ప్రధానమంత్రి చరిత్ర మరోసారి కళ్ల ముందుకు రానుంది. ఇందిరా గాంధీ సినిమాస్ లోకి వస్తోంది. థియేటర్లలో ఎమర్జెన్సీ 14 జూన్, 2024న" అనే క్యాప్షన్ తో ఆమె ఈ పోస్ట్ షేర్ చేసింది.
ఇప్పటికే ధాకడ్, చంద్రముఖి 2, తేజస్ మూవీస్ తో హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న కంగనా రనౌత్.. ఇప్పుడీ ఎమర్జెన్సీ మూవీపై భారీ ఆశలు పెట్టుకుంది. తనకు ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని ఆమె పీటీఐతో చెప్పింది. "ఎమర్జెన్సీ నాకు చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మణికర్ణిక తర్వాత నేను డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఈ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఇండియా, అంతర్జాతీయ స్థాయిలో టాలెంటెడ్ వ్యక్తులు పని చేశారు. ఇదొక గ్రాండ్ పీరియడ్ డ్రామా" అని కంగనా చెప్పింది.
నిజానికి ఈ సినిమా గతేడాది నవంబర్ 24 రిలీజ్ కావాల్సింది. అయితే షెడ్యూల్లో మార్పులు కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు అయోధ్యలో సోమవారం (జనవరి 22) రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అందులో పాల్గొన్న కంగనా.. మరుసటి రోజే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం విశేషం.
ఎమర్జెన్సీ మూవీ ఏంటంటే?
ఎమర్జెన్సీ మూవీని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వతంత్ర భారత దేశంలో అత్యంత వివాదాస్పద, చీకటి రోజులుగా ఎమర్జెన్సీని అభివర్ణిస్తారు. అలాంటి అంశంపై కంగనా మూవీ చేయడం నిజంగా సాహసమే. సెన్సేషనల్ లీడర్స్ లో ఒకరు, భారత తొలి మహిళా ప్రధాని గురించి ఈ ఎమర్జెన్సీ ఎలాంటి విషయాలు చెప్పబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఎమర్జెన్సీ విషయంలో ఇందిరా గాంధీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో చీకటి రోజులుగా వాటిని చెబుతారు. ఈ సున్నితమైన అంశాన్ని తెరకెక్కించడం అంటే కత్తి మీద సాములాంటిదే. ఆ ప్రాజెక్ట్ కు తానే డైరెక్ట్ చేస్తూ, నటించడం చూస్తుంటే కంగనాది ఎలాంటి వ్యక్తిత్వమో స్పష్టమవుతోంది. గతంలో క్రిష్ డైరెక్ట్ చేసిన మణికర్ణిక మూవీని మధ్యలో హైజాక్ చేసిన కంగనా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఈ ఎమర్జెన్సీని డైరెక్ట్ చేసింది.
ఈ ఎమర్జెన్సీ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయస్ తల్పడే, విశాక్ నాయర్, దివంగత సతీష్ కౌశిక్ లాంటి వాళ్లు నటించారు. రితేష్ షా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.