Kangana Ranaut on Bilkis Bano: బిల్కిస్ బానోపై సినిమా తీస్తా.. స్క్రిప్ట్ రెడీగా ఉంది.. కానీ: కంగనా రనౌత్-kangana ranaut on bilkis bano says script is ready for the movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Ranaut On Bilkis Bano: బిల్కిస్ బానోపై సినిమా తీస్తా.. స్క్రిప్ట్ రెడీగా ఉంది.. కానీ: కంగనా రనౌత్

Kangana Ranaut on Bilkis Bano: బిల్కిస్ బానోపై సినిమా తీస్తా.. స్క్రిప్ట్ రెడీగా ఉంది.. కానీ: కంగనా రనౌత్

Hari Prasad S HT Telugu
Jan 09, 2024 01:51 PM IST

Kangana Ranaut on Bilkis Bano: గుజరాత్ అల్లర్ల సమయంలో రేప్‌కు గురైన బిల్కిస్ బానోపై సినిమా తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని.. కానీ ఎవరూ ముందుకు రావడం లేదని కంగనా రనౌత్ చెప్పడం గమనార్హం.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్

Kangana Ranaut on Bilkis Bano: బిల్కిస్ బానో స్టోరీని సినిమాగా తీయడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. ఈ మూవీ తీయడానికి తన దగ్గర స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నా ఎవరూ నిర్మించడానికి ముందుకు రావడం లేదని ఆమె చెప్పడం గమనార్హం. బిల్కిస్ బానో రేప్ కేసులో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మందిని తిరిగి జైలుకు పంపించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో మరోసారి దేశం దృష్టి మొత్తం ఈ బిల్కిస్ బానో కేసుపై పడింది. అసలు ఆమె ఎవరు? 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల సమయంలో ఏం జరిగింది? ఆమెను రేప్ చేసిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం ఎందుకు ముందుగానే విడుదల చేసింది? అన్న ప్రశ్నలు చాలా మందిలో రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్ ఆమెపై సినిమా తీస్తావా అని కంగనాను ప్రశ్నించాడు.

బిల్కిస్ బానో సినిమాకు నేను రెడీ: కంగనా

గుజరాత్ అల్లర్ల రేప్ బాధితురాలు బిల్కిస్ బానోపై సినిమా తీయడానికి తన దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉందని, నిజానికి మూడేళ్లపాటు రీసెర్చ్ కూడా చేసినట్లు కంగనా సదరు యూజర్ కు చెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్ కు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ముందుకు రావడం లేదని ఆమె చెప్పింది. "డియర్ కంగనా మేడమ్.. మహిళా సాధికారత పట్ల మీకున్న అంకితభావం చాలా బాగుంది. బిల్కిస్ బానో స్టోరీన ఓ పవర్ ఫుల్ సినిమా ద్వారా చెప్పడానికి మీకు ఆసక్తి ఉందా? బిల్కిస్ బానో కోసమో, స్త్రీవాదం కోసమో కనీసం మానవత్వం కోసమైనా తీస్తారా" అని సదరు యూజర్ అడిగాడు.

దీనికి కంగనా రనౌత్ స్పందిస్తూ.. "నాకు ఆ స్టోరీ తీయాలని ఉంది. నా దగ్గర స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. దీనిపై మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాను. కానీ రాజకీయంగా ప్రేరేపితమైన సినిమాలను తీయకూడదని తమకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఇతర స్టూడియోలు నాతో అంటున్నాయి. నేను బీజేపీకి మద్దతిస్తానంటూ జియో సినిమా నో చెప్పింది. జీ ఏమో విలీనం అవుతోంది. నా దగ్గర ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి?" అని ప్రశ్నించింది.

2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో రేప్‌కు గురైంది. ఈ కేసులో11 మందిని దోషులుగా తేల్చిన కోర్టు శిక్ష విధించింది. అయితే వాళ్ల శిక్షా కాలం పూర్తి కాకముందే గతేడాది గుజరాత్ ప్రభుత్వం వాళ్లను విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. గుజరాత్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. వాళ్లను తిరిగి జైలుకు పంపించాలని ఆదేశించింది.

మరోవైపు మహిళల సాధికారత గురించి తరచూ మాట్లాడే కంగనా రనౌత్.. ఈమధ్య రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీపై విమర్శలు గుప్పించింది. మహిళలను హింసించే సినిమాలను ఆదరించే ప్రేక్షకులదే తప్పు అని ఆమె స్పష్టం చేసింది. యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం.

Whats_app_banner