Lakshmi Manchu: నన్నూ వేధించారు.. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై లక్ష్మి మంచు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
22 August 2024, 12:27 IST
- Lakshmi Manchu: లక్ష్మి మంచు ఓ స్టార్ కిడ్ అయినా తాను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పడం విశేషం. అసలు ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా మహిళలకు అన్యాయమే జరుగుతోందని ఆమె చెప్పింది. మలయాళ ఇండస్ట్రీపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.
నన్నూ వేధించారు.. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై లక్ష్మి మంచు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Lakshmi Manchu: మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు లైంగిక వేధింపులకు గురి కావడం నిజమే అని ఈ మధ్యే జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు వెల్లడించిన విషయం తెలుసు కదా. ఈ రిపోర్టుపై తాజాగా మంచు లక్ష్మి స్పందించింది. ఆమె ఓ స్టార్ కిడ్. అయినా తనకు కూడా ఈ వేధింపులు తప్పలేదని ఆమె చెప్పడం గమనార్హం. హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు వివిధ అంశాలపై మాట్లాడింది.
మహిళలకు ఎక్కడైనా అన్యాయమే..
జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై లక్ష్మి మంచు స్పందించింది. "మీకు ఓ విషయం చెబుతాను. జీవితంలో మహిళలకే అన్యాయమే జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా.. మనం దాన్ని ఎలా మార్చగలం? మీకు మీరే పోరాడాలి. నన్నూ పడేయాలని చూశారు.కానీ నేను నిలబడ్డాను. కొన్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ నా వెంట పడుతున్న వ్యక్తికి నేను ఎదుగుతున్నానని తెలుసు" అని లక్ష్మి మంచు చెప్పింది.
మలయాళం ఇండస్ట్రీపై..
మలయాళం ఇండస్ట్రీలో వేధింపులతోనే మరోసారి ఈ అంశంపై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఇండస్ట్రీలో నటించడంపై లక్ష్మి స్పందించింది. "నాకు పూర్తి భిన్నంగా అనిపించింది. ఎందుకంటే నేను మా నాన్న మంచి ఫ్రెండ్ తో కలిసి పని చేశాను. మలయాళంలోనే కాదు అన్ని భాషల్లోనూ మా నాన్నపై వాళ్లకు చాలా గౌరవం ఉంది" అని లక్ష్మి అభిప్రాయపడింది.
నన్నూ వేధించారు..
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్న మాట వాస్తవమే అని కూడా ఈ సందర్భంగా లక్ష్మి మంచు చెప్పింది. "మీరు ఎలాగూ ఈ విషయం బయటకు చెప్పరన్న ధైర్యంతో చాలా మంది మీతో అలా వ్యవహరిస్తారు. అయితే నో ఎలా చెప్పాలో కాస్త కళాత్మకంగా నేర్చుకోవాలి. మొదట్లో నన్నూ వేధించే వారు. వాళ్లతో చాలా కఠినంగా ఉండేదాన్ని.
దీంతో నా అవకాశాలను కోల్పోయాను. కానీ ఇప్పుడు నేర్చుకున్నాను. మీకు నేను ఆకర్షణీయంగా కనిపించడం చాలా ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నాను. కానీ నాకు పెళ్లి అయింది అని చెబుతాను. అయినా అది అలాగే ముందుకు వెళ్తే సున్నితంగా తిరస్కరించి తప్పుకోండి" అని లక్ష్మి మంచు సూచించింది.
కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్‌పై..
ఇక ఇదే ఇంటర్వ్యూలో కోల్‌కతాలో జరిగిన డాక్టర్ రేప్, మర్డర్ పైనా లక్ష్మి మంచు స్పందించింది. "కోల్‌కతాలో జరిగింది చాలా షాకింగ్ విషయం. అసలు చట్టం ఏం చేస్తోంది. నా రక్తం మరుగుతోంది. మూడేళ్ల పాపను రేప్ చేయడం ఏంటి? అలాంటివి చదువుతుంటే భయమేస్తుంది.
అమెరికాలో ఉన్న చాలా మంది నా ఫ్రెండ్స్ ఇండియాకు రావడానికి భయపడతున్నారు. వస్తే ఎక్కడ రేప్ చేస్తారో అని. మహిళ రక్షణ విషయంలో ఇండియాపై ప్రపంచానికి ఉన్న అభిప్రాయం దారుణంగా ఉంది" అని లక్ష్మి అభిప్రాయపడింది.
మంచు మోహన్ బాబు కూతురు అయిన మంచు లక్ష్మి హైదరాబాద్ వదిలేసి బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో తన ఎదుగుదలను తన కుటుంబమే అడ్డుకుంటుందన్నట్లుగా ఆమె ఆ మధ్య మాట్లాడిన విషయం తెలిసిందే.