తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kollywood Ott: ఇది కోలీవుడ్ కాంతార - ఓటీటీలోకి వచ్చిన త‌మిళ డ్రామా థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్‌

Kollywood OTT: ఇది కోలీవుడ్ కాంతార - ఓటీటీలోకి వచ్చిన త‌మిళ డ్రామా థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్‌

22 August 2024, 20:47 IST

google News
  • Kollywood OTT: త‌మిళ మూవీ జామా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఈ థ్రిల్ల‌ర్ డ్రామా మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం.

కోలీవుడ్ ఓటీటీ
కోలీవుడ్ ఓటీటీ

కోలీవుడ్ ఓటీటీ

Kollywood OTT: కోలీవుడ్‌ డ్రామా థ్రిల్ల‌ర్ మూవీ జామా ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ కోలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. త‌మిళ‌నాడులోని అతి ప్రాచీన‌మైన జాన‌ప‌ద క‌ళ‌ తేరుకూత్తు నేప‌థ్యంలో జామా మూవీ తెర‌కెక్కింది. భార‌తీయ పురాణాల‌తో పాటు త‌మిళ ఇతిహాసాలు, చ‌రిత్ర‌ను తేరుకూత్తు క‌ళారూపం ద్వారా క‌ళాకారులు చెబుతుంటారు. అంత‌రించిపోతున్న ఈ క‌ళ విశిష్ట‌త‌ను, క‌ళాకారుల దుస్థితిని వాస్త‌విక కోణంలో ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కిన జామా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది.

హీరో క‌మ్ డైరెక్ట‌ర్‌...

ప‌రి ఎల‌వ‌జ‌గ‌న్ హీరోగా న‌టిస్తూ న‌టిస్తూ జామా మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హీరోగా, ద‌ర్శ‌కుడిగా ఇదే అత‌డికి మొద‌టి మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాలో అమ్ము అభిరామి, చేత‌న్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ డ్రామా మూవీలో చాలా మంది నిజ‌మైన తేరుకూత్తు క‌ళాకారులు కూడా న‌టించారు.

ఈ చిన్న సినిమాకు దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌యరాజా మ్యూజిక్ అందించాడు. వీధి నాట‌కాల‌ను రియ‌లిస్టిక్‌గా త‌ల‌పించేలా ఇళ‌యరాజా అందించిన పాట‌లు, బీజీఎమ్ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాయి.

ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి...

ఆగ‌స్ట్ 2న థియేట‌ర్ల‌లో రిలీజైన జామా మూవీ కేవ‌లం ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చింది. క‌థ‌, క‌థ‌నాలు, టేకింగ్ ప‌రంగా ప్ర‌శంస‌లు ద‌క్కినా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం జామా అంత‌గా ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోలేక‌పోయింది. క‌థ‌నం వీధి నాట‌కాల‌ను త‌ల‌పిస్తూ ఆర్ట్ సినిమాలా నెమ్మ‌దిగా సాగ‌డం ఈ సినిమాకు మైన‌స్ అయ్యింది. కొత్త న‌టీన‌టులు ఉండ‌టం కూడా వ‌సూళ్లు అంత‌గా రాక‌పోవ‌డానికి కార‌ణ‌మైంది. అయితే జామా సినిమాను కొంద‌రు కాంతార‌తో పోల్చారు. మ‌స్ట్ వాచ్ మూవీ అంటూ పేర్కొన్నారు.

జామా క‌థ ఇదే...

క‌ళ్యాణం తండ్రి తేరుకూత్తు క‌ళ‌లో గొప్ప పేరు సంపాదిస్తాడు. తండ్రి బాట‌లోనే క‌ళ్యాణం అడుగులు వేస్తాడు. రామ‌చంద్ర నాట‌క స‌భ‌లో క‌ళాకారుడిగా చేరుతాడు. ఈ ట్రూప్ వేసే నాట‌కాల్లో క‌ళ్యాణం ఆడ‌వేషాలు వేస్తుంటాడు. ఈ ఆడ‌వేషాల వ‌ల్ల అత‌డి మాట‌తీరు, న‌డ‌క మొత్తం అమ్మాయిలా మారిపోతుంది. ఈ నాట‌కాల వ‌ల్ల క‌ళ్యాణానికి పెళ్లికావ‌డం క‌ష్టంగా మారుతుంది. క‌ళ్యాణం ప్రేమించిన జేగా ఎవ‌రు? తేరుకూత్తు క‌ళ ద్వారా తండ్రి పేరును క‌ళ్యాణం ఎలా నిల‌బెట్టాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

వీధి నాట‌కాల క‌ల‌ను మాత్ర‌మే కాకుండా ఈ క‌ళ‌లో ఉండే కుట్ర‌లు, కుతంత్రాల‌ను, క‌ళ‌కు స‌రైన ఆద‌ర‌ణ లేక క‌ళాకారులు ప‌డుతోన్న ఆవేద‌న‌ను హృద్యంగా ద‌ర్శ‌కుడు ఈ మూవీలో చూపించాడు.

9.4 రేటింగ్‌...

ఐఎమ్‌డీబీలో ఈ మూవీకి ఏకంగా 9.4 రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం. ఆగ‌స్ట్‌లో రిలీజైన సినిమాలో ఐఎమ్‌డీబీలో హ‌య్యెస్ట్ రేటింగ్ సొంతం చేసుకున్న సినిమాగా జామా నిలిచింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం