Kalki 2898 AD Runtime: ఓటీటీలో 6 నిమిషాలు తగ్గిపోయిన కల్కి 2898 ఏడీ రన్‌టైమ్.. కారణం ఇదే
Kalki 2898 AD Runtime: కల్కి 2898 ఏడీ మూవీ రన్ టైమ్ ఓటీటీలో ఏకంగా 6 నిమిషాలు తగ్గిపోవడం విశేషం. గురువారం (ఆగస్ట్ 22) నుంచి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మహా బ్లాక్ బస్టర్ మూవీలో కొన్ని సీన్లను ట్రిమ్ చేయడమే దీనికి కారణం. మరి ఆ సీన్లేవో చూడండి.
Kalki 2898 AD Runtime: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలుసు కదా. మొత్తానికి 50 రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. అది కూడా ఒకేసారి రెండు ఓటీటీల్లో ఈ మూవీ వివిధ భాషల వెర్షన్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఆ వెర్షన్లన్నీ 6 నిమిషాల పాటు ట్రిమ్ కావడం విశేషం.
కల్కి 2898 ఏడీ రన్ టైమ్
కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న ఏకంగా 181 నిమిషాలు అంటే 3 గంటల ఒక నిమిషం నిడివితో థియేటర్లలో రిలీజైంది. నిజానికి ఇది చాలా ఎక్కువ రన్ టైమే. సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. నిడివి విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఓటీటీలోకి వచ్చే సమయానికి మేకర్స్ ఏకంగా 6 నిమిషాలను తగ్గించేశారు.
ప్రస్తుతం ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలోకి వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ నిడివి 175 నిమిషాలుగా అంటే 2 గంటల 55 నిమిషాలుగానే ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో కేవలం హిందీ వెర్షన్ రాగా.. ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల వెర్షన్లు వచ్చాయి.
రన్‌టైమ్ తగ్గడానికి కారణమిదే..
కల్కి 2898 ఏడీ ఓటీటీ స్ట్రీమింగ్ లో కొన్ని సీన్లను ట్రిమ్ చేయడంతో మూవీ ఆరు నిమిషాల పాటు తగ్గిపోయింది. ఆ సీన్లలో మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్. ఈ సీన్ నిడివి కాస్త ఎక్కువగా అనిపించడంతో దానిని తొలగించారు. ఇందులో ప్రభాస్ ను కప్ప అని పిలిచే సీన్ ఉంటుంది. దానిని తీసేసినట్లు ఓటీటీ వెర్షన్ చూస్తే తెలుస్తోంది.
ప్రభాస్ ఇంట్రడక్షన్ తర్వాత అతడు ఇద్దరు భారీ కాయులతో చేసే ఫైట్ సీన్ నిడివిని కూడా తగ్గించారు. ఇక కాంప్లెక్స్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ దిశా పటానీతో ప్రభాస్ సాంగ్ ను కూడా కత్తిరించేశారు. బీచ్ సీన్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ సీన్లో దీపికా మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్ ను ట్రిమ్ చేయడంతో ఇంటర్వెల్ కార్డును తీసేశారు.
అక్కడ థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్ ను జోడించారు. ఇక డబ్బింగ్ లోనూ అక్కడక్కడా పలు మార్పులు చేశారు. దీంతో ఓటీటీ వెర్షన్ థియేటర్ కంటే కాస్త మెరుగ్గా అనిపిస్తోంది. మొత్తానికి సినిమా నిడివి ఆరు నిమిషాలు తగ్గించడంతో కల్కి 2898 ఏడీ మరింత మందిని మెప్పించే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.