Action Thriller OTT: ఓటీటీలోకి లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ - తెలుగు, తమిళంలో ఒకే రోజు రిలీజ్!
Action Thriller OTT: గౌతమ్ వాసుదేవమీనన్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ లిస్ట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 9 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
Action Thriller OTT: శరత్‌కుమార్, గౌతమ్ మీనన్ సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్‌లిస్ట్ ఓటీటీలోకి రాబోతోంది. జూలై 9 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజు రిలీజ్ కానుంది. హిట్ లిస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా తమిళ్ ఓటీటీ ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఓ యాక్షన్ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది.
సీనియర్ డైరెక్టర్ తనయుడు హీరోగా...
తమిళ సీనియర్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హిట్ లిస్ట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు సూర్య కథిర్, కే కార్తికేయన్ దర్శకత్వం వహించారు. హిట్ లిస్ట్ మూవీని కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ప్రొడ్యూస్ చేశారు.
తన సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు కేఎస్ రవికుమార్ కేవలం మూడు సినిమాలను మాత్రమే నిర్మించారు. అందులో హిట్ లిస్ట్ ఒకటి. 2022లో ఈ సినిమా మొదలైంది. షూటింగ్ త్వరగానే పూర్తయినా అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమైంది. మే 31న థియేటర్లలో తెలుగు, తమిళంలో ఒకే రోజు రిలీజైన ఈ మూవీ నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
హిట్ లిస్ట్ కథ ఇదే...
విజయ్ (విజయ్ కనిష్క) గొడవలకు, హింసకు దూరంగా సింపుల్ లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. ఓరోజు తల్లితో (సితార) పాటు చెల్లిని ఓ మాస్క్‌మ్యాన్ కిడ్నాప్ చేస్తాడు. తాను చెప్పిన ఓ ఇద్దరిని మర్డర్ చేస్తేనే విజయ్ తల్లిని, చెల్లిని క్షేమంగా వదిలిపెడతానని ఆ కిడ్నాపర్ కండీషన్ పెడతాడు.
ఈ కేసును ఏసీసీ యెజ్వందన్ (శరత్ కుమార్) ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. అతడి ఇన్వేస్టిగేషన్‌లో ఏం తేలింది? విజయ్ ఫ్యామిలీ మెంబర్స్‌ను కిడ్నాప్ చేసిన మాస్క్ మ్యాన్ ఎవరు? ఆ కిడ్నాపర్ బారి నుంచి తన వాళ్లను కాపాడుకోవడానికి అతడు చెప్పిన వాళ్లను విజయ్ చంపాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
కేజీఎఫ్ విలన్...
శరత్‌కుమార్, సముద్రఖని, గౌతమ్‌మీనన్‌తో పాటు కేజీఎఫ్ విలన్ రామచంద్రరాజు వంటి సీనియర్ యాక్టర్లు ఈ సినిమాలో కనిపించడంతో హిట్‌లిస్ట్‌పై రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకద్వయం ఈ సినిమాను తెరకెక్కించారు. అసలు కథలోని వెళ్లడానికి టైమ్ ఎక్కువగా తీసుకోవడం, ఫ్యామిలీ సెంటిమెంట్ సరిగా వర్కవుట్ కాకపోవడంతో హిట్ లిస్ట్ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
తెలుగులోనూ...
విక్రమన్ తమిళంలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు. సూర్యవంశం, ఉన్నిదాతిల్ ఎన్నై కొడుతెన్, వానతైపోలాతో అతడు దర్శకత్వం వహించిన పలు తమిళ సినిమాలు జాతీయ అవార్డులతో పాటు కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలన్నీ తెలుగులోకి రీమేకయ్యాయి. డైరెక్ట్‌గా తెలుగులోనూ వెంకటేష్ వసంతం, వేణు చెప్పవే చిరుగాలి సినిమాలకు విక్రమన్ దర్శకత్వం వహించాడు.