Pakka Commercial Review: ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ రివ్యూ.. నో లాజిక్స్.. ఓన్లీ ఫన్-gopichand pakka commercial movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pakka Commercial Review: ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ రివ్యూ.. నో లాజిక్స్.. ఓన్లీ ఫన్

Pakka Commercial Review: ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ రివ్యూ.. నో లాజిక్స్.. ఓన్లీ ఫన్

Nelki Naresh Kumar HT Telugu
Jul 01, 2022 12:51 PM IST

Pakka Commercial Movie Review: పక్కా కమర్షియల్ మూవీ రివ్యూ: మారుతి సినిమా అంటే న‌వ్వుల‌కు లోటు ఉండ‌ద‌నే న‌మ్మ‌కం టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఉంది. గోపీచంద్ సినిమా అనగానే యాక్ష‌న్,హీరోయిజాన్ని ఆశించి ప్రేక్ష‌కులు థియేటర్లలో అడుగుపెడ‌తారు. ఈ రెండు హంగుల స‌మ్మిళితంగా గోపీచంద్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌.

<p>ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌</p>
ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ (twitter)

Pakka Commercial Movie Review: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వినోదాత్మ‌క చిత్రాల్ని రూపొందించే ద‌ర్శ‌కులు ప‌రిమిత సంఖ్య‌లో ఉన్నారు. వారిలో మారుతి ముందువ‌రుస‌లో నిలుస్తాడు. ప్ర‌యోగాల‌తో కూడిన డిఫ‌రెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ ప్రతి సినిమాతో ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డానికే తాప‌త్ర‌ప‌య‌ప‌డుతుంటాడు మారుతి. మాస్, యాక్ష‌న్ సినిమాల‌కు టాలీవుడ్‌లో కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్నాడు హీరో గోపీచంద్‌. భిన్న ధృవాల్లాంటి వీరిద్ద‌రి కాంబినేషన్ లో తొలిసారి రూపొందిన చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌. మారుతి మార్కు కామెడీతో పాటు గోపీచంద్ శైలి యాక్ష‌న్ అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. సుదీర్ఘ విరామం త‌ర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ క‌థాంశంతో గోపీచంద్ చేసిన సినిమా ఇది. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2, యూవీ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను బ‌న్నీవాస్ నిర్మించారు.

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ కథ ఇదీ..

సూర్యనారాయణ (సత్యరాజ్) నిజాయితీపరుడైన న్యాయమూర్తి. త‌న మ‌నఃసాక్షికి వ్య‌తిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిరావ‌డంతో జ‌డ్జి ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టి కిరాణా షాప్ పెట్టుకున్నాడు. తండ్రి బాట‌లోనే అత‌డి కొడుకు ల‌క్కీ (గోపీచంద్ )లాయ‌ర్‌గా మార‌తాడు. తండ్రి సిద్ధాంతాల‌కు ల‌క్కీ పూర్తిగా వ్య‌తిరేకం. డ‌బ్బుల కోసం క్రిమిన‌ల్స్ ను కాపాడుతూ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లాయ‌ర్‌గా పేరుతెచ్చుకుంటాడు.

తండ్రి ద‌గ్గ‌ర మాత్రం ఆ నిజాన్ని దాస్తాడు. శిరీషా అలియాస్ లాయ‌ర్ ఝాన్సీ(రాశీఖన్నా) ద్వారా ల‌క్కీ నిజ స్వ‌రూపం సూర్య‌నారాయ‌ణ‌కు తెలుస్తుంది. తాను ఏ కేసు కార‌ణంగా అయితే జ‌డ్జి ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టాడో అదే వివేక్ (రావురమేష్) కేసులో కొడుకు ల‌క్కీకి వ్య‌తిరేకంగా వాదించ‌డానికి ఇర‌వై ఐదేళ్ల తర్వాత కోర్టులో అడుగుపెడ‌తాడు. న్యాయాన్ని గెలిపించ‌డానికి కొడుకుపై చేసిన పోరాటంలో సూర్య‌నారాయ‌ణ గెలిచాడా? తండ్రి సిద్ధాంతాల‌కు వ్య‌తిరేకంగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లాయ‌ర్‌గా ల‌క్కీ మార‌డానికి కార‌ణ‌మేమిటి? వివేక్ ను తండ్రీకొడుకులు ఇద్ద‌రు క‌లిసి ఎలా దెబ్బ‌కొట్టార‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

నో లాజిక్స్…

లాజిక్‌ల‌తో సంబంధం లేకుండా ఏదో ఒక మ్యాజిక్ చేసి ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డానికే నేటి తరం ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రెండున్న‌ర గంట‌లు న‌వ్విస్తే విజ‌య‌వంత‌మైన‌ట్లేన‌నే భావ‌న‌తో క‌థ‌లు రాసుకుంటున్నారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో ద‌ర్శ‌కుడు మారుతి అదే ప్ర‌య‌త్నం చేశారు.

న్యాయ‌శాస్త్రానికి లాయ‌ర్లే మూల‌స్థంభాలు. న్యాయమూర్తులు తీర్పు మాత్ర‌మే ఇవ్వ‌గ‌ల‌రు. ఆ తీర్పును డిసైడ్ చేయ‌డ‌మే కాకుండా న్యాయాన్ని గెలిపించే శ‌క్తి లాయ‌ర్ల‌కు మాత్రమే ఉంటుంద‌నే పాయింట్‌కు కామెడీని జోడించి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ క‌థ‌లోనే అంత‌ర్లీనంగా తండ్రీకొడుకుల ఎమోష‌న్స్‌, ల‌వ్ స్టోరీ, మాస్‌, యాక్ష‌న్ అంశాలు ఉండేలా ద‌ర్శ‌కుడు మారుతి జాగ్ర‌త్త‌ప‌డ్డారు.

కామెడీ దారిలో..

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ రివేంజ్ డ్రామాగా సీరియ‌స్‌గా చెప్ప‌వ‌చ్చు. రోటీన్ దారిలో కాకుండా ప్రేక్ష‌కుల‌కు ఆద్యంతం వినోదాన్ని పంచుతూ ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను మ‌లిచారు దర్శకుడు. స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు సీరియ‌స్ అంశాల‌పై సెటైర్స్ వేస్తూ రాసుకున్న డైలాగ్స్ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయి. ఏపీ రాజ‌ధానుల మార్పు, టీవీల్లో వ‌చ్చే క్రైమ్‌ సీన్ రిక‌న్ట్ర్స‌క్ష‌న్ లాంటి సీన్స్, అభిమానుల వార్ ఇలా ప‌లు అంశాల‌ను ఈ సినిమాలో చూపించారు. లాజిక్స్ తో సంబంధం లేని స్ఫూఫ్ కామెడీ తో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు మారుతి.

వినోదమే పరమావధిగా…

తండ్రికి తెలియ‌కుండా గోపీచంద్ కేసుల‌ను టేకాప్ చేసే స‌న్నివేశాల‌తో సినిమా స‌ర‌దాగా మొద‌ల‌వుతుంది. న‌వ్వించ‌డ‌మే సినిమా ఉద్దేశం అని హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌తోనే ద‌ర్శ‌కుడు చూపించారు. సినిమాల‌పై పిచ్చితో లాయ‌ర్‌గా మారిన యువ‌తిగా రాశీఖ‌న్నా క్యారెక్ట‌ర్ చేసే హంగామా న‌వ్విస్తుంది. ప్ర‌త్యేక‌మైన కామెడీ ట్రాక్‌గా కాకుండా స‌త్య‌రాజ్ కు స‌హాయ‌ప‌డుతూనే ఆమె పాత్ర నుండి కావాల్సినంత కామెడీని రాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

కొడుకు నిజ‌స్వ‌రూపం సూర్య‌నారాయ‌ణ కు తెలియ‌డం, ల‌క్కీకి వ్య‌తిరేకంగా కేసును చేప‌ట్టే సీన్‌తో విరామంలో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ద్వితీయార్థం మొత్తం తండ్రీ కొడుకులు ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు పై ఎత్తుల‌తో నడుస్తుంది. ల‌క్కీకి వ్య‌తిరేకంగా సాక్ష్యాల‌ను సంపాదించ‌డానికి సూర్య‌నారాయ‌ణ ప్ర‌య‌త్నాలు చేస్తూ ఓడిపోవ‌డం ఉత్కంఠ‌ను పంచుతుంది. క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ తో కొత్త మ‌లుపు తిరిగింది. అస‌లు ల‌క్కీ ల‌క్ష్యం ఏమిటో చెబుతూ రెగ్యుల‌ర్ క్లైమాక్స్‌కు భిన్నంగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను ముగించారు మారుతి.

పక్కా కమర్షియలే..

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా కోసం మారుతి ఎంచుకున్న పాయింట్ చాలా పాత‌ది. ఈ తండ్రీకొడుకుల ఫార్ములాతో ఎన్నో సినిమాలొచ్చాయి. ఈ పాత పాయింట్‌కు త‌న‌దైన శైలి కామెడీ టైమింగ్‌ను జోడిస్తూ సినిమాను తెర‌కెక్కించారు. కామెడీకి ప్రాధాన్య‌త‌నిచ్చే క్ర‌మంలో చాలా చోట్ల క‌థ ప‌క్క‌దారి ప‌ట్టింది.ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డం కోసం ఒక స‌మ‌యంలో బూతును ఆశ్ర‌యించారు మారుతి. ద్వంద్వార్థాల‌తో కూడిన డైలాగ్స్ ను ఎక్కువ‌గా ఉప‌యోగించారు. అవ‌న్నీ ఫ్యామిలీ ప్రేక్ష‌కుల్ని ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది. ద్వితీయార్థంలో పూర్తిగా సాగ‌తీత‌గా సినిమా సాగింది. సీన్స్ మొత్తం రిపీటెడ్‌గా వ‌చ్చిన భావ‌న క‌లుగుతుంది. క్లైమాక్స్ కూడా కొత్త‌గా ఉండ‌దు. రొటీన్ మ‌లుపుగానే అనిపిస్తుంది.

స్టైలిష్ క్యారెక్టర్ లో…

డ‌బ్బుకు అమితంగా ప్రాధాన్య‌మిచ్చే లాయ‌ర్‌గా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర‌లో గోపీచంద్ కొత్త‌గా క‌నిపించాడు. స్టైలిష్ లుక్ తో పాటు డిఫ‌రెంట్ డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. బేసిగ్గా నేను విల‌న్ అంటూ అత‌డు చెప్పే సంభాష‌ణ‌లు మెప్పిస్తాయి.

లౌక్యం త‌ర్వాత త‌న కామెడీ టైమింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. సీరియ‌ల్స్ పై అభిమానం ఉన్న లాయ‌ర్ గా కామెడీ పాత్ర‌లో ఆద్యంతం రాశీఖ‌న్నా న‌వ్వించింది. అమాయ‌క‌త్వం, అల్ల‌రిత‌నం క‌ల‌బోసిన పాత్ర‌లో ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్స్ తో మెప్పించింది. హీరో తండ్రి పాత్ర‌లో స‌త్య‌రాజ్ క‌నిపించారు. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం త‌న‌కు అల‌వాటే కావ‌డంతో కొత్త‌ద‌నం లేదు.

రావుర‌మేష్ విల‌నిజం కూడా రొటీన్ గా నే సాగింది. సీరియ‌స్ స‌న్నివేశాల్లో ఆయన చెప్పే సెటైరిక‌ల్ డైలాగ్స్ న‌వ్విస్తాయి. స‌ప్త‌గిరి, వైవాహ‌ర్ష‌, ప్ర‌వీణ్ తో పాటు అజ‌య్ ఘోష్ కామెడీ కొన్ని చోట్ల వ‌ర్క‌వుట్ అయ్యింది.

ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా మారుతి అక్క‌డ‌క్క‌డ మాత్రమే మెరిశారు. సినిమా మొత్తం ఆ జోరు క‌నిపించ‌లేదు. జేక్స్ బిజోయ్ నేప‌థ్య సంగీతం ఓకే కానీ పాట‌లు మాత్రం విన‌సొంపుగా లేవు.

టైమ్ పాస్ ఎంటర్ టైనర్ …

రెండున్న‌ర గంట‌లు ప్రేక్ష‌కుల్ని న‌వ్వించాల‌నే ల‌క్ష్యంతో రూపొందిన సినిమా ఇది. ఈ ప్ర‌య‌త్నంలో పూర్తిగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ టీమ్ విజ‌య‌వంతం కాలేదు. క‌థ‌, క‌థ‌నాల గురించి ఆలోచించ‌కుండా సినిమా చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు.

రేటింగ్: 2.75/ 5

Whats_app_banner

సంబంధిత కథనం