Karthika Deepam Today December 20: తాతకు కార్తీక్ గట్టి సవాల్.. ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయం.. నిలదీసిన దీప
20 December 2024, 7:59 IST
- Karthika Deepam 2 Today Episode December 20: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో తాత శివన్నారాయణతో కార్తీక్ ఛాలెంజ్ చేశాడు. తాత రెచ్చగొట్టడంతో ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయేందుకు రెడీ అయ్యాడు. దీప సర్దిచెప్పినా వినడు. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Karthika Deepam Today December 20: తాతకు కార్తీక్ గట్టి సవాల్.. ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయం.. నిలదీసిన దీప
కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 20) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప పేరుతో కార్తీక్ రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్న విషయంపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. కార్తీక్ ఇంటికి వచ్చి మరీ గొడవ పెట్టుకొని మాటలు అంటాడు. ముత్యాలమ్మ గూడెంలో సైకిల్‍పై టిఫిన్ సెంటర్ నడుపుకునే దీప ఇప్పుడు హైదరాబాద్‍లో స్టార్ రెస్టారెంట్‍కు ఓనర్ అవుతోందని, ఆమెపైనే ఆ రెస్టారెంట్ ఉండనుందంటూ వెటకారంగా మాట్లాడతాడు శివన్నారాయణ. “రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎవరో కష్టపడి సంపాదించిన దాంతో తను గొప్పది అవడం నిజంగా గొప్ప విషయమే కదా” అని అంటాడు.
నా భార్య పేరు పెడితే మీకేంటి
దీపను మాటలు అంటుంటే కార్తీక్ ఫైర్ అవుతాడు. నచ్చకపోతే నచ్చనట్టు ఉండాలని, ఇంటికి వచ్చి అవమానిస్తారా అని అంటాడు. నిజాలు మాట్లాడితే మీ బావకు కోపం వస్తోందని జ్యోత్స్నకు శివన్నారాయణ అంటాడు. “నిజాలు ఏంటి తాత.. దీప నా భార్య. నా భార్య పేరు మీద రెస్టారెంట్‍లు పెడతాను. బిల్డింగ్‍లు కడతాను. మీకేంటి. పెట్టుబడికి నీ దగ్గర ఏమైనా డబ్బులు అడుగుతున్నానా” అని కార్తీక్ అంటాడు.
ఇల్లు తాకట్టు పెట్టనివ్వను
రెస్టారెంట్ పెట్టడానికి ఏం తాకట్టు పెట్టావని శివన్నారాయణ అడుగుతాడు. నా ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టి రెస్టారెంట్ పెడుతున్నానని కార్తీక్ అంటాడు. నీ ఇల్లా.. నీ కష్టంతో కట్టావా.. నీ భార్య కష్టంతో కట్టావా అంటూ వెటకారంగా అంటాడు శివన్నారాయణ. మా అమ్మ ఇళ్లు అని కార్తీక్ అంటే.. మీ అమ్మకు ఎక్కడి నుచి వచ్చిందని ప్రశ్నిస్తాడు. ఇల్లు తన కష్టార్జితమని, దీన్ని తాకట్టు పెడతానంటే చూస్తూ ఊరుకోనని తెగేసి చెబుతాడు. తనను కాదనుకున్నప్పుడు, తన ఆస్తులపై పెత్తనం ఏంటి అని అంటాడు.
రెచ్చగొట్టిన తాత
“నీకు అంత పౌరుషం ఉంటే నువ్వు నా మీద గెలవాలని అనుకుంటే.. నాది అనేది ఏదీ ముట్టుకోకుండా గెలవరా. అప్పుడు నీ మొనగాడివని ఒప్పుకుంటా. ఏం నోరు పడిపోయిందా. ఇప్పటికైనా అర్థమైందా. ఈ తాత పేరు చెప్పకపోతే మీ బతుకు తెల్లవారదని” అని శివన్నారాయణ అంటాడు. తాను తలుచుకుంటే ఎప్పుడో తన దారికి తీసుకొచ్చేవాడనని కార్తీక్‍ను శివన్నారాయణ రెచ్చగొడతాడు.
కార్తీక్ ఛాలెంజ్
కోపంతో ఇంటి పేపర్లను కార్తీక్ చించేస్తాడు. తనకు ఇది వద్దని తెగేసి చెబుతాడు. ఆస్తులే కాదు.. మీ ఒంటి మీద బంగారం, కార్లు, క్రెడిట్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు, చివరికి ఫర్నీచర్ కూడా నేనే కొనిచ్చానని శివన్నారాయణ అంటాడు. నాన్న అని కాంచన అంటే.. “నువ్వు ఆగమ్మా. ఇది నీ కొడుకు అహంకారానికి.. నీ తండ్రి పెద్దరికానికి జరుగుతున్న యుద్ధం. ఎన్ని వదులుకుంటాడో చూద్దాం” అని శివన్నారాయాణ అంటే.. అన్ని వదులుకుంటానని కార్తీక్ అరుస్తాడు.
తాత శివన్నారాయణతో ఛాలెంజ్ చేస్తాడు. ఇది తన ఆత్మాభిమానానికి.. ఈ పెద్ద మనిషి అహంకారానికి జరుగుతున్న యుద్ధం అని దీపతో కార్తీక్ అంటాడు. “ఈరోజు తారీఖు గుర్తు పెట్టుకో తాత. సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో రెస్టారెంట్ పెట్టి.. బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోకపోతే నా పేరు కార్తీకే కాదు” అని శివన్నారాయణతో కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు.
నా భార్యను చూసే పొగరు
ఎవరిని చూసే నీకు ఈ పొగరు అని శివన్నారాయణ అంటే.. నా భార్యను చూసి అని కార్తీక్ అంటాడు. ఈ మగాడి సవాల్ వెనుక నా భార్య ఉందని అంటాడు. నీ భార్య వెనుక నిలబడితే ఏదీ మిగలదని శివన్నారాయణ భయపెడతాడు. నేను ఇచ్చే నీడ కూడా వద్దంటానేమోనని శివన్నారాయణ వెటకరిస్తాడు. వద్దు అని కార్తీక్ అంటాడు.
ఇంటి నుంచి వెళ్లిపోతా..
ఇంకా నయం కట్టుబట్టలతో వెళ్లిపోతా అనలేదు అని శివన్నారాయణ అంటాడు. “నువ్వు వెటకారంగా అన్నా ఈ మాటే నిజం తాత. ఎవరో సంపాదించినది నాకు ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. నా నీడ.. నా తిండి నేనే సంపాదించుకుంటాను. మిస్టర్ శివన్నారాయణ ఈ క్షణమే నా కుటుంబాన్ని తీసుకొని ఈ ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాను” అని కార్తీక్ తెగేసి చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది.
సుమిత్ర కన్నీరు
ఏం గొడవ జరుగుతుందోనని సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. కన్నీరు పెట్టుకుంటుంది. మీ మామయ్య వెళ్లింది గొడవ చేసుకుందుకు కాదని, ఘోరం ఆపేందుకు అని పారిజాతం అంటుంది. కార్తీక్‍ను ఆఫీస్ నుంచి బయటికి పంపేయడం సరిపోలేదా, రెస్టారెంట్ కూడా పెట్టనివ్వరా అని సుమిత్ర అంటుంది. తాము అక్కడికి వెళతామని, మామయ్యతో తాను మాట్లాడతానని భర్త దశరథ్‍తో అంటుంది. దీంతో తానే వెళతానని దశరథ్ అంటాడు.
శివన్నారాయణను నిలదీసిన దీప
రెస్టారెంట్ పెట్టేలా కార్తీక్‍ను రెచ్చగొట్టావని జ్యోత్స్న అంటే.. నువ్వు చూశావా అని దీప ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చూడకపోయినా ఎవరు ఎలాంటి వారో నాకు తెలుసు అని శివన్నారాయణ అంటాడు. “ఏంటి మీకు తెలిసింది.. ఒక మనిషి నచ్చలేదని కడుపున పుట్టిన వారు వదిలేయవచ్చు. కలిసి బతికిని వాళ్లు కూడా వదిలేయవచ్చు. కానీ కన్నవాళ్లను వదిలేయరు. అల్లుడు తప్పు చేశాడని కన్న కూతురినే వదిలేశారు మీరు. మీకు ఎలా ఉందో తెలియదు కానీ.. ఆ మనిషి మాత్రం పుట్టింటికి దూరమే రోజు ఏడుస్తోంది” అని కాంచన విషయంలో శివన్నారాయణను దీప నిలదీస్తోంది.
మోసం చేసిన మనిషి నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదని, సౌభాగ్నాన్ని సవతికే వదిలేసిందని దీప అంటుంది. అలాంటి కూతురిని కన్నందుకు గర్వపడాలని, అలాంటి పని చేశారని దీప ప్రశ్నిస్తుంది. జ్యోత్స్న మధ్యలో వస్తే.. నువ్వు సమాధానం చెప్పు అని దీప అంటుంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి అని శివన్నారాయణ అంటాడు. తండ్రిని మోసం చేసిన కూతురువి నువ్వు అని కాంచనపై కూడా మళ్లీ అరుస్తాడు.
నా ఇష్టంతో జరిగింది
జ్యోత్స్నతో కార్తీక్ పెళ్లి తనకు ఇష్టం లేకపోయినా మీరే అడిగారని కాంచనతో శివన్నారాయణ అంటాడు. కానీ ఆ తర్వాత దీపను కార్తీక్ పెళ్లి చేసుకున్నా ఏమీ అనలేదని అడుగుతాడు. మేనకొడలిని కాదని, వంట మనిషితో నీ పెళ్లి చేయించిందని కాంచను ఉద్దేశించి జ్యోత్స్న మాట్లాడుతుంది. అది తన ఇష్టప్రకారం జరిగిందని కార్తీక్ అంటాడు.
కూతురి మీద ప్రేమను, బంధాలను ఆఫీస్‍లో ఉద్యోగంలా శివన్నారాయణ చూస్తాడని, నచ్చితే ఉంచుతాడని.. నచ్చకపోతే పీకేస్తాడని కార్తీక్ అంటాడు. బావ అని జ్యోత్స్న మధ్యయలో కల్పించుకుంటే.. మనసుకు నొచ్చుకుంటుందా అని కార్తీక్ అంటాడు.
తండ్రివని చూడను
కన్న తండ్రివి కాబట్టి నన్ను ఏమైనా అను.. నా కొడుకును మాత్రం ఏమీ అనకు అని కాంచన అంటుంది. అంటే ఏం చేస్తావని శివన్నారాయణ అంటే.. “కూతురు అని నువ్వు చూడనట్టే.. తండ్రివని నేనూ చూడను. నువ్వు కొట్టినా ఇంత బాధపడే దాన్ని కాదు. మాటలతో నన్ను నా కొడుకుని చంపేస్తున్నావ్. ఇక భరించడం నా వల్ల కాద” అని కాంచన ఏడుస్తుంది.
అనసూయ మాట్లాడితే.. సొంత వాళ్లను కాదని బయటికి వాళ్లను సపోర్ట్ చేస్తావా అని జ్యోత్స్న అంటుంది. వీళ్లు బయటి వాళ్లు కాదు.. నా సొంతవాళ్లు.. ఆవిడ నా భార్యకు మేనత్త.. నాకు పెద్దమ్మ అవుతుందని కార్తీక్ చెబుతాడు. తాను స్థాయి అంటే అభిమానంతో చూస్తానని తేల్చిచెబుతాడు.
క్షమించాలంటే ఏం చేయాలి
తమను క్షమించి.. కార్తీక్‍ను ఆశీర్వదించాలని కాంచన అడుగుతుంది. దీంతో సవాల్ వెనక్కి తీసుకుంటాడా, నేను చెప్పినవి చేస్తాడా అని శివన్నారాయణ అడుగుతాడు. “ఆఫీస్‍లో అందరి ముందు క్షమాపణ చెప్పి నీ కొడుకు నేను చెప్పిన ఉద్యోగం చేయాలి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు తెలియాలి. దీప పేరుతో రెస్టారెంట్ పెట్టాలనుకున్న మీ నిర్ణయం ఆగిపోవాలి. దీప నా ఆఫీస్‍కు, ఇంటికి రాకూడదు. వీటికి ఒప్పుకుంటే మిమ్మల్ని క్షమిస్తాను” అని శివన్నారాయణ రూల్స్ పెడతాడు.
నేను ఒప్పుకోను
తాను ఇవి ఒప్పుకోనని కార్తీక్ తెగేసి చెబుతాడు. తాను అంగీకరిస్తానని దీప అంటుంది. కార్తీక్‍కు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తుంది. కార్తీక్ తరఫున తాను క్షమాపణ చెబుతానని అంటుంది. జరిగేదాన్ని ఆపేందుకు ఇదే దారి అని చెబుతుంది. ఆత్మాభిమానాన్ని చంపుకొని తాను అవన్నీ చేయలేనని కార్తీక్ గట్టిగా చెబుతాడు. తాను చేస్తానని దీప అంటుంది. నా పేరు చెప్పుకోకపోతే బతకలేవని ఈ పెద్ద మనిషి అన్నాడని, అది నిజం చేయాలను అనుకుంటున్నావా అని కార్తీక్ అరుస్తాడు. రెండు కుటుంబాలు విడిపోతాయేనని ఒప్పుకుంటున్నాని దీప అంటుంది.
వాళ్లు ఇచ్చింది నా దగ్గరలేకపోయినా.. నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యంతో, ఏదైనా సాధించగలనన్న నమ్మకంతో సవాలు చేశాను, నీ సవాల్ నీ భర్త ఆత్మగౌరవానికి సంబంధించినది అని కార్తీక్ అంటాడు. నీ భర్తను తలదించుకొని బతకమంటావా అని దీపను ప్రశ్నిస్తారు. మీ గౌరవం నా ప్రాణంతో సమానం అని దీప అంటుంది. ఇది భార్యయ లక్షణం అంటే అని కార్తీక్ అంటాడు. “నా భార్య ఏం చెప్పిందో విన్నారు కదా శివన్నారాయణ. నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదు. నేను విసిరిన సవాలు మీదే నిలబతాను. మీరు దానికే కట్టుబడి ఉండండి. నేను ఈ క్షణమే కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్లిపోతాను” అని కార్తీక్ అంటాడు. అమ్మా ఏమంటావని కార్తీక్ అంటే.. నీ మాటే నా మాట అని కాంచన చెబుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 20) ఎపిసోడ్ ముగిసింది.