Karthika Deepam Preview: కార్తీకదీపం ప్రీరిలీజ్ ఈవెంట్.. సీరియల్ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే
21 March 2024, 17:50 IST
- Karthika Deepam Preview: టీవీ సీరియల్స్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయిన వాటిలో ఒకటైన కార్తీకదీపం మళ్లీ వస్తోంది. ఈ సందర్భంగా సీరియల్ ప్రీరిలీజ్ ఈవెంట్ గురువారం (మార్చి 21) హైదరాబాద్ లో జరిగింది.
కార్తీకదీపం ప్రీరిలీజ్ ఈవెంట్.. సీరియల్ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే
Karthika Deepam Preview: తెలుగువారు ఎంతగానో మెచ్చిన సీరియల్ కార్తీకదీపం మరోసారి రాబోతోంది. స్టార్ మా ఛానెల్ ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేయనుంది. కొత్త సీజన్ ప్రారంభానికి ముందు గురువారం (మార్చి 21) హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సీరియల్ యాక్టర్స్, మేకర్స్ గ్రాండ్ గా ఓ ప్రివ్యూ ఈవెంట్ ఏర్పాటు చేయడం విశేషం.
కార్తీకదీపం ఎప్పటి నుంచి అంటే?
కార్తీకదీపం సీరియల్ మార్చి 25 నుంచి స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ను ప్రసారం చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఏడాది తర్వాత ఇప్పుడు కార్తీకదీపం ఇది నవవసంతం పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఈవెంట్ ఆర్గనైజ్ చేశాడు.
ఈ ఈవెంట్ కు సీరియల్లో ప్రధాన పాత్రలు పోషించిన నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ వచ్చారు. మళ్లీ దీప, కార్తీక్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపింది ప్రేమి విశ్వనాథ్. ఇక నిరుపమ్ మాట్లాడుతూ.. అప్పుడే కార్తీకదీపం సీరియల్ అయిపోయి ఏడాది గడిచిందని, ఇప్పటికీ తాను ఎక్కడికెళ్లినా దీని గురించే అందరూ అడుగుతున్నారని చెప్పాడు.
మళ్లీ ఈ సీరియల్లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఈ కొత్త కార్తీకదీపంలో తమ పాత్రలు అవే అయినా కథ మాత్రం కొత్తదని చెప్పి సీరియల్ పై నిరుపమ్ మరింత ఆసక్తి పెంచాడు. ఆ పాత కార్తీకదీపం సీరియల్ కు ఇది కొనసాగింపు కాదని, ఇది పూర్తిగా కొత్త కథతో వస్తున్న సరికొత్త కార్తీకదీపం అని అతడు స్పష్టం చేశాడు.
తాను కూడా ఇందులో పూర్తిగా వంటలక్క కాదని, సగం వంటలక్క.. సగం దీప అని ప్రేమి విశ్వనాథ్ చెప్పింది. ఈ ఇద్దరు నటీనటుల కామెంట్స్ తో కొత్త కార్తీకదీపం సీరియల్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సీరియల్ టెలికాస్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కార్తీకదీపం ఇలా పాపులర్..
కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ నటనకు బుల్లితెర ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. . తెలుగులో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్న సీరియల్స్‌లో ఒకటిగా కార్తీక దీపం నిలిచింది.
కార్తీక దీపం సీజన్ వన్ 2017 అక్టోబర్ 16 నుంచి ప్రారంభమైంది. మొత్తం 1569 ఎపిసోడ్స్‌తో దాదాపు ఆరేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. లాక్‌డౌన్ కారణంగా కొద్ది రోజుల పాటు షూటింగ్ నిలిచిపోవడం, వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను చనిపోయినట్లుగా చూపించడంతో టీఆర్‌పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.
శౌర్య, హిమ క్యారెక్టర్స్‌ను పెద్దవాళ్లు అయినట్లుగా చూపించి కొత్త క్యారెక్టర్‌తో కొన్నాళ్లు సీరియల్‌ను నడిపించారు. కానీ అనుకున్న స్థాయిలో డ్రామా పండకపోవడంతో సరైన ముగింపు లేకుండా అర్థాంతరంగా కార్తీక దీపం సీరియల్‌ను ముగించి ఫ్యాన్స్‌ను డిసపాయింట్ చేశారు.