Zee Telugu New Serial: పుష్ప మేకర్స్ నుంచి కొత్త సీరియల్ మా అన్నయ్య.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Zee Telugu New Serial: అల్లు అర్జున్ తో పుష్ప మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ బుల్లితెరపై సరికొత్త సీరియల్ ను నిర్మిస్తున్నారు. ఈ సీరియల్ పేరు మా అన్నయ్య. జీ తెలుగులో ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది.
Zee Telugu New Serial: మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలతోపాటు ఇప్పుడు సీరియల్స్ నూ నిర్మించే పనిలో పడింది. ఈ మేకర్స్ తాజాగా మా అన్నయ్య పేరుతో ఓ సీరియల్ ను తీసుకొస్తోంది. ఈ సీరియల్ మార్చి 25 నుంచి జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ కొత్త సీరియల్ ప్రసారం అవుతుంది.
మా అన్నయ్య సీరియల్
ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్‌ను అందిస్తున్న జీ తెలుగు మరో సరికొత్త సీరియల్‌ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘మా అన్నయ్య’. ఈ సీరియల్లో అన్నాచెల్లెళ్ల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్తకోణంలో చూపించనున్నారు. అనూహ్యమైన కథతో రానున్న ‘మా అన్నయ్య’ మార్చి 25న ప్రారంభం అవుతుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
మా అన్నయ్య సీరియల్ కథ గంగాధర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రముఖ నటుడు గోకుల్ మీనన్ ఈ గంగాధర్ పాత్రలో కనిపించనున్నారు. చిన్న వయసు నుంచే తన చెల్లెళ్ల బాగోగులు చూసుకునే బాధ్యతను తీసుకున్న ఒక అన్నయ్య కథే మా అన్నయ్య. గంగాధర్ తండ్రి మల్లికార్జున్ (ఉదయ్) బాధ్యతారాహిత్యంగా తాగుడుకు బానిస కావడంతో అతను తన నలుగురు చెల్లెళ్ల బాధ్యత తీసుకుంటాడు.
తల్లి సావిత్రి (రాశి) కూడా చిన్నతనంలోనే పిల్లల్ని వదిలేయడంతో చెల్లెళ్ల బాధ్యత గంగాధర్ తీసుకోవాల్సి వస్తుంది. తన చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి వారి జీవితం ఆనందంగా సాగేలా చూడాలని కలలు కంటాడు గంగాధర్. అందుకోసం చాలా కష్టపడతాడు. కానీ అతని చెల్లెళ్లు వారివారి ఇష్టాలు, లక్ష్యాలకనుగుణంగా సాగాలని భావిస్తారు. ఈ ప్రయాణంలో గంగాధర్, అతని చెల్లెళ్లు ఎదుర్కొనే సవాళ్లు, కష్టాలు, పంచుకునే భావాలు, బాధ్యతల సమాహారమే మా అన్నయ్య సీరియల్.
మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి..
ఒక మధ్యతరగతి కుటుంబంలో తోబుట్టువుల మధ్య బంధాన్ని మా అన్నయ్య సీరియల్ కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఈ సీరియల్‌కు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచనాలను మరింతగా పెంచేశాయి. కుటుంబ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న ఈ సీరియల్ ప్రేక్షకుల అంచనాలను మించి వినోదం పంచేందుకు సిద్ధమవుతోంది.
ఈ షో గ్రాండ్ లాంచ్ గురించి జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ - అనురాధ గూడూరు మాట్లాడుతూ, జీ తెలుగు ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో మరొక విలక్షణమైన కథను తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది. ఆకట్టుకునే కథాంశం, ప్రతిభావంతులైన నటీనటులతో రూపొందుతున్న ఈ కథ మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది.
అంతేకాకుండా, తెలుగు బుల్లితెరపై తొలిసారిగా ఒక కథానాయకుడి కోణం నుంచి చూడబోతున్న మా అన్నయ్య ప్రేక్షకులను తప్పక అలరిస్తుందనే నమ్ముతున్నాను. ఈ సీరియల్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకుల ఆదరణ, మద్దతుతో ఓ అద్భుతమైన కథను విజయవంతంగా కొనసాగిస్తామని ఆశిస్తున్నాం' అన్నారు.
మా అన్నయ్య ప్రారంభంతో మిగతా సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. సోమవారం నుంచి శనివారం వరకు రాధమ్మ కూతురు మధ్యాహ్నం 12 గంటలకు, ఊహలు గుసగుసలాడే మధ్యాహ్నం 3 గంటలకు, చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతాయి. ఇన్నాళ్లుగా ప్రేక్షకులను అలరించిన రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ మార్చి 23న ముగియనుంది.
టాపిక్