Karthika Deepam Season 2: వంటలక్క రీఎంట్రీ - కార్తీక దీపం సీరియల్ సీజన్ 2 టెలికాస్ట్ డేట్, టైమింగ్స్ ఇవే
20 March 2024, 6:06 IST
Karthika Deepam Season 2:కార్తీకదీపం సీరియల్‌కు కార్తీక దీపం ఇది నవ వసంతం పేరుతో సీజన్ 2 రాబోతోంది. మార్చి 25 నుంచి స్టార్ మాలో సీజన్ 2 టెలికాస్ట్ కానుంది. ఈ సీరియల్ టైమింగ్స్ ఏవంటే?
కార్తీక దీపం ఇది నవ వసంతం
Karthika Deepam Season 2: కార్తీక దీపం సీజన్ 2 టెలికాస్ట్ డేట్, టైమింగ్స్ ఫిక్సయ్యాయి. కార్తీక దీపం సీరియల్ బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నది. ఈ సీరియస్‌గా సీక్వెల్‌గా కార్తీక దీపం నవవసంతం పేరుతో సీజన్ 2 రాబోతోంది. సీజన్ 2 మార్చి 25 నుంచి స్టార్‌మా ఛానెల్‌లో టెలికాస్ట్ కానుంది.
సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం ఎనిమిది గంటలకు కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ టెలికాస్ట్ ఉంటుందని స్టార్ మా తెలిపింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సీరియల్‌ను వీక్షించవచ్చని ప్రకటించింది.
కార్తీక దీపంలో డాక్టర్ బాబుగా నిరుపమ్, వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ పాత్రలు అభిమానులను అలరించాయి. వీరిద్దరు సీజన్ 2లో అవే పాత్రల్లో కనిపించబోతున్నారు. వారి పిల్లలైన హిమ, శౌర్య పాత్రలు కూడా సీజన్ 2లో ఉండబోతున్నాయి.
ప్రోమో రిలీజ్...
ఇటీవల కార్తీకదీపం ఇది నవవసంతం ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో డాక్టర్ బాబు ఇంట్లో దీప పని మనిషిగా కొనసాగుతున్నట్లు చూపించారు. డాక్టర్ బాబు తన భర్త అయిన ఆ విషయం కూతురు శౌర్య దగ్గర దాచిపెట్టినట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. కొత్త కథతో ఈ సీక్వెల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని నిరుపమ్ అన్నాడు.
కార్తీక దీపం ఫస్ట్ సీజన్ ముగిసిన తర్వాత సీజన్ 2 మొదలుపెట్టమని తమకు చాలా మెసేజేస్ కాల్స్ వచ్చాయని ప్రేమీ విశ్వనాథ్ తెలిపింది. కార్తీక దీపం పేరుతోనే సీజన్ 2ను మొదలుపెట్టడం ఆనందంగా ఉందని తెలిపింది.
వంటలక్క పాపులర్...
కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ నటనకు బుల్లితెర ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. . తెలుగులో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్న సీరియల్స్‌లో ఒకటిగా కార్తీక దీపం నిలిచింది.
కొవిడ్ టైమ్ నుంచి డౌన్...
కార్తీక దీపం సీజన్ వన్ 2017 అక్టోబర్ 16 నుంచి ప్రారంభమైంది. మొత్తం 1569 ఎపిసోడ్స్‌తో దాదాపు ఆరేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. లాక్‌డౌన్ కారణంగా కొద్ది రోజుల పాటు షూటింగ్ నిలిచిపోవడం, వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను చనిపోయినట్లుగా చూపించడంతో టీఆర్‌పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.
శౌర్య, హిమ క్యారెక్టర్స్‌ను పెద్దవాళ్లు అయినట్లుగా చూపించి కొత్త క్యారెక్టర్‌తో కొన్నాళ్లు సీరియల్‌ను నడిపించారు. కానీ అనుకున్న స్థాయిలో డ్రామా పండకపోవడంతో సరైన ముగింపు లేకుండా అర్థాంతరంగా కార్తీక దీపం సీరియల్‌ను ముగించి ఫ్యాన్స్‌ను డిసపాయింట్ చేశారు.
కార్తీక దీపం కథ ఇదే...
కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క భార్యాభర్తలు. డాక్టర్ బాబును మోనిత ఇష్టపడుతుంది. వంటలక్క నుంచి డాక్టర్ బాబును దూరం చేసేందుకు మోనిత కుట్రలు పన్నుతుంది. మోనిత కుట్రల వల్ల డాక్టర్‌బాబు, వంటలక్క కవల పిల్లల్లో హిమ తండ్రి దగ్గర, శౌర్య తల్లి దగ్గర పెరుగుతారు.
మోనిత మోసాలను డాక్టర్ బాబు ఎలా తెలుసుకున్నాడు? డాక్టర్ బాబుపై అతి ప్రేమతో వంటలక్కను మోనిత ఎన్ని కష్టాలకు గురిచేసింది? విడిపోయిన తమ తల్లిదండ్రులను శౌర్య, హిమ కలపగలిగారా? లేదా? అన్నది కార్తీక దీపం సీరియల్‌లో చూపించారు. కార్తీకదీపం ఇది నవ వసంతంలో విడిపోయిన డాక్టర్‌బాబు, వంటలక్క తిరిగి ఎలా కలుసుకుంటారన్నదే చూపించబోతున్నట్లు సమాచారం.