Kalki 2898 AD Box office: షారుఖ్ ‘జవాన్’ను దాటేసిన కల్కి 2898 ఏడీ సినిమా
06 August 2024, 20:37 IST
- Kalki 2898 AD Box office Collections: కల్కి 2898 ఏడీ సినిమా ఇంకా కలెక్షన్లను రాబడుతోంది. ఇండియా గ్రాస్‍లో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాను కల్కి తాజాగా దాటేసింది. వసూళ్లలో జోరు చూపిస్తోంది.
Kalki 2898 AD Box office: షారుఖ్ ‘జవాన్’ను దాటేసిన కల్కి 2898 ఏడీ సినిమా
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా వసూళ్లను రాబడుతోంది. ఆరు వారాలు దాటినా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం ఆరంభం నుంచి భారీ కలెక్షన్లను దక్కించుకుంటోంది. మైలురాళ్లను దాటుతూ ముందుకు సాగుతోంది. తాజాగా ఇండియాలో గ్రాస్ కలెక్షన్ల విషయంలో బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీని కల్కి 2898 ఏడీ దాటేసింది. ఆ వివరాలు ఇవే..
జవాన్‍ను అధిగమించేసి..
కల్కి 2898 ఏడీ సినిమా 41 రోజుల్లో ఇండియాలోనే రూ.640.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. 2023లో వచ్చిన జవాన్ సినిమా భారత్‍లో రూ.640.25 కోట్లను సాధించింది. తాజాగా.. ఆ మూవీని కల్కి అధిగమించింది.
ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో జవాన్ కిందికి నెట్టి కల్కి 2898 ఏడీ నాలుగో ప్లేస్‍కు వచ్చింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, బాహుబలి తర్వాతి స్థానాల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కల్కి మూవీ దాటేసింది.
కల్కి 2898 ఏడీ సినిమా ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ దూసుకెళుతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. తమిళం, కన్నడ, మలయాళంలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతోంది.
కలిసి వస్తున్న టికెట్ల ఆఫర్లు
ప్రేక్షకులను ఇంకా థియేటర్లకు రప్పించేలా కల్కి 2898 ఏడీ మూవీ మేకర్లు టికెట్లపై ఆఫర్లు కూడా ఇస్తున్నారు. హిందీలో కొన్ని రోజులు కొన్ని థియేటర్లలో ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితంగా ఇచ్చే ఆఫర్ నడిపారు. ఇది బాగానే ఫలించింది. తాజాగా రూ.100కే టికెట్ ఆఫర్ నడుపుతోంది. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఎంపిక చేసిన థియేటర్లలో టికెట్ రేట్ రూ.100కే ఉంచుతోంది. దీంతో ఈ చిత్రానికి ఇప్పటికే బాగానే వసూళ్లు వస్తున్నాయి. భారతీయుడు 2 సినిమా సహా మరిన్ని చిత్రాలు పోటీకి వచ్చినా కల్కి 2898 ఏడీ మాత్రం ఆధిపత్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. పాన్ ఇండియా రేంజ్‍లో దుమ్మురేపింది.
కల్కి 2898 ఏడీ సినిమా ఓటీటీలోకి ఈ ఆగస్టు నెలలో వస్తుందనే అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్ల స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మూవీ హిందీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ తీసుకుంది.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణ్ లీడ్ రోల్స్ చేశారు. సస్వత ఛటర్జీ, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నా బెన్ కీలకపాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. సీక్వెల్‍గా కల్కి 2 మూవీ పనుల్లో ఇప్పటికే బిజీ అయ్యారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.