Ram Gopal Varma: “సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప”: రామ్‍గోపాల్ వర్మ కామెంట్లు: వీడియో
13 February 2024, 21:20 IST
- Ram Gopal Varma on NTR: సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పోలిక విషయంలో దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూనియరే గొప్ప అంటూ కామెంట్ చేశారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ చేస్తారా అన్న ప్రశ్నకు కూడా స్పందించారు.
Ram Gopal Varma: “సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప”: రామ్‍గోపాల్ వర్మ కామెంట్లు
Ram Gopal Varma on NTR: దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. కొన్ని విషయాల్లో ఆయన చెప్పే అభిప్రాయాలు కాంట్రవర్సీ అవుతుంటాయి. ఒక్కోసారి ఆయన కావాలనే సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారన్నట్టు ఉంటుంది. నేడు (ఫిబ్రవరి 13) జరిగిన వ్యూహం, శపథం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లోనూ ఓ వివాదాస్పద కామెంట్ చేశారు రామ్‍గోపాల్ వర్మ.
తెలుగుదేశం పార్టీకి వారసుడు లోకేశ్ కాదని, జూనియర్ ఎన్టీఆరే అని తాను చేసిన ట్వీట్ గురించి.. ఈవెంట్‍లో రామ్‍గోపాల్ వర్మకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. వోడ్కా తాగిన సమయంలో అలా ట్వీట్ చేసి ఉంటానని అన్నారు. ఇంతలో వోడ్కాలో లేకపోతే ఏం రాసే వారని మరొకరు అడిగారు. దీంతో సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా సుపీరియర్ (గొప్ప) అని తాను నమ్ముతానని రామ్‍గోపాల్ వర్మ అన్నారు.
“సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని నేను నమ్ముతా. ఇది నా అభిప్రాయం” అని ఆర్జీవీ అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ గొప్పా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘ఎస్.. ఎస్’ అని ఆర్జీవీ చెప్పారు.
నాకు ఆ కెపాసిటీ లేదు
జూనియర్ ఎన్టీఆర్‌తో తర్వాత ఏమైనా చిత్రం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ విభిన్నంగా స్పందించారు. తనకు అంత కెపాసిటీ లేదని అన్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాలకు చేరి, తెలుగు దేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగానూ సేవలు అందించిన సీనియర్ ఎన్టీఆర్ కంటే.. జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని ఆర్జీవీ చేసిన కామెంట్ వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆర్జీవీపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. తాత సీనియర్ ఎన్టీఆర్‌కు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ గొప్ప అనే ఆర్జీవీ కామెంట్‍పై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
వ్యూహం, శపథం చిత్రాల గురించి..
తాను దర్శకత్వం వహించిన వ్యూహం, శపథం చిత్రాల్లో ఏం చూపించనున్నారో ఆర్జీవీ మరోసారి వివరించారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం దగ్గరి నుంచి 2019లో వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వ్యూహం చిత్రం ఉంటుందని అన్నారు. అలాగే, ఆ ప్రమాణ స్వీకారం నుంచి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లే వరకు శపథం ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాల్లో లోకేశ్ పాత్ర కనిపించదని, వాయిస్ మాత్రమే ఉంటుందనేలా ఆర్జీవీ హింట్ ఇచ్చారు.
వ్యూహం, శపథం చిత్రాలకు ఒకే ట్రైలర్‌ను ఆర్జీవీ నేడు లాంచ్ చేశారు. వ్యూహం సినిమా ఫిబ్రవరి 23వ తేదీన, శపథం మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతాయని వెల్లడించారు. వారం వ్యవధిలోనే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ చిత్రాల్లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, వైఎస్ భారతి పాత్రలో మానస నటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాలకు ఆనంద్ సంగీతం అందించారు.