తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  James Cameron Likes Rrr: ఆర్ఆర్ఆర్‌ను మెచ్చుకున్న జేమ్స్ కామెరూన్.. ప్రశంసల వెల్లువ.. మూవీకి మరో 2 అంతర్జాతీయ అవార్డులు

James Cameron Likes RRR: ఆర్ఆర్ఆర్‌ను మెచ్చుకున్న జేమ్స్ కామెరూన్.. ప్రశంసల వెల్లువ.. మూవీకి మరో 2 అంతర్జాతీయ అవార్డులు

16 January 2023, 7:37 IST

google News
    • James Cameron Likes RRR: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌కు ఆర్ఆర్ఆర్ చిత్రం నచ్చిందట. ఈ విషయాన్ని ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్టు ఆనా థాంప్సన్ ట్విటర్ వేదికగా తెలియజేశారు. ఈ సినిమాకు సీసీఏ అవార్డులు రావడంపై తన పోస్టులో అభినందిస్తూ ఈ విషయాన్ని అందులో ప్రస్తావించారు.
ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ (HT_PRINT)

ఆర్ఆర్ఆర్

James Cameron Likes RRR: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతోంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను కైవసం చేసుకున్న ఈ సినిమా ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ సైతం సొంతం చేసుకుంది. తాజాగా మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది. 28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో(CCA) బెస్ట్ విదేశీ చిత్రంతో పాటు బెస్ట్ ఒరిజనల్ స్కోర్ విభాగాల్లో పురస్కారాన్ని దక్కించుకుంది. దీంతో పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది హాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు సినిమాపై తమ ప్రేమను పంచుకోగా.. తాజాగా ఆ జాబితాలో అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా చేరిపోయారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కెటగిరీలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు రావడంపై హాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఆనా థాంప్సన్ ట్వీట్ చేస్తూ అభినందించారు. ఈ సినిమా సీసీఏ రావడంపై చిత్రబృందానికి అభినందనలు తెలిపుతూ.. తన టేబుల్ మేట్ జేమ్స్ కామెరూన్‌కు కూడా ఈ సినిమా బాగా నచ్చిందని పేర్కొన్నారు.

"క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా గెలుపొందింది. ఈ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరిని చూసేలా ఉంది. నేను ఎస్ఎస్ రాజమౌళిని పరిచయం చేసుకున్నాను. నా టేబుల్ మేట్ జేమ్స్ కామెరూన్ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు." అని ఆనా థాంప్సన్ తన ట్విటర్‌లో స్పష్టం చేశారు. ఈ విధంగా జేమ్స్ కామెరూన్‌కు ఆర్ఆర్ఆర్ సినిమా నచ్చిందని, మూవీ టీమ్‌ను మెచ్చుకున్నారని తెలిసింది. ఈ ట్వీట్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేసింది. "లవ్యూ సర్" అంటూ జేమ్స్ కామెరూన్‌కు ట్యాగ్ చేసింది.

ప్రముఖ హాలీవుడ్ పురస్కారాలైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు అవార్డు దక్కింది. అనంతరం బెస్ట్ విదేశీ చిత్రంగానూ ఈ సినిమా ఎంపికైంది. నాటు నాటు అవార్డును ఎంఎం కీరవాణి అందుకున్నారు. మరో పురస్కారాన్ని చిత్రబృందం స్వీకరించింది. ఈ విధంగా మరో రెండు అంతర్జాతీయ పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది ఆర్ఆర్ఆర్.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం