RRR Team : ఓడినా.. మనసులు గెలిచారు.. ఆర్ఆర్ఆర్ టీమ్ స్టాండింగ్ ఒవేషన్
Golden Goble Awards : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అర్జెంటీనా 1985 సినిమా చేతిలో RRR ఓడిపోయింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ టీమ్ విజేతగా నిలిచిన చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని.. నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ పాటగా గోల్డెన్ గ్లోబ్(Golden Globe)ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అయితే, ఉత్తమ ఆంగ్లేతర ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అర్జెంటీనా 1985(Argentina 1985) అవార్డును గెలుచుకుంది. అర్జెంటీనా చిత్ర నిర్మాతలను ఆర్ఆర్ఆర్ టీమ్ అభినందించింది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అర్జెంటీనా 1985 అవార్డు గెలుచుకున్నాక.. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఆ వీడియోను కూడా టీమ్ షేర్ చేసింది. విజేతకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన ఏకైక టేబుల్ కూడా ఇదే.
అర్జెంటీనా 1985 చిత్రం అవార్డును సొంతం చేసుకున్నందున RRR ఉత్తమ ఆంగ్లేతర చలన చిత్రంగా గోల్డెన్ గ్లోబ్‌ను గెలుచుకోలేకపోయింది . అయితే RRR టీమ్ విజేతకు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంతో మనసులను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.., అర్జెంటీనా 1985 సినిమాకు మరోసారి ఆర్ఆర్ఆర్ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ సలాం కొట్టిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. భారత చలన చిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డు ప్రకటించిన తర్వాత... హాల్ మొత్తం ఒక్కసారిగా మారుమోగింది. అక్కడే ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఎంజాయ్ చేసింది.
RRR సినిమాలో కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్ కనిపించిన పీరియాడికల్ డ్రామా. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో జరిగిన కల్పిత కథ, వారి స్నేహాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కనిపిస్తుంది. ఇందులో అలియా భట్, అజయ్ దేవగన్ లాంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. మార్చి 25, 2022న థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 వసూలు చేసింది. RRR ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌లో కూడా ఉంది.