Avatar 2 Review: హాలీవుడ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో మిగిలిన డైరెక్టర్స్‌తో పోలిస్తే జేమ్స్ కామెరూన్ ఓ అడుగు ఎప్పుడూ ముందే ఉంటారు. 2009లో విడుదలైన అవతార్ సినిమా కామెరూన్ అద్భుత సృష్టికి నిదర్శనంగా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి జేమ్స్ కామెరూన్ ఉపయోగించిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ప్రపంచ సినిమాను మలుపుతిప్పింది.
గ్రాఫిక్స్, ఫాంటసీ సినిమాల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన అవతార్ ఎన్నో గొప్ప సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది. టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ వెండితెరపై అద్భుతాలు సృష్టించడంలో సిద్ధహస్తుడైన జేమ్స్ కామెరూన్ దాదాపు పదమూడేళ్ల తర్వాత అవతార్ సీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అవతార్ పెద్ద విజయాన్ని సాధించడంతో ఈ సీక్వెల్‌పై వరల్డ్ వైడ్‌గా సినీ అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.
అండర్ వాటర్ కథతో రూపొందిన అవతార్ 2 ఇంగ్లీష్, తెలుగు, తమిళంతో పాటు భారతీయ భాషలన్నింటిలో ఈ శుక్రవారం విడుదలైంది. దాదాపు పదేళ్ల పాటు నిర్మాణాన్ని జరుపుకోన్న ఈ సినిమాతో జేమ్స్ కామెరూన్ మరో పెద్ద విజయాన్ని అందుకున్నాడా? అవతార్‌ను మించి ఈ సినిమా ఉందా లేదా తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
పండోరా గ్రహంపై ఉన్న విలువైన ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నించిన కల్నల్ క్వారిచ్ బృందాన్ని నావీ తెగతో కలిసి జాక్, నెట్రి ఎదురించిన కథతో అవతార్ మొదటి భాగం తెరకెక్కింది. నెట్రి ప్రేమ కోసం శాశ్వతంగా అవతార్ రూపంలోనే ఉండాలని జాక్ నిర్ణయించుకోవడంతో ఫస్ట్ పార్ట్‌ను ఎండ్ చేశారు జేమ్స్ కామెరూన్. అవతార్ -2లో జాక్, నెట్రిలకు ముగ్గురు పిల్లలు పడుతారు. డాక్టర్ గ్రేస్ కూతురు కిరీని అడాప్ట్ చేసుకుంటారు.
క్వారిచ్ కొడుకు స్పైడర్ కూడా వారి పిల్లలతో పాటు పెరుగుతుంటారు. ఐదుగురు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి గ్రహాంతర వాసులు (స్కై పీపుల్) మరోసారి దాడిచేస్తారు. చనిపోయాడని అనుకున్న క్వారిచ్ అవతార్ రూపంలో బతికి రావడమే కాకుండా జాక్ ఫ్యామిలీపై తీవ్రమైన పగతో రగిలిపోతుంటాడు.
తన ఫ్యామిలీ వల్ల పండోరా గ్రహానికి ఇబ్బంది రాకూడదని భావించిన జాక్, నెట్రి తమ పిల్లలతో కలిసి రీఫ్ ఐలాండ్‌కు వలస వెళతారు. క్వారిచ్‌కు దొరకకుండా తలదాచుకోవాలనే వారి ప్రయత్నం ఫలించిందా? వారి ఆచూకీని క్వారిచ్ ఎలా కనిపెట్టాడు. ఈ పోరాటంలో తన భార్య పిల్లలను జాక్ కాపాడుకున్నాడా? లేదా అన్నదే అవతార్ -2 కథ(Avatar 2 Review)
అవతార్ పార్ట్ వన్‌ను గ్రాఫిక్స్, మోషన్ క్యాప్చర్ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలకు అధికంగా ప్రాముఖ్యతనిస్తూ రూపొందించారు జేమ్స్ కామెరూన్. సీక్వెల్‌ను మాత్రం అందుకు భిన్నంగా పూర్తిగా ఎమోషనల్ రైడ్‌గా సాగుతుంది. జాక్ ఫ్యామిలీ బాండింగ్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు డైరెక్టర్. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి జాక్ పడే తపన, సంఘర్షణ భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. అంతర్లీనంగా జాక్ ఫ్యామిలీపై క్వారిచ్ పగను పెంచుకోవడం, వారిని అన్వేషిస్తూ సాగించే ప్రయాణాన్ని ఉత్కంఠభరితంగా చూపించారు.
జాక్, నెట్రిలకు పిల్లలు పుట్టడం, ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా గడిపే సన్నివేశాలతో అవతార్ -2 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్వారిచ్ బతికే ఉన్నాడంటూ ఓ ట్విస్ట్ ఇచ్చి జాక్ ఫ్యామిలీని వెతుక్కుంటూ అతడు పండోగా గ్రహంపై తిరిగి అడుగుపెట్టడంతో సీక్వెల్ ఇంట్రెస్టింగ్ మారుతుంది. క్వారిచ్ నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి జాక్ రీఫ్ ఐలాండ్‌కు వెళ్లడం, అక్కడ ఇమడలేక వారు పడే ఇబ్బందులను చూపించారు.
జాక్ పిల్లల చుట్టూ అల్లుకున్న డ్రామాతో సినిమాను ముందుకు నడిపించారు. . జాక్ చిన్నకొడుకు లోయాక్‌కు పయకారా అనే జంతువుతో స్నేహం, స్పైడర్ దూరమై కిరీ పడే ఆవేదన నుంచి ఎమోషన్స్ రాబట్టుకున్నారు. చివరలో క్వారిచ్ వారిపై దాడిచేయడం, జాక్, నెట్రి కలిసి అతడిని ఎదురించే యాక్షన్ సన్నివేశాలతో క్లైమాక్స్ సాగుతుంది. క్వారిచ్ బతికే ఉన్నట్లుగా చూపించి మూడో పార్ట్ కోసం హింట్ ఇచ్చారు.
కథగా చెప్పుకుంటే అవతార్ -2 రెగ్యులర్ రివేంజ్ డ్రామా. ఈ రొటీన్ పాయింట్‌ను గ్రాఫిక్స్‌తో విజువల్ ఫీస్ట్‌గా దర్శకుడు మలిచారు. రీఫ్ ఐలాండ్ బ్యాక్‌డ్రాప్, అక్కడి జంతువులు, మనుషులతో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు జేమ్స్ కామెరూన్. ఆ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. రీఫ్ ఐలాండ్‌లోకి ప్రేక్షకుల్ని తీసుకెళతాయి. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. చివరలో వచ్చే సీన్స్ కొంత జేమ్స్ కామెరూన్ టైటానిక్ సినిమాను గుర్తుచేసినట్లుగా అనిపిస్తాయి.
అవతార్ -2 కంప్లీట్ విజువల్ ఫీస్ట్‌గా సరికొత్త అనుభూతిని అందిస్తుంది. గ్రాఫిక్స్ కంటే ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో కథ నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. మూడు గంటల 12 నిమిషాల నిడివి ఉండటం కూడా ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ పార్ట్‌కు మించి ఉంటుందనే అంచనాలతో థియేటర్‌లో అడుగుపెడితే మాత్రం డిసపాయింట్ అవ్వడం ఖాయమే.
టాపిక్