Hugh Jackman Rohit Sharma: రోహిత్ శర్మకు నేను వీరాభిమాని: హాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్ వైరల్
05 July 2024, 21:02 IST
- Hugh Jackman Rohit Sharma: హాలీవుడ్ స్టార్ హీరో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వీరాభిమాని అట. క్రికెట్ అంటే ఇష్టపడే అతడు.. తన నెక్ట్స్ మూవీ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు.
రోహిత్ శర్మకు నేను వీరాభిమాని: హాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్ వైరల్
Hugh Jackman Rohit Sharma: ఆస్ట్రేలియాకు చెందిన హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్‌మన్ తన నెక్ట్స్ మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ మచ్ అవేటెడ్ మూవీ కోసం ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య మార్వెల్ ఇండియా తన యూట్యూబ్ షార్ట్స్ లో పోస్ట్ చేసిన వీడియోలో తాను రోహిత్ శర్మకు వీరాభిమానిని అని చెప్పడం విశేషం.
రోహిత్ శర్మకు స్టార్ హీరో అభిమాని
హాలీవుడ్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అందులోనూ మార్వెల్ క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ అలాంటి హీరో కూడా మన రోహిత్ శర్మకు అభిమాని కావడం గమనార్హం. హ్యూ జాక్‌మన్ తన నెక్ట్స్ మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రికెట్ గురించి మాట్లాడాడు.
ఈ సందర్భంగా తన ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అని అడగగా.. మరో ఆలోచన లేకుండా రోహిత్ శర్మ అని చెప్పాడు. "ఇప్పుడైతే రోహిత్. అతడు వరల్డ్ కప్ గెలిచాడు. చాలా సంతోషంగా ఉంది. కానీ నిజాయతీగా చెప్పాలంటే అతడో బీస్ట్" అని జాక్‌మన్ అన్నాడు. ఆ సమయంలో అతని పక్కనే ఉన్న రియాన్ రేనాల్డ్స్ కూడా అవును అన్నట్లుగా ఇది అద్భుతం అని అన్నాడు.
హ్యూ జాక్‌మన్ నటించిన డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. షాన్ లెవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇండియాలో జులై 26న రిలీజ్ కానుంది. ఇంగ్లిష్ తోపాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో రానుంది. ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మొరెనా బాకారిన్, బ్రియానా హిల్డెబ్రాండ్, జెన్నిఫర్ గార్నర్ కూడా నటించారు.
రోహిత్ శర్మకు సన్మానం
ఈ మధ్యే టీమిండియాకు రెండోసారి టీ20 వరల్డ్ కప్ అందించాడు రోహిత్ శర్మ. జూన్ 29న జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయం తర్వాత గురువారం (జులై 4) ఢిల్లీలో అడుగుపెట్టిన టీమిండియా.. తర్వాత ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించింది. దీనికి వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా వాంఖెడే స్టేడియంలో జరిగిన స్పెషల్ ఈవెంట్లో వరల్డ్ కప్ అనుభవాలను అతడు పంచుకున్నాడు. ఇక శుక్రవారం (జులై 5) రోహిత్ శర్మకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా సన్మానించారు. అతనితోపాటు సూర్యకుమార్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ లను సత్కరించారు.