Nag Ashwin: ఆ హాలీవుడ్ సినిమాల విజువల్స్‌ను నాగ్ అశ్విన్ నిజంగానే కాపీ కొట్టాడా? ఇదీ అతని సమాధానం
Nag Ashwin: కల్కి 2898 ఏడీ మూవీలోని విజువల్స్ అన్నీ ఆ రెండు హాలీవుడ్ సినిమాలలాగే ఉన్నాయని, వాటి నుంచి నాగ్ అశ్విన్ కాపీ కొట్టాడన్న విమర్శలపై అతడు స్పందించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.

Nag Ashwin: కల్కి 2898 ఏడీ మూవీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజా ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఈ సినిమాలోని సీన్లు మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్ లాంటి సినిమాల నుంచి కాపీ చేసినట్లుగా ఉన్నాయన్న విమర్శలపైనా స్పందించాడు. అయితే ఆ ఎడారి విజువల్స్ అలా కనిపించాయి తప్ప వాటితో తమ సినిమా స్టోరీకి ఎలాంటి సంబంధం లేదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు స్పష్టం చేశాడు.
కల్కి 2898 ఏడీపై నాగ్ అశ్విన్
కల్కి 2898 ఏడీ మూవీని హాలీవుడ్ స్థాయిలో రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా ఎంతో మందికి నచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది. అయితే ఈ మూవీలోని విజువల్స్ అన్నీ హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల నుంచి కాపీ కొట్టినవే అని ఎంతో మంది సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్ ను ట్రోల్ చేశారు. దీనికి తాజా పీటీఐ ఇంటర్వ్యూలో అతడు సమాధానం ఇచ్చాడు.
"నాకు స్టార్ వార్స్ అంటే ఇష్టం. అది తెలియకుండానే నాపై ప్రభావం చూపింది. మిగతా సినిమాల ప్రభావం అంతగా లేదు. కేవలం ఎడారి విజువల్స్ తప్ప. అవి డ్యూన్, మ్యాడ్ మ్యాక్స్ లలోనూ ఎడారి ఉంది. అది తప్ప దాంతో మా స్టోరీ, టెక్నాలజీ లేదా డిజైన్ కి ఎలాంటి సంబంధం లేదు. సరదాగా అనిపించి రోబో సైడ్ కిక్ బహుశా స్టార్ వార్స్ లాంటిది. అంతేకాదు వాహనాలు పాతవిగా కనిపించడానికి కాస్త తుప్పు పట్టినట్లుగా చూపించడం కూడా దాని నుంచే కావచ్చు" అని నాగ్ అశ్విన్ అన్నాడు.
హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ఇది మన సమాధానమా?
హాలీవుడ్ లో సూపర్ హీరో సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటికి ఈ కల్కి 2898 ఏడీ మన ఇండియా ఇచ్చిన సమాధానం అన్న వాదనపైనా ఇదే ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ స్పందించాడు. "ఇది సమాధానమా కాదా అన్నది నాకు తెలియదు. కానీ మన దగ్గర కూడా మార్వెల్ లేదీ మూవీలాంటి స్టోరీలు, సంక్లిష్టత, హీరోయిజం ఉన్నాయి.
మనం వాటిని అర్థం చేసుకొని సరైన విధానంలో చెప్పగలగాలి. ఈ జనరేషన్ కు తగినట్లుగా వాటికి సైన్స్ ఫిక్షన్ జోడించి చెప్పడం సరైన విధానం అని నేను భావిస్తాను. కల్కి విషయంలో అదే వర్కౌట్ అయింది. ఇప్పుడు ప్రేక్షకులు ఇది మన స్టోరీగా చూస్తున్నారు" అని నాగ్ అశ్విన్ అన్నాడు.
కృష్ణుడి శాపంతో మరణం లేకుండా కలి యుగంలోనూ తిరుగుతూ ఈ యుగ దైవం కల్కిని కాపాడే అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటించాడు. ఆ కల్కి శంబాలాలోనే జన్మిస్తాడన్న పాయింట్ ను తీసుకొని.. భవిష్యత్తులో అత్యంత పురాతన నగరం కాశీ ఎలా కానుందో ఊహిస్తూ తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో ప్రభాస్ భైరవ, కర్ణుడి పాత్రల్లో నటించాడు.
ఈ సినిమాకు తొలి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ కలెక్షన్ల విషయంలో ఇంకా దూసుకెళ్తూనే ఉంది. రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.