The Marvels Review: ది మార్వెల్స్ రివ్యూ.. 2 వేల కోట్ల లేడి సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే?
The Marvels Movie Review In Telugu: 2023లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మరో చిత్రమే ది మార్వెల్స్. నవంబర్ 10 2023న విడుదలైన ది మార్వెల్స్ మూడు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ముగ్గురు లేడి సూపర్ హీరోల కాన్సెప్టుతో వచ్చిన ది మార్వెల్స్ రివ్యూలోకి వెళితే..

The Marvels Review Telugu: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కో సూపర్ హీరో గురించి సినిమాలు తెరకెక్కిస్తుంటారు. 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ సినిమాకు గతేడాది సీక్వెల్‌గా వచ్చిందే ది మార్వెల్స్. ఇందులో బ్రీ లార్సన్ మెయిన్ లీడ్ హీరోయిన్. అయితే ఆమెతోపాటు ఇమాన్ వెల్లని, టియోనా పార్రిస్ కూడా లేడి సూపర్ హీరోలుగా చేశారు. ఎన్నో అంచనాలతో థియేటర్‌లో విడుదలైన ది మార్వెల్స్ మూవీ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి సినిమా ఎలా ఉందో ది మార్వెల్స్ రివ్యూలో చూద్దాం.
కథ:
క్రీ జాతికి చెందిన హలా గ్రహం సూపర్ ఇంటలిజెన్స్ నాశనం కావడంతో అంతరించిపోతుంది. ఆ గ్రహంలోని సూర్యుడు కూడా మెల్లిగా చనిపోతూ ఉంటాడు. తన గ్రహాన్ని కాపాడుకోడానికి ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్) ఇతర గ్రహాల్లోని వనరులను తన గ్రహానికి పంపిస్తుంటుంది. దాన్ని తనకు దొరికిన క్వాంటమ్ బ్యాండ్ ద్వారా చేస్తుంది. విశ్వాల మధ్య క్వాంటమ్ బ్యాండ్‌తో గ్యాప్ ఏర్పాటు చేసి గ్రహాల రిసోర్సెస్‌ను హలాకు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.
అయితే, అదే సమంయలో క్వాంటమ్ బ్యాండ్ నుంచి వెలువడే మాగ్నెటిక్ పవర్ వల్ల అవే శక్తులు ఉన్న కెప్టెన్ మార్వెల్ కారోల్ డార్విన్ (బ్రీ లార్సన్), కెప్టెన్ మోనికా ర్యాంబో (టియోనా పార్రిస్), మిస్ మార్వెల్ కమలా ఖాన్ (ఇమాన్ వెల్లని) స్విచ్ అవుతుంటారు. అంటే క్వాంట్ బ్యాండ్ వల్ల ఏర్పడ్డ గ్లిట్చ్ వల్ల ఈ ముగ్గురు తమ పవర్స్ ఉపయోగించిన ప్రతిసారి ఒకరి స్థానంలో మరొకరు ఉంటారు.
హైలెట్స్
మరి ఈ డిఫెక్ట్‌తో ఇతర గ్రహాల వనరులను కాజేస్తున్న డార్విన్‌ను అడ్డుకున్నారా? భూగ్రహంపై డార్విన్ ఏం దోచుకోవాలనుకుంది? కెప్టెన్ మార్వెల్‌ను క్రీ జాతి ఎందుకు వినాశకారి అని పిలుస్తున్నారు? వారికి కెప్టెన్ మార్వెల్ చేసిన అన్యాయం ఏంటీ? డార్విన్ తన గ్రహాన్ని కాపాడుకోగలిగిందా? అనే విషయాలు తెలియాలంటే ది మార్వెల్స్ చూడాల్సిందే.
విశ్లేషణ:
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా వస్తుందంటే చాలా అంచనాలు ఉంటాయి. అలానే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తరహాలో ముగ్గురు లేడి సూపర్ హీరోలు కనిపించే ది మార్వెల్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను ది మార్వెల్స్ అందుకోలేకపోయిందనే చెప్పాలి. సినిమాలో కొన్ని ఆసక్తికర సీన్స్, అంశాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ది మార్వెల్స్‌లో 2022లో వచ్చిన మిసెస్ మార్వెల్ కమలా ఖాన్, 2021లోని వాండా విజన్ నుంచి మోనికా రాంబో పాత్రలు కనిపిస్తాయి.
మిసెస్ మార్వెల్ క్లైమాక్స్ సీన్‌తో ది మార్వెల్స్ స్టార్ట్ అవుతుంది. డార్బెన్‌కు క్వాంటమ్ బ్యాండ్ దొరకడం, దాని పవర్‌తో విశ్వాల మధ్య గ్యాప్ క్రియేట్ చేయడం, అదే సమయంలో కారోల్ డాన్వర్స్, మోనికా రాంబో, మిస్ మార్వెల్ టెలీపోర్ట్ అవ్వడం జరగడం ఆసక్తి కలిగిస్తాయి. డార్బెన్‌ను పవర్ ఫుల్ విలన్‌గా మొదట్లో చూపించిన క్లైమాక్స్ వచ్చేసరికి అదే స్థాయిని కంటిన్యూ చేయలేకపోయారు. ది మార్వెల్స్ టీమ్ టెలీపోర్ట్ అయ్యే సమస్యను అడ్వాంటేజ్‌గా మార్చుకునే తీరు ఆకట్టుకుంటుంది.
ఆమె యాక్టింగ్ హైలెట్
ఇవే కాకుండా ఎడ్లాండా అనే కొత్త గ్రహాన్ని చూపించారు. అది బాగానే ఉంది. కానీ, అక్కడ పాటలు పాడుతూ మాట్లాడే సంస్కృతి కాస్తా అతిగా అనిపిస్తుంది. అయితే సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో ఉండే స్టోరీనే ఇందులో ఉంది. కొన్ని ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ది మార్వెల్స్ ఆకట్టుకుంటుంది. ఇక కెప్టెన్ మార్వెల్ ఫ్యాన్‌గా కమలా ఖాన్ పాత్ర చేసిన ఇమాన్ వెల్లని తన నటనతో ఎంతో ఆకట్టుకుంది. సినిమా మొత్తంలో తనే షో స్టీలర్ అని చెప్పొచ్చు.
ఎప్పటిలాగే బ్రీ లార్సన్, టియోనో పార్రిస్ అలరించారు. నిక్ ఫ్యూరి క్యారెక్టర్ చేసి శామ్యుల్ ఎల్ జాక్సన్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. జావే ఆష్టన్ విలన్‌గా పర్వాలేదు అని చెప్పొచ్చు. మిగతా పాత్రలు, గ్రాఫిక్స్, విజువల్స్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ బాగానే ఉన్నాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే రెండు ట్విస్ట్ మార్వెల్ ఫ్యాన్స్‌కు ట్రీట్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి హింట్స్ ఇచ్చారు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే మార్వెల్ ఫ్యాన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ది మార్వెల్స్.
బడ్జెట్-కలెక్షన్స్
అయితే, గతేడాది నవంబర్ 10న విడుదలైన ది మార్వెల్స్ మూవీ సుమారు రూ. 270కి పైగా మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ. 2250 కోట్లకు పైగా వెచ్చించి భారీ వ్యయంతో తెరకెక్కించిన ది మార్వెల్స్ బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 206 మిలియన్ డాలర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే, సుమారు రూ. 1712 కోట్ల మాత్రమే ది మార్వెల్స్ మూవీ రాబట్టింది.