తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Jengaburu Curse Web Series Review: ఫరియా అబ్దుల్లా ఒంటి చేత్తో నడిపించిన వెబ్ సిరీస్ ది జెంగబూరు కర్స్

The Jengaburu Curse Web Series Review: ఫరియా అబ్దుల్లా ఒంటి చేత్తో నడిపించిన వెబ్ సిరీస్ ది జెంగబూరు కర్స్

Hari Prasad S HT Telugu

14 August 2023, 14:05 IST

google News
    • The Jengaburu Curse Web Series Review: ఫరియా అబ్దుల్లా ఒంటి చేత్తో నడిపించిన వెబ్ సిరీస్ ది జెంగబూరు కర్స్. సోనీ లివ్ ఓటీటీలో ఈ మధ్యే వచ్చిన ఈ సిరీస్ మేకర్స్ చెబుతున్నట్లు ఇండియాలో వచ్చిన తొలి క్లైమేట్ ఫిక్షన్ స్టోరీ.
ది జెంగబూరు కర్స్ వెబ్ సిరీస్
ది జెంగబూరు కర్స్ వెబ్ సిరీస్

ది జెంగబూరు కర్స్ వెబ్ సిరీస్

The Jengaburu Curse Web Series Review: ది జెంగబూరు కర్స్ (The Jengaburu Curse) పేరుతో సోనీ లివ్ (Sonyliv) ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్ ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఇండియాలో ఇలా క్లైమేట్ ఫిక్షన్ జానర్ లో వచ్చిన తొలి సిరీస్ అంటూ మేకర్స్ చెబుతున్నారు.

ఈ సిరీస్ లో మన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటించింది. అంతేకాదు ఒంటిచేత్తో సిరీస్ మొత్తాన్ని మోసిందని చెప్పాలి. ఒడిశాలో అంతరించిపోతున్న బోండా జాతి ఆదివాసీలు, అభివృద్ధి పేరుతో జరుగుతున్న మైనింగ్ పర్యావరణంపై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపుతుందో చెప్పే ప్రయత్నం ఈ సిరీస్ ద్వారా చేశారు.

వెబ్ సిరీస్: ది జెంగబూరు కర్స్

నటీనటులు: ఫరియా అబ్దుల్లా, నాజర్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు

డైరెక్టర్: నీల మదాబ్ పాండా

ఎపిసోడ్లు: 7 (ఒక్కో ఎపిసోడ్ సుమారు 45 నిమిషాలు)

ది జెంగబూరు కర్స్ స్టోరీ ఏంటి?

ప్రియా దాస్ (ఫరియా అబ్దుల్లా) లండన్ లో ఓ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా పని చేస్తుంటుంది. సడెన్ గా ఇండియాలోని ఒడిశాలో ఉన్న తన తండ్రి మిస్ అయ్యాడని రవిచందర్ రావు (నాజర్) అనే వ్యక్తి నుంచి కాల్ వస్తుంది. ఓ పూర్తిగా కాలిపోయిన బాడీ దొరికిందని, అది తన తండ్రితో కాదో గుర్తు పట్టడానికి రావాలని అడుగుతాడు. అది విని కంగారు పడుతూ ఆమె ఇండియాకు వస్తుంది.

ఆ బాడీ తన తండ్రిది కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నా.. తర్వాత మిస్ అయిన తన తండ్రిని వెతికే క్రమంలో ఆమెకు కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న మైనింగ్ మాఫియాలో తన జాతి బోండా ఆదివాసీలు ఉనికి కోల్పోయిన సంగతి తెలుస్తుంది. తమ జెంగబూరు (ఎర్రటి కొండ అని అర్థం) మైనింగ్ తో రూపు రేఖలు కోల్పోవడం చూసి చలించిపోతుంది.

ఈ క్రమంలోనే అదే జాతి ఉనికి కోసం పోరాడుతున్న తన తండ్రి స్వతంత్ర దాస్ మిస్సయ్యాడని ఫోన్ చేసిన వ్యక్తి నిజ స్వరూపమేంటో కూడా తెలుసుకుంటుంది. ఆ కొండల్లో మైనింగ్ పేరుతో జరుగుతున్న అసలు అక్రమం ఏంటి? తన జాతి ఉనికి కోసం ఆమె ఎలాంటి పోరాటం చేస్తుంది అన్నదే ఈ ది జెంగబూరు కర్స్ స్టోరీ.

ది జెంగబూరు కర్స్ ఎలా ఉంది?

2010లో బాల కార్మిక వ్యవస్థపై ఐ యామ్ కలామ్ సినిమా తీసి నేషనల్ అవార్డు గెలుచుకున్న నీల మదాబ్ పాండా డైరెక్షన్లో వచ్చిన సిరీస్ ఈ ది జెంగబూరు కర్స్. తన సొంత రాష్ట్రం ఒడిశాలో మైనింగ్ పేరుతో పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తున్నారన్నది ఈ సిరీస్ ద్వారా కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు.

అదే సమయంలో అక్కడ నివసించే బోండ జాతి ఆదివాసీల కష్టాలు, నక్సల్స్ సమస్యలాంటి అంశాలను కూడా ఈ సిరీస్ లో చూపించాడు. పర్యావరణ హితం కోరుతూ డైరెక్టర్ చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోదగినదే అయినా.. ఆ స్టోరీ ప్రేక్షకులను మెప్పించేలా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చెప్పడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి.

కొన్ని సీన్లు అయోమయానికి గురి చేస్తాయి. మరికొన్ని సీన్లు సడెన్ గా ముగుస్తుంటాయి. చివర్లో అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పరువు పోకుండా ఈ సిరీస్ లోని ఫిమేల్ లీడ్ కాపాడినట్లుగా చూపించడం కూడా ఫన్నీగా అనిపిస్తుంది. సీక్రెట్ గా అక్కడ జరుగుతున్న మైనింగ్ ఏంటి? అక్కడున్న రహస్య ల్యాబ్ ఏం చేస్తుంది? అన్నది చివరి నిమిషాల వరకూ చూపించలేదు.

వాటిని చూపే సమయానికి దానిపై ఉన్న ఆసక్తి కూడా పోతుంది. ఏడు ఎపిసోడ్ల ఈ సిరీస్ మరీ అంత బోర్ కొట్టకుండా సాగినా.. పాత్రలను, సీన్లను కాస్త అయోమయంగా చిత్రీకరించడం వల్ల ఓ మంచి సబ్జెక్ట్ నీరుగారిన భావన కలుగుతుంది.

ఫరియానే హైలైట్..

ఈ సిరీస్ లో నాజర్, మకరంద్ దేశ్‌పాండేలాంటి సీనియర్ నటులు ఉన్నా.. ఫరియా అబ్దుల్లానే ఒంటిచేత్తో నడిపించిందని చెప్పొచ్చు. ప్రియా దాస్ అనే పాత్రలో ఆమె ఒదిగిపోయింది. అత్యంత సహజమైన నటనతో ఆకట్టుకుంది.

ఇక నాజర్ తనదైన విలనిజాన్ని పండించాడు. లాభాపేక్ష లేకుండా, ఆదివాసీలకు చికిత్స చేసే డాక్టర్ పాత్రలో మకరంద్ దేశ్‌పాండే కనిపించాడు. మంచి నటుడే అయినా.. అతని పాత్రకు తగినంత గుర్తింపు దర్శకుడు ఇచ్చినట్లుగా కనిపించదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం