Nasser to Pawan Kalyan: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇతర ఇండస్ట్రీల నటీనటులకు ఇక అవకాశం ఉండదని వస్తున్న వార్తలను ఖండించాడు ఆ ఇండస్ట్రీ నటుడు నాజర్. ఆ వార్తల్లో నిజం లేదని, వాటిని నమ్మకూడదని సూచించాడు. ఈ మధ్య బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ కూడా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ నిర్ణయం తీసుకున్నదని, ఇది సరికాదని అన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నాజర్ ఓ 2 నిమిషాల వీడియోలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. "అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే దానిని వ్యతిరేకించే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఇప్పుడు పాన్ ఇండియా, గ్లోబల్ సినిమాలు వస్తున్న కాలం.
ఇలాంటి సమయంలో తమిళ ఇండస్ట్రీలో ఇతర నటీనటులకు అవకాశం ఉండకపోవడం అంటూ ఉండదు. ఇవి పూర్తిగా తప్పుడు వార్తలు. వాటిని నమ్మొద్దు. తమిళ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఇతర ఇండస్ట్రీల నటీనటులను ఆదరిస్తోంది. ఎస్వీ రంగారావు, సావిత్రి, వాణిశ్రీలాంటి వాళ్లను అక్కున చేర్చుకుంది.
ఇది తమిళ సినీ ఇండస్ట్రీ కార్మికులకు సంబంధించిన అంశం. వాళ్ల హక్కులను కాపాడుకునేందుకు తీసుకున్న నిర్ణయం. నటీనటులకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్పటికీ కలిసే సినిమాలు చేద్దాం" అంటూ నాజర్ పిలుపునిచ్చాడు.
ఈ మధ్యే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా (ఫెఫ్సీ).. తమిళ సినిమాల్లో కేవలం తమిళ నటీనటులకే అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.
దీనిపై ఏకంగా పవన్ కల్యాణ్ కూడా స్పందించాడు. బ్రో మూవీని తమిళ నటుడు, డైరెక్టర్ అయిన సముద్రఖనే డైరెక్ట్ చేసిన నేపథ్యంలో ఇండస్ట్రీల మధ్య ఇలాంటి పరిమితులు ఉండకూడదని పవన్ స్పష్టం చేశాడు.
రోజురోజుకూ ఈ అంశం తీవ్రమవుతుండటంతో నాజర్ వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకున్నారని, దీనిని మరీ అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం