Fefsi New Rules: ఇకపై తమిళ సినిమాల్లో పరభాషా నటులకు నో ఛాన్స్ - వివాదాస్పదంగా మారిన ఫెఫ్పీ రూల్స్
Fefsi New Rules: తమిళ సినిమాల్లో తమిళ నటులనే తీసుకోవాలని పేర్కొంటూ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ దక్షిణాది చిత్రసీమలో వివాదాస్పదంగా మారాయి. ఈ రూల్స్‌పై సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ దక్షిణాది చిత్రసీమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ రూల్స్‌పై తమిళ నటులతో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రొడ్యూసర్ల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇటీవలే ఫెఫ్సీ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.
తమిళ సినిమాల షూటింగ్‌లను చాలా వరకు తమిళనాడులోనే చిత్రీకరించాలని ఫెఫ్పీ పేర్కొన్నది. అవసరమైతేనే విదేశాలతో పాటు పక్క రాష్ట్రాల్లో షూటింగ్ చేయాలని షరతులు విధించింది. ముఖ్యంగా తమిళ సినిమాల్లో తమిళ ఆర్టిస్టులకు మాత్రమే ప్రాముఖ్యత నివ్వాలని, పరాయి భాషల నటుల్ని ప్రోత్సహించకూడదని ఫెఫ్సీ ఈ కొత్త రూల్స్‌లో పేర్కొన్నది.
అలాగే అనుకున్న టైమ్‌లో షూటింగ్ పూర్తికాకపోవడం, బడ్జెట్ పెరగడం లాంటివి జరిగితే అందుకు గల కారణాల్ని వ్రాత పూర్వకంగా ప్రొడ్యూసర్స్ వెల్లడించాలని ఫెఫ్సీ ఈ నియమనిబంధనల్లో పేర్కొన్నది. కథా హక్కుల విషయంలో తరుచుగా ఇండస్ట్రీలో వివాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో ఈ వివాదాలు హైలైట్ అవుతుంటాయి.
వీటికి పుల్‌స్టాఫ్ పెట్టేందుకు ఫెఫ్పీ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఈ వివాదాల కారణంగా ప్రొడ్యూసర్‌తో పాటు సినిమాకు నష్టం జరగకుండా పూర్తి బాధ్యత రచయిత, దర్శకుడు(ఒకవేళ అతడే సినిమాకు కథనే అందిస్తే) తీసుకోవాలని ఫెఫ్పీ కొత్త రూల్స్‌లో పేర్కొన్నది. వీటితో పాటు మరికొన్ని కొత్త నిబంధనలను ఫెఫ్పీ ప్రవేశపెట్టింది.
వ్యతిరేకత...
ఈ కొత్త రూల్స్‌పై తమిళ సినీ పరిశ్రమతో పాటు దక్షిణాది సినీ ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నటనకు భాషాభేదాలతో సంబంధం ఉండదని, ఏ రాష్ట్రంలోనైనా, ఏ భాషలోనైనా సినిమా చేసే స్వేచ్ఛ నటీనటులకు ఉందని సీనియర్ డైరెక్టర్ వినయన్ చెప్పాడు. ఇలాంటి సంకుచిత నిర్ణయాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతాయని పేర్కొన్నాడు.
ఫెఫ్పీ నిర్ణయం సరైంది కాదని సముద్రఖని బ్రో మూవీ ప్రమోషన్స్‌లో పేర్కొన్నాడు. సినీ అభిమానులు కూడా ఫెఫ్పీ రూల్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. తమిళ సినిమాల్లో తమిళ నటులకే ప్రాధాన్యతనివ్వాలనే నిర్ణయాన్ని తప్పుపడుతోన్నారు.
అలాంటప్పుడు తమిళ సినిమాల్ని కూడా తమిళనాడులోనే రిలీజ్ చేయాలని, పక్క రాష్ట్రాల్లో విడుదల చేయకూడదని ఫెఫ్పీ రూల్స్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా 1967లో ప్రారంభమైంది. ఈ అసోసియేషన్‌లో సినీ పరిశ్రమలోని 23 విభాగాలకు చెందిన 30 వేల మంది సభ్యులు ఉన్నారు.