Aavesham OTT: అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
04 May 2024, 6:50 IST
Aavesham OTT: ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మలయాళం మూవీ ఆవేశం థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
ఆవేశం ఓటీటీ
Aavesham OTT: ఆవేశం మూవీ మలయాళం హీరో ఫహాద్ ఫాజిల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో 140 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. 2024 ఏడాదిలో మలయాళ చిత్రసీమలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
నెల రోజుల్లోనే ఓటీటీలోకి...
ఆవేశం మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ గ్యాంగ్‌స్టర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. మే 9న ఈ మలయాలం మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆవేశం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఈ వారంలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతోన్నారు. సౌత్‌లో ఫహాద్ ఫాజిల్ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా దాదాపు ఇరవై కోట్లకు ఆవేశం మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
30 కోట్ల బడ్జెట్...
ఆవేశం సినిమాకు రొమాంచం ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను అన్వర్ రషీద్‌తో కలిసి స్వయంగా ఫహాద్ ఫాజిల్ నిర్మించాడు. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నాలుగింతలకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో సాజిన్ గోపు, ప్రణవ్‌రాజ్, మిథున్ జై శంకర్, రోషన్ శాన్‌వాజ్ కీలక పాత్రలు పోషించారు.
గ్యాంగ్‌స్టర్ రంగా కథ...
శాంతన్ (రోషన్ శాన్‌వాజ్), బీబీ (మిథున్ జై శంకర్), అజు(ప్రణవ్‌రాజ్) ఇంజినీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరు వస్తారు. కాలేజీలో సీనియర్స్ ఈ ముగ్గురిని ర్యాగింగ్ పేరుతో దారుణంగా కొడతారు. సీనియర్స్‌పై రివేంజ్ తీర్చుకోవడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్ రంగా రావు అలియా రంగాతో (ఫహాద్ ఫాజిల్) స్నేహం చేస్తారు అజు, బీబీ, శాంతన్. ఈ ముగ్గురిని ర్యాగింగ్ చేసిన కుట్టి అండ్ టీమ్‌ను తన గ్యాంగ్‌తో కలిసి కాలేజీలోని స్టూడెంట్స్ అందరికి రంగా చితక్కొడతాడు.
రంగా మనుషులు కావడంతో అజు, బీబీ, శాంతన్‌లకు కాలేజీలో ఎదురేలేకుండాపోతుంది. రంగా టీమ్‌లో చేరిన అజు, బీబీ, శాంతన్ జీవితాలు ఏమయ్యాయి? చదువును వారు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఈ ముగ్గురికి రంగాకు ఎందుకు అటాచ్‌మెంట్ పెరిగింది?
రంగా చేసిన నేరాల గురించి అతడు అనుచరుడు అంబన్ (సాజిన్ గోపు) చెప్పినవి నిజాలేనని ఈ ముగ్గురికి ఎప్పుడు తెలిసింది? తమకు సాయం చేసిన రంగానే చంపాలని బీబీ, అజు, శాంతన్ ఎందుకు అనుకున్నారు? వారి కుట్రను తెలుసుకున్న రంగా ఈ ముగ్గురిని ఏం చేశాడు? అన్నదే ఆవేశం మూవీ కథ.
మదర్ సెంటిమెంట్...
గ్యాంగ్‌స్టర్ కామెడీకి మదర్ సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు జీతూ మాధవన్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో గ్యాంగ్‌స్టర్ రంగాగా తన కామెడీ టైమింగ్, డిఫరెంట్ బాడీలాంగ్వేజ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాజిల్.
పుష్ప 2లో విలన్...
తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తోన్నాడు. ఫస్ట్ పార్ట్‌లో తక్కువ నిడివితో కూడిన క్యారెక్టర్‌లో కనిపించిన ఫహాద్ ఫాజిల్ పుష్ప 2లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్‌గా పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతోంది.