తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Exhuma Movie Review: ఇండియాలో థియేటర్లలో వంద రోజులు ఆడిన కొరియ‌న్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Exhuma Movie Review: ఇండియాలో థియేటర్లలో వంద రోజులు ఆడిన కొరియ‌న్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

10 October 2024, 14:50 IST

google News
  • Exhuma Movie Review: 2024లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన కొరియ‌న్ మూవీ ఎగ్జుమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

 ఎగ్జుమా మూవీ రివ్యూ
ఎగ్జుమా మూవీ రివ్యూ

ఎగ్జుమా మూవీ రివ్యూ

Exhuma Movie Review: 2024లో కొరియ‌న్ సినిమాల్లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా ఎగ్జుమా నిలిచింది. కొరియ‌న్ మూవీ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఆరో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ హార‌ర్ మూవీలో చోయ్ మిన్ సిక్‌, లీ హా రిమ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జాంగ్ జే హ్యూమ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ ఈ కొరియ‌న్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

రెండు శ‌వ పేటిక‌ల క‌థ‌...

పార్క్ జీ యోంగ్ ఓ కొరియ‌న్‌. అమెరికాలో త‌న కుటుంబంతో సెటిల్ అవుతాడు. అత‌డి కుటుంబాన్ని కొన్ని క్షుద్ర శ‌క్తులు వెంటాడుతుంటాయి. పార్క్ కొడుకు పుట్టిన‌ప్ప‌టి నుంచి ఏడుస్తూనే ఉంటాడు. అత‌డికి ఉన్న స‌మ‌స్య ఏమిట‌న్న‌ది వైద్యుల‌కు అంతుప‌ట్ట‌దు. పార్క్ కొడుకుకు ఉన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి కొరియా నుంచి అతీంద్రియ శ‌క్తులు తెలిసిన లీ హా రిమ్ (కిమ్ జో ఎన్‌), బోంగిల్ (లీ డ్యూ హ్యాన్‌) వ‌స్తారు. పార్క్ తాత‌య్య ఆత్మ అత‌డి కుటుంబాన్ని ప‌ట్టిపీడిస్తుంద‌ని లీ హా రిమ్ క‌నిపెడుతుంది.

తీర‌ని కోరిక‌ల‌తో ర‌గిలిపోతున్న ఆత్మ‌ల‌కు విముక్తిని ప్ర‌సాదించే వృత్తిలో ఉంటాడు కిమ్ (చోయ్ మిన్ సిక్‌). పార్క్ తాత‌య్య శ‌వాన్ని వెలికితీసి అత‌డికి మ‌రోసారి క‌ర్మ‌ల‌ను జ‌రిపిస్తేనే ఆత్మ సంతృప్తి ప‌డుతుంద‌ని కిమ్‌, లీ హా రిమ్ అన‌కుంటారు. కొరియా స‌రిహ‌ద్దుల్లో అడ‌వి మ‌ధ్య‌లో కొండ‌ల‌పై ఉన్న పార్క్ తాత‌య్య శ‌వ‌పేటిక‌ను వెలికితీస్తారు. కానీ శ‌వ‌పేటిక ఓపెన్ కావ‌డంతో అందులో నుంచి అనుకోకుండా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆత్మ పార్క్ కుటుంబం మొత్తాన్ని చంపేస్తుంది. పార్క్ తాత‌య్య శ‌వ‌పేటిక కిందే నిలువున పాతి ఉన్న మ‌రో శ‌వ‌పేటిక క‌నిపిస్తుంది.

దానిని కూడా లీ హా రిమ్‌, కిమ్‌, బోంగిల్ వెలికితీస్తారు. అందులో నుంచి నిప్పు రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌ది అడుగుల పొడ‌వైన యోధుడి ఆత్మ బొంగిల్, లీ హా రిమ్‌పై ఎటాక్ చేస్తుంది. ఆ ఎటాక్‌లో బోంగిల్ తీవ్రంగా గాయ‌ప‌డుతాడు. కిమ్‌, లీ హా రిమ్‌ల‌ను ఆత్మ వెంటాడుతుంది. ఆ ఆత్మ ఎవ‌రిది?

పార్క్ తాత‌య్య గురించి కిమ్‌, లీ హా రిమ్ అన్వేష‌ణ‌లో ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి? కొరియా, జ‌పాన్ కు మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలో జ‌పాన్ గెల‌వ‌డానికి పార్క్ తాత‌య్య ఎలాంటి కుట్ర‌లు ప‌న్నాడు? కొరియాను నాశ‌నం చేయ‌డానికి జ‌పాన్ వేసిన ఎత్తు ఏమిటి? కిమ్‌, లీ హా రిమ్ క‌లిసి ప‌ది అడుగుల పొడవైన యోధుడి ఆత్మ‌ను ఎలా నాశ‌నం చేశారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

రెగ్యుల‌ర్ హార‌ర్ మూవీస్‌కు భిన్నంగా...

సాధార‌ణంగా హార‌ర్ సినిమాల్లో పెద్ద‌గా క‌థ ఉండ‌దు. స్క్రీన్‌ప్లే, సౌండ్ టెక్నిక్స్‌, విజువ‌ల్స్‌తోనే ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టేందుకు ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఈ రెగ్యుల‌ర్ ట్రిక్కులు ఫార్ములాల‌కు భిన్నంగా ఎగ్జుమా సాగుతుంది.

రెండు దేశాల మ‌ధ్య జ‌రిగిన యుద్ధానికి హార‌ర్ ఎలిమెంట్స్‌ ముడిపెడుతూ సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. కొరియ‌న్ చ‌రిత్ర‌, సంప్ర‌దాయాల‌తో పాటు ప్ర‌కృతి శ‌క్తుల‌కు ఉన్న ప‌వ‌ర్‌ను చాటిచెబుతూ చాలా డీప్ అండ్ డెప్త్‌గా స్టోరీ రాసుకున్నాడు. ఒకేసారి రెండు సినిమాలు చూసిన‌ట్లుగా అనిపిస్తుంది. కానీ రెండు క‌థ‌ల్ని లింక్ చేసిన విధానం బాగుంటుంది.

పార్క్ ఫ్యామిలీ మిస్ట‌రీ...

తాత‌ ఆత్మ కార‌ణంగా పార్క్ ఫ్యామిలీ ఇబ్బందిప‌డే సీన్స్‌తో ఎగ్జుమా సినిమా నెమ్మ‌దిగా మొద‌ల‌వుతుంది. పాత్ర‌ల ప‌రిచ‌యానికే ద‌ర్శ‌కుడు అర‌గంట పాటు టైమ్ తీసుకున్నాడు. పార్క్ తాత‌య్య శ‌వాన్ని వెలికితీయ‌డానికి కిమ్‌, లీ హా రిమ్ ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టి నుంచి నెక్స్ట్ ఏం జ‌రుగుబోతుందోన‌నే క్యూరియాసిటీని క‌లిగించారు డైరెక్ట‌ర్‌.

ట్విస్ట్‌ల‌తో భ‌య‌పెడుతూ...

అనుకోకుండా శ‌వ‌పేటిక నుంచి పార్క్ తాత‌య్య ఆత్మ బ‌య‌ట‌కు వ‌చ్చి ఒక్కొక్క‌రిని చంపే సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయి. అక్క‌డితో క‌థ అయిపోతుంద‌నుకునే టైమ్‌లోనే పార్క్ తాత‌ శ‌వ‌పేటిక కింద మ‌రో శ‌వ‌పేటిక బ‌య‌ట‌ప‌డుతుంది. అందులోని మ‌రో ఆత్మ బ‌య‌ట‌కు రావ‌డం, దాని కార‌ణంగా కిమ్‌, లీ హా రిమ్ ప్రాణాలు ప్ర‌మాదంలో ప‌డే సీన్స్‌తో భ‌య‌పెట్టారు డైరెక్ట‌ర్‌.

కొరియా జ‌పాన్ యుద్ధం...

ఆత్మ తాలూకు అన్వేష‌ణ‌లో పార్క్ ఫ్యామిలీతో పాటు కొరియా, జ‌పాన్ మ‌ధ్య యుద్ధం, శ‌వ పేటిక కింద మ‌రో శ‌వ పేటిక ఎందుకు ఉంద‌నే ట్విస్ట్ ఒక్కొక్క‌టి రివీల్ చేసుకుంటూ క్లైమాక్స్ వ‌ర‌కు క‌థ‌ను ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు ఏ మాత్రం అంద‌కుండా న‌డిపించాడు డైరెక్ట‌ర్‌. పంచ‌భూతాల కాన్సెప్ట్‌తో కిమ్ ఆ ఆత్మ‌ను నాశ‌నం చేసే సీన్ ఆక‌ట్టుకుంటుంది. ద‌య్యాల‌ను స్క్రీన్‌పై చూపించ‌కుండా చివ‌ర‌కు వ‌ర‌కు భ‌య‌పెట్టాడు డైరెక్ట‌ర్‌.

డీటైలింగ్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా సినిమా కాస్తంత నిదానంగా సాగిన అనుభూతి క‌లుగుతుంది. ట్విస్ట్‌లు చాలా డెప్త్‌గా ఉంటాయి. ఓ ప‌ట్ట‌నా అర్థం కావ‌డం క‌ష్ట‌మే.

62 ఏళ్ల వ‌య‌సులో…

ఈ సినిమాలో చోయ్ మిన్ సిక్ అస‌లైన హీరో. 62 ఏళ్ల వ‌య‌సులో త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్, యాక్టింగ్‌తో మెప్పించాడు. లీ హా రిమ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.

హార‌ర్ మూవీస్‌లో డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల కోసం చూస్తున్న వారిని ఎగ్జుమా మెప్పిస్తుంది. సినిమా లెంగ్త్‌ రెండు గంట‌ల‌కుపైనే ఉండ‌టంతో కాస్త ఓపిక‌తో చూడాల్సిందే.

తదుపరి వ్యాసం