OTT Horror Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Horror Thriller Web Series: హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఇప్పుడు అలాంటిదే మరో సిరీస్ రాబోతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
OTT Horror Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. థాయ్ భాషలో తెరకెక్కిన ఈ సిరీస్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే హారర్ థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ ఏ భాషలో ఉన్నా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త సిరీస్ కూడా అలాంటి థ్రిల్ నే పంచుతుందని భావిస్తున్నారు.
డోన్ట్ కమ్ హోమ్ హారర్ వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్న హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు డోన్ట్ కమ్ హోమ్ (Don't Come Home). థాయ్ భాషలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. తాజాగా మంగళవారం (అక్టోబర్ 8) సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కొత్త సిరీస్ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ కూడా భయపెట్టేలా సాగింది.
సొంత ఇంటికి తిరిగి వచ్చిన ఓ తల్లి, కూతురు చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ప్రతి ఒక్కరికీ తమ సొంత ఇంట్లో ఉండటం కంటే మించిన ఆనందం ఉండదు. కానీ ఆ తల్లీకూతుళ్లకు మాత్రం తమ సొంత ఇల్లే ఓ పీడకలగా మారుతుంది.
ఓ అడవిలో అందరికీ దూరంగా ఉండే ఇల్లు అది. చాలా రోజులుగా అక్కడ ఎవరూ ఉండరు. వాళ్లు ఆ ఇంట్లోకి వచ్చీ రాగానే అక్కడి అతీత శక్తులు వాళ్లకు వెల్కమ్ చెబుతాయి. ఇంట్లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే ఆమె కూతురు కనిపించకుండా పోతుంది. ఆమెను కనిపెట్టడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వెలుగు చూసే అంశాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తాయి.
హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్
కొత్తగా నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్న ఈ థాయ్ వెబ్ సిరీస్ హారర్ తోపాటు మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగనున్న ఈ వెబ్ సిరీస్ ను వూట్టిడనై ఇంటారాకాసెట్ డైరెక్ట్ చేశాడు. అసలు ఊహించని ట్విస్టులతో ఈ సిరీస్ అందరికీ మంచి అనుభూతిని అందిస్తుందని, ప్రతి ఒక్కరూ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ చూడాలని అతడు కోరాడు.
డోన్ట్ కమ్ హోమ్ మూవీలో చూపించే మ్యాన్షన్ ను ఈ సిరీస్ కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. తాను స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టినప్పటి నుంచే ఆ ఇల్లు ఎలా ఉండాలో ఊహించుకుంటూ ప్రొడక్షన్ హౌజ్ ను అందుకు అనుగుణంగా మ్యాన్షన్ నిర్మించాలని కోరినట్లు డైరెక్టర్ చెప్పాడు.
థాయ్‌లాండ్ లోని ఓ రెయిన్ ఫారెస్ట్ లో ఉండే ఇల్లు అది. ఈ ఇల్లే మొత్తం సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించబోతోందని డైరెక్టర్ తెలిపాడు. అక్టోబర్ 31 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ డోన్ట్ కమ్ హోమ్ వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి.