Vignesh Shivan: ఇంటర్వ్యూలో నోరుజారి.. ట్రోలర్స్ దెబ్బకి వివరణ ఇచ్చిన నయనతార భర్త విఘ్నేశ్ శివన్
18 December 2024, 15:22 IST
Vignesh Shivan Troll: అజిత్ తన నేనూ రౌడీనే సినిమాను మెచ్చుకుని ఎంతవాడు గానిలో ఓ పాట రాయడానికి ఛాన్స్ ఇచ్చాడని ఇటీవల గొప్పగా చెప్పుకున్న డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. ట్రోలింగ్‌కి గురయ్యాడు. ఎట్టకేలకి తప్పిదాన్ని గుర్తించి.. తాజాగా వివరణ ఇచ్చాడు.
విఘ్నేశ్ శివన్, నయనతార
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ ఎట్టకేలకు తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించాడు. డైరెక్టర్ కూడా అయిన విఘ్నేశ్ శివన్ ఇటీవల హీరో ధనుష్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడే క్రమం నోరుజారి నెటిజన్లకి అడ్డంగా దొరికిపోయాడు. దాంతో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ మొదలవడంతో ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేసి సైలెంట్ అయిపోయాడు. ఎట్టకేలకి ఆ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలపై విఘ్నేశ్ శివన్ వివరణ ఇచ్చాడు.
అజిత్ పేరు చెప్పి.. దొరికి
విఘ్నేశ్ శివన్ ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడంటే? తాను దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీ (తెలుగులో నేనూ రౌడీనే) సినిమా చూసి హీరో అజిత్ మెచ్చుకుంటూ తన సినిమా ఎన్నై అరిందాల్ (తెలుగులో ఎంతవాడు గాని) కోసం పాట రాయమన్నట్లు విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు. ధనుష్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన నేనూ రౌడీనే సినిమా కంటే ముందు తన క్రేజ్‌ను చెప్పుకోవడానికి విఘ్నేశ్ శివన్ ప్రయత్నించాడు.
సమాధానం చెప్పలేక ట్విట్టర్ నుంచి అవుట్
కానీ.. ఇక్కడే నయనతార భర్త నెటిజన్లకి దొరికిపోయాడు. ఎంతవాడు గాని సినిమా 2015, ఫిబ్రవరిలో రిలీజ్ అవగా.. నేనూ రౌడీనే మూవీ అదే ఏడాది అక్టోబరులో విడుదలైంది. దాంతో సినిమా రిలీజ్ అవ్వకుండానే అజిత్ ఎలా చూసి మెచ్చుకున్నాడు? పాట రాయమని ఎలా అడిగాడు? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్రోలింగ్ మొదలెట్టారు. దాంతో సమాధానం చెప్పలేక విఘ్నేశ్ శివన్ ట్విట్టర్ నుంచి వైదొలిగాడు.
నిజం ఇది.. వెక్కిరింపులు ఆపండి
ఆ ట్రోలింగ్‌కి కారణమైన ఇంటర్వ్యూలోని తన మాటలకి విఘ్నేశ్ శివన్ తాజాగా వివరణ ఇచ్చాడు. ‘‘ఆరోజు ఇంటర్వ్యూలో అన్ని విషయాల్ని వివరంగా చెప్పలేకపోయాను. ఇంటర్వ్యూలో ప్రతి విషయాన్ని వివరించేంత టైమ్ ఉండదు కదా? వాస్తవానికి ఎంతవాడు గానీ మూవీ టైమ్ నుంచి అజిత్ నాకు తెలుసు. ఆ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ పాట రాయమని అడిగితే రాసిచ్చాను. ఆ క్రమంలోనే అజిత్‌తో నాకు పరిచయం ఏర్పడి.. స్నేహంగా మారింది. ఆ తర్వాత అజిత్ ‘విశ్వాసం’ షూటింగ్‌లో ఉన్నప్పుడు నేను వెళ్లి కలిశాను. అప్పుడు నేనూ రౌడీనే సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆయన ప్రశంసించారు. జరిగింది ఇది.. ఇకనైనా వెక్కిరింపులు, ఎగతాళి చేయడం ఆపండి’’ అని విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు.
వివాదాల్లో నయన్ దంపతులు
ఇప్పటికే ధనుష్, నయనతార మధ్య నేనూ రౌడీనే సినిమాలోని 3 సెకన్ల క్లిప్‌ను వాడుకోవడంపై వివాదం నడుస్తుండగా.. ఇప్పుడు అది కోర్టుకి చేరింది. ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్లు గత వారం విఘ్నేశ్ శివన్‌పై జోరుగా ప్రచారం జరిగింది. దాంతో.. అన్నింటికీ చెక్ చెప్పే ఉద్దేశంతో విఘ్నేశ్ శివన్ మరోసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు.