తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thiru Review: డెలివరీ బాయ్ కరెక్ట్‌గా డెలివరీ చేశాడా? ధనుష్ 'తిరు' ఎలా ఉందంటే?

Thiru Review: డెలివరీ బాయ్ కరెక్ట్‌గా డెలివరీ చేశాడా? ధనుష్ 'తిరు' ఎలా ఉందంటే?

18 August 2022, 17:06 IST

google News
    • ధనుష్ హీరోగా నటించిన తిరు సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నిత్యా మీనన్, రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
తిరు
తిరు (Twitter)

తిరు

సినిమా: తిరు (2022)

నటీ, నటులు: ధనుష్, నిత్యా మీనన్, రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్, ప్రకాశ్ రాజ్, భారతీ రాజా

విడుదల తేదీ: 2022 ఆగస్టు 18

దర్శకుడు: మిత్రన్ జవహర్.

Thiru Movie Review in Telugu: కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం తిరు. తమిళంలో తిరుచిత్రాంబళం పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో తిరు అనే టైటిల్‌లో విడుదల చేశారు. ఇటీవల కాలంలో ధనుష్ నటించిన అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడీ తమిళ హీరో. గతేడాది వచ్చిన కర్ణన్ అతడి చివరి విజయం. అనంతరం వచ్చిన పటాస్, జగమే తంత్రం, ది గ్రే మ్యాన్ లాంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన తిరు సక్సెస్ అవుతుందని గట్టిగా నమ్మకం పెట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా ఈ గురువారం నాడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ..

తిరు(ధనుష్) ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఓ రొటీన్, బోరింగ్ లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. ఓ ప్రమాదంలో తన తల్లి, సోదరిని కోల్పోతాడు. దీంతో అతడి తండ్రి(ప్రకాశ్ రాజ్), తాత(భారతీ రాజా)తో కలిసి జీవిస్తుంటాడు. ఈ ముగ్గురూ తరచూ పోట్లాడుకుంటూ ఉంటారు. దీంతో తిరు స్నేహితురాలు శోభన(నిత్యా మీనన్) అతడిని ఓదార్చుతూ, మద్దతుగా ఉంటుంది. వీరిద్దరూ ఎల్లప్పుడు వెన్నుదన్నుగా ఉంటారు. ఇంతలో తన చిన్ననాటి స్నేహితురాలు అనూష(రాశీ ఖన్నా) ప్రేమలో పడతాడు. అయితే ఆమె అతడి ప్రేమ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. ఇదిలా ఉంటే అకస్మాత్తుగా తిరు తండ్రికి గుండె పోటు వస్తుంది. ఈ విషాదాలతో జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ సమయంలో అతడి జీవితంలో కొన్ని మంచి విషయాలు జరగడం ప్రారంభిస్తాయి. అవేంటో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..

ధనుష్, నిత్యా మీనన్ బంధం ఈ చిత్రంలో హైలెట్. వీరిద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీరు కలిసున్న దాదాపు ప్రతి సన్నివేశం గొప్పగా ఉంటుంది. అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం ఎందుకు గొప్దో చెప్పడానికి వీరు మంచి ఉదాహరణ. ఈ సినిమా కోసం తన కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ధనుష్ ఎంతో నేచురల్‌గా ఉంటాడో.. ఇందులో పాత్రలోనూ అంతే సహజంగా నటిస్తాడు. పేరుకు ముగ్గురు హీరోయిన్లన్న మాటే కానీ.. ప్రియ భావానీ శంకర్‌ పాత్ర నిడివి తక్కువ. ఇందులో ఆమె నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. రాశీ ఖన్నాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వీరిద్దరూ తిరు జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ప్రకాశ్ రాజ్ తనకు నప్పిన తండ్రి పాత్రలో అదరగొట్టారు. అలాగే తాత పాత్రను పోషించిన భారతీ రాజా కూడా ఆకట్టుకున్నారు. తాత, మనవడి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఎలా ఉందంటే..

ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్ చాలా బాగా చిత్రీకరించారు. తిరు, శోభన మధ్య స్టోరీని వినోదాత్మకంగా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. కథను కూడా దర్శకుడు అందంగా రాసుకున్నాడు. భావోద్వేగాలను బాగా చిత్రీకరించాడు. కథకు తగినట్లుగా కథనం కూడా కొంచెం వేగంగా ఉన్నట్లయితే ఇంకా బాగుండేది. కొన్ని అనవసర సన్నివేశాలను తొలగించి స్క్రీన్ ప్లే వేగం పెంచాల్సింది. అయితే నటీ, నటుల పర్ఫార్మెన్స్ వల్ల ఆ లోటు పెద్దగా కనిపించదు.

సాంకేతికంగా ఎలా ఉందంటే..

ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం ప్రధాన బలం. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు అద్భుతంగా అందించారు. బీజీఎం బాగుంటుంది. పాటలు తెలుగు నేటివిటీకి తగినట్లుగా అనిపించవు. డీఓపీ ఓం ప్రకాశ్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. మంచి విజువల్స్‌ను అందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు మిత్రన్ జవహర్ దగ్గరకొస్తే మంచి చిత్రాన్ని అందించాడు. అతడి క్యారెక్టరైజేషన్ బాగుంది.

చివరగా ఈ సినిమాను ధనుష్, నిత్యా మీనన్ కోసం ఓ లుక్కేయవచ్చు

రేటింగ్: 3/5

తదుపరి వ్యాసం