తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Review: దేవర మూవీ రివ్యూ - ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ద‌క్కిందా? లేదా?

Devara Review: దేవర మూవీ రివ్యూ - ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ద‌క్కిందా? లేదా?

27 September 2024, 11:20 IST

google News
  • Devara Review: ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ దేవ‌రతో శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు ఎన్టీఆర్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్‌కు కొర‌టాల శివ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చాడా లేదా అన్న‌ది దేవ‌ర మూవీ రివ్యూలో చూద్దాం..

దేవర రివ్యూ
దేవర రివ్యూ

దేవర రివ్యూ

Devara Review: జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన దేవ‌ర మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా క‌నిపించాడు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ అంచ‌నాలు న‌డుమ రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? సోలో హీరోగా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఎన్టీఆర్‌కు హిట్ ద‌క్కిందా? లేదా? అంటే?

దేవ‌ర క‌థ‌...

ఎర్ర స‌ముద్రంంలోని నాలుగు ఊళ్ల‌కు దేవ‌ర (ఎన్టీఆర్‌) చెప్పిందే వేదం. తన స్నేహితుడు రాయ‌ప్ప‌(శ్రీకాంత్), మ‌రో ఊరి పెద్ద భైర‌తో (సైఫ్ అలీఖాన్) పాటు మ‌రికొంద‌రితో (క‌ళ‌య‌రాస‌న్‌, షైన్ టామ్ చాకో) క‌లిసి మురుగ (ముర‌ళీ శ‌ర్మ‌) కోసం ప‌నిచేస్తుంటాడు దేవ‌ర‌. నౌక‌ల్లో మురుగ దిగుమ‌తి చేసుకుంటున్న అక్ర‌మ ఆయుధాల్ని నావీ అధికారుల కంట‌ప‌డ‌కుండా ఒడ్డుకు చేరుస్తుంటాడు దేవ‌ర‌.

ఈ అక్ర‌మ ఆయుధాల కార‌ణంగా త‌మ త‌మ జీవితాల‌కే ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని భావించిన దేవ‌ర మురుగ కోసం ప‌నిచేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంటాడు.

త‌న మాట‌ను కాద‌ని మురుగ కోసం ప‌నిచేయ‌డానికి వెళ్లిన‌ వారిని దేవ‌ర శిక్షిస్తాడు. దాంతో దేవ‌రకు భ‌య‌ప‌డి ఎర్ర‌స‌ముద్రం ప్రాంత ప్ర‌జ‌లు స‌ముద్రంలోకి అడుగుపెట్ట‌డానికి భ‌య‌ప‌డుతుంటారు. అక్ర‌మ ఆయుధాల వ్యాపారం స‌జావుగా సాగ‌డానికి దేవ‌ర అడ్డు తొల‌గించాల‌ని భైరా ప్లాన్ చేస్తాడు.

మ‌రోవైపు దేవ‌ర ధైర్యానికి చిరునామా అయితే అత‌డి కొడుకు వ‌ర (ఎన్టీఆర్‌) భ‌యానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా పెరుగుతాడు. క‌ళ్ల‌ముందు అన్యాయం జ‌రుగుతున్నా ఎదురించ‌లేక‌పోతాడు.స్నేహితుడైన‌ భైర త‌న‌ను చంపాల‌నుకున్న విష‌యం తెలిసి దేవ‌ర ఏం చేశాడు?

అత‌డు క‌నిపించ‌కుండా పోవ‌డానికి కార‌ణం ఏమిటి? వ‌ర పిరికివాడిగా ఎందుకు పెరిగాడు? తండ్రి ల‌క్ష్యాన్ని వ‌ర ఎలా పూర్తిచేశాడు? ఎర్ర స‌ముద్రం ప్రాంత వాసుల కోసం ఎలాంటి పోరాటం చేశాడు? వ‌ర‌ను ప్రేమించిన తంగం (జాన్వీ క‌పూర్‌) ఎవ‌రు అన్న‌దే దేవ‌ర మూవీ కథ‌.

ఎలివేష‌న్లు, హీరోయిజం...

ప్ర‌స్తుతం క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు అర్థం మారిపోయింది. క‌థ కంటే హీరో ఇమేజ్‌, ఎలివేష‌న్లు, హీరోయిజం న‌మ్ముకునే ద‌ర్శ‌కులు సినిమాలు చేస్తున్నారు. అదే బాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములాగా మారిపోయింది. దేవ‌ర‌తో ఆ ట్రెండ్‌ను ఫాలో అయ్యాడు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. క‌థ కంటే క‌థ‌నం, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తోనే ఎన్టీఆర్ అభిమానుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.

1996 వ‌ర‌ల్డ్ క‌ప్ బ్యాక్‌డ్రాప్‌...

1996 వ‌ర‌ల్డ్ క‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో క‌థ‌ను మొద‌లుపెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. నేరుగా క‌థ‌ను చూపించ‌కుండా య‌తి అనే గ్యాంగ్‌స్ట‌ర్‌ను ప‌ట్టుకోవ‌డానికి శివం అనే పోలీస్ ఆఫీస‌ర్ ర‌త్న‌గిరి ప్రాంతానికి రావ‌డం, అక్క‌డే సింగ‌ప్ప ద్వారా దేవ‌ర క‌థ‌ను చెప్ప‌డం ఆక‌ట్టుకుంటుంది.

అండ‌ర్ వాట‌ర్ సీక్వెన్స్‌...

సొర చేప‌ను చంపేంత ధైర్య‌వంతుడు అంటూ ఎర్ర‌స‌ముద్రం ప్రాంతానికి తిరుగులేని రాజు అంటూ ఫ‌స్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ హీరోయిజం చుట్టే క‌థ‌ను న‌డిపించాడు కొర‌టాల శివ‌.

మురుగ కోసం దేవ‌ర‌, భైర టీమ్ చేసే సాహ‌సాలు, ఆ త‌ర్వాత తాము తీసుకొచ్చిన అక్ర‌మ ఆయుధాల కార‌ణంగా ఓ ప్రాణం పోవ‌డంతో దేవ‌ర రియ‌లైజ్ అయ్యే ఎపిసోడ్స్‌తో క‌థ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. మురుగ కోసం ప‌నిచేయ‌కూడ‌ద‌ని దేవ‌ర నిర్ణ‌యించుకోవ‌డం, అత‌డికి న‌మ్మిన బంటుగానే ఉంటూ భైర‌వ వేసే ఎత్తుల‌తో ఫ‌స్ట్‌హాఫ్ సెటప్ బాగా కుదిరింది. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్‌ను భారీగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్ట‌ర్‌. ఆ యాక్ష‌న్ సీన్‌లో ఎన్టీఆర్ హీరోయిజాన్ని ప‌తాక స్థాయిలో చూపించాడు.

కామెడీ ల‌వ్‌స్టోరీ...

ఫ‌స్ట్ హాఫ్ సీరియ‌స్‌గా సాగితే...సెకండాఫ్‌ను అందుకు భిన్నంగా కామెడీ, ల‌వ్‌స్టోరీతో అల్లుకున్నాడు కొర‌టాల శివ‌. దేవ‌ర‌కు పూర్తి భిన్న మ‌న‌స్త‌త్వంతో వ‌ర క్యారెక్ట‌రైజేష‌న్ సాగుతుంది. అదంతా వ‌ర ఆడుతోన్న నాట‌కం అని రివీల‌య్యే ఎపిసోడ్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉంటుంది. తంగంతో వర ల‌వ్‌స్టోరీ టైమ్‌పాస్ చేస్తుంది. అండ‌ర్‌ వాట‌ర్ సీక్వెన్స్‌లు తెలుగు తెర‌పై ఇదివ‌ర‌కు పెద్ద‌గా రాలేదు.సెకండాఫ్‌లోని ఈ యాక్ష‌న్ ఎపిసోడ్స్ కొత్త‌గా అనిపిస్తాయి.

క్లైమాక్స్ ట్విస్ట్‌...

క్లైమాక్స్‌ను ఓ ట్విస్ట్‌తో ఎండ్ చేశాడు కొరటాల శివ. అది గ‌తంలో తెలుగులో వ‌చ్చిన ట్రెండ్ సెట్ట‌ర్ మూవీని గుర్తు చేస్తుంది. ఆ ట్విస్ట్ వెన‌కున్న క‌థ ఏమిట‌న్న‌ది సెకండ్ పార్ట్‌లో చూడాలంటూ లీడ్ ఇచ్చాడు.

ఏదో ఒక బ‌ల‌మైన సామాజికాంశాన్ని తీసుకొని దానికి క‌మ‌ర్షియ‌ల్ హంగులు, ఎమోష‌న్స్‌తో సినిమా చేయ‌డం కొర‌టాల శివ స్టైల్‌. కానీ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ మిస్స‌యింది. క‌థ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. కథలో నెక్స్ట్ ఏం జ‌రుగ‌బోతుంద‌న్న‌ది ఈజీగా గెస్ చేసేలా ఉంది. ట్విస్ట్‌లు కూడా సింపుల్‌గానే ఉన్నాయి. ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్ ల‌వ్‌స్టోరీని సోసోగానే అనిపిస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు మిన‌హా మిగిలిన సన్నివేశాల్లో కొరటాల మార్కు ఎక్క‌డ క‌నిపించ‌దు.

రెండు పాత్ర‌ల్లో వేరియేష‌న్స్‌...

దేవ‌ర‌, వ‌ర రెండు పాత్ర‌ల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు. భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన పాత్ర‌లు అత‌డు చూపించిన వేరియేష‌న్‌, డైలాగ్ డెలివ‌రీ బాగున్నాయి. ఎన్టీఆర్‌పై షూట్ చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా ఉన్నాయి. ఎన్టీఆర్‌కు ధీటుగా సైఫ్ అలీఖాన్ విల‌నిజం సాగింది.

భైర పాత్ర‌లో త‌న‌ను త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేనంత‌గా సైఫ్ అలీఖాన్ న‌టించాడు. జాన్వీక‌పూర్ పాత్ర‌కు పాట‌లు, కొన్ని సీన్స్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, ముర‌ళీ శ‌ర్మ న‌ట‌న ఓకే అనిపిస్తుంది. అనిరుధ్ బీజీఎమ్‌, చుట్ట‌మ‌ల్లే పాట బాగున్నాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాత్ర‌మే...

దేవ‌ర ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను మెప్పించే మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. క‌థ‌లో లోపాలు ఉన్నా ఎన్టీఆర్ యాక్టింగ్‌, హీరోయిజం కోసం ఈ మూవీని చూడొచ్చు.

రేటింగ్‌: 3/5

తదుపరి వ్యాసం