Daku Maharaj Trailer: బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ వచ్చేది ఆరోజే.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడో చెప్పిన నిర్మాత
23 December 2024, 16:35 IST
- Daku Maharaj Trailer: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా నుంచి ట్రైలర్ రెడీ అవుతోంది. ఏ రోజు ట్రైలర్ రానుందో నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగనుందో కూడా తెలిపారు.
Daku Maharaj Trailer: బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ వచ్చేది ఆరోజే.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడో చెప్పిన నిర్మాత
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహరాజ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 12వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. యాక్షన్ మూవీగా డాకు మహారాజ్ మూవీకి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నేడు (డిసెంబర్ 23) మీడియా సమావేశంలో మాట్లాడారు నాగవంశీ. ట్రైలర్ రిలీజ్, ప్రమోషనల్ ఈవెంట్ల ప్లానింగ్ సహా మరిన్ని విషయాల గురించి వెల్లడించారు.
ట్రైలర్ డేట్ అదే.. ఈవెంట్ల వివరాలు
జనవరి 2వ తేదీన డాకూ మహారాజ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు నిర్ణయించామని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఆంధ్రలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశామని అన్నారు. “హైదరాబాద్‍లో జనవరి 2న ట్రైలర్ అనుకుంటున్నాం. జనవరి 4న అమెరికా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఓ సాంగ్ లాంచ్ చేస్తాం. జనవరి 8న ఆంధ్రలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. విజయవాడ లేదా మంగళగిరిలో ఉండొచ్చు” అని నాగవంశీ వెల్లడించారు.
డాకు మహారాజ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నాయని నాగవంశీ చెప్పారు. బాలకృష్ణను చివరి 20,30 ఏళ్లలో ఇలాంటి విజువల్స్‌లో చూసి ఉండని అన్నారు. తాను బ్యాక్‍గ్రౌండ్ స్కోర్‌తో పాటు ఈ మూవీ చూశానని, చాలా పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.
అంచనాలకు మించి..
ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అంచనాలకు మించి ఉంటాయని డైరెక్ట్ బాబీ చెప్పారు. “సినిమా చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. బాలకృష్ణను మాస్‍తో అందంగా చూపించాలని అనుకుంటున్నాం. బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్‌టైన్‍మెంట్ ఉంటుంది, మీరు అంచనాలు వేసే దాని కంటే యాక్షన్ ఎపిసోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి” అని బాబీ చెప్పారు.
చిరంజీవి అభిమానులు తిట్టుకున్నా పర్లేదు
మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య కన్నా డాకు మహారాజ్ సినిమాను బాబీ బాగా తీశారని నిర్మాత నాగవంశీ అన్నారు. “అంత కంటే బాగా తీశారు. చిరంజీవి అభిమానులు నన్ను తిట్టుకున్నా పర్లేదు. అంతకంటే బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది” అని నాగవంశీ చెప్పారు.
డాకు మహరాజ్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, చాందినీ చౌదరి కీలకపాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీతో పాటు సాయిసౌజన్య ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు.