Brahmastra Collections Record: బ్రహ్మాస్త్ర రికార్డు కలెక్షన్స్.. 2022లో నంబర్ 1 హిందీ మూవీ!
04 October 2022, 13:02 IST
- Brahmastra Collections Record: బ్రహ్మాస్త్ర రికార్డు కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ 25 రోజుల కలెక్షన్లను షేర్ చేసిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. 2022లో నంబర్ 1 హిందీ మూవీగా నిలిచినట్లు చెప్పాడు.
బ్రహ్మాస్త్ర మూవీలో రణ్ బీర్, ఆలియా
Brahmastra Collections Record: బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ను మళ్లీ గాడిలో పెట్టిన మూవీ బ్రహ్మాస్త్ర. సుమారూ రూ.410 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అంచనాలకు తగినట్లే కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది. ఈ మూవీకి తొలి రోజే మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లతో దూసుకెళ్లింది.
సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ బ్రహ్మాస్త్ర మూవీ ఇప్పుడు 25 రోజుల్లో రూ.425 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చెప్పాడు. నిజానికి ఈ సినిమా కలెక్షన్లపై కాస్త గందరగోళం ఉంది. మూవీ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్, ఇండిపెండెంట్ ట్రాకర్స్ ఇచ్చిన కలెక్షన్లలో కాస్త తేడా ఉంది. అయితే ఇప్పుడా మూవీ డైరెక్టర్ ప్రకారం రికార్డు కలెక్షన్లతో బ్రహ్మస్త్ర మూవీ 2022లో నంబర్ వన్ హిందీ మూవీగా నిలిచింది.
"నంబర్ 1 హిందీ మూవీ ఆఫ్ 2022. థ్యాంక్యూ. హ్యాపీ నవమి" అనే క్యాప్షన్‌తో అయాన్ ఈ కలెక్షన్ల కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల్లో బ్రహ్మాస్త్ర రూ.425 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా భూల్ భులయ్యా 2, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలు సాధించిన కలెక్షన్ల కంటే ఎక్కువ మొత్తం బ్రహ్మాస్త్రకు వచ్చినట్లు అయాన్ వెల్లడించాడు.
అయితే కేవలం ఇండియన్ మార్కెట్ చూస్తే ఇప్పటికీ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ కంటే కూడా బ్రహ్మాస్త్ర వెనుకబడే ఉంది. ఇక హిందీ మార్కెట్ చూస్తే కేజీఎఫ్ 2, ఆర్‌ఆర్‌ఆర్ కంటే వెనుకబడి ఉంది. ఇక ఈ మూవీ బడ్జెట్‌పైనా స్పష్టత లేదు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1కే రూ.410 కోట్లు ఖర్చయినట్లు చెబుతుండగా.. మూవీ డైరెక్టర్ అయాన్, హీరో రణ్‌బీర్ మాత్రం రెండో పార్ట్ ప్రీప్రొడక్షన్ ఖర్చులు కూడా ఇందులో ఉన్నట్లు చెప్పారు.
ఈ సినిమా క్లైమ్యాక్స్‌ను తొలి షెడ్యూల్‌లోనే చిత్రీకరించిన తర్వాత సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బడ్జెట్ మూడింతలు అయినట్లు కూడా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చెప్పాడు. అయితే దీనికి ఇంత భారీ మొత్తం ఖర్చవుతుందని ఎవరూ ఊహించలేదని అన్నాడు. ఇక బ్రహ్మాస్త్ర ఫ్రాంఛైజ్‌లో రెండో సినిమా 2025 దీపావళికి, మూడో సినిమా 2026 క్రిస్మస్‌కు రానున్నట్లు కూడా తెలిపాడు.