Brahmastra: బ్రహ్మాస్త్ర నుంచి కొత్త వీడియో.. అస్త్రావెర్స్‌ను పరిచయం చేసిన అయాన్‌-we created a astraverse for the movie brahmastra says ayan mukherjee on a new video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  We Created A Astraverse For The Movie Brahmastra Says Ayan Mukherjee On A New Video

Brahmastra: బ్రహ్మాస్త్ర నుంచి కొత్త వీడియో.. అస్త్రావెర్స్‌ను పరిచయం చేసిన అయాన్‌

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 04:01 PM IST

Brahmastra: బాలీవుడ్‌తోపాటు ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిరేపుతున్న మూవీ బ్రహ్మాస్త్ర. కొత్తగా పెళ్లయిన జంట రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ కలిసి నటించిన సినిమా కావడంతోపాటు భారత పురాణ, ఇతిహాసాల్లోని అస్త్రాలకు సంబంధించిన మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

విశాఖపట్నంలో బ్రహ్మాస్త్ర ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజమౌళి, రణ్ బీర్ కపూర్ లతో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ
విశాఖపట్నంలో బ్రహ్మాస్త్ర ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజమౌళి, రణ్ బీర్ కపూర్ లతో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (PTI)

బ్రహ్మాస్త్ర.. అయాన్‌ ముఖర్జీలాంటి ఓ యువ డైరెక్టర్‌, యే జవానీ హై దివానీలాంటి యూత్‌ మెచ్చే సినిమా తీసిన వ్యక్తి ఇలా భారత పురాణ, ఇతిహాసాల్లోని అస్త్రాలపై సినిమా తీయడం నిజంగా విశేషమే. బ్రహ్మాస్త్రలో పార్ట్‌ వన్‌ శివ పేరుతో సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. దీనికి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక ఇప్పుడు డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ మరో వీడియోను రిలీజ్‌ చేశాడు. ఇందులో అగ్ని, నంది, జల, పవన, ప్రభ, చివరిగా బ్రహ్మాస్త్రం గురించి ఈ వీడియోలో అయాన్‌ వివరించడం విశేషం. ఈ మూవీలో హీరో రణ్‌బీర్‌ కపూర్‌ అగ్ని అస్త్రంగా కనిపించనుండగా.. టాలీవుడ్‌ హీరో నాగార్జున నంది అస్త్రంగా కనిపించనున్నాడు. అమితాబ్‌ బచ్చన్‌, మౌనిరాయ్‌లాంటి వాళ్లు కూడా ఈ మూవీలో నటించారు.

బ్రహ్మాస్త్రలోని అస్త్రాలు, ఈ మూవీలో తన హీరోకి శివ అన్న పేరు ఎందుకు పెట్టామన్నది అయాన్‌ ఈ కొత్త వీడియోలో వివరించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అయాన్‌ ఈ వీడియోను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు. బ్రహ్మాస్త్ర మూవీ ఓ ఫిక్షనే అయినా.. దీనిద్వారా భారతదేశ ఆధ్యాత్మిక గొప్పదనాన్ని చాటిచెప్పాలని అనుకున్నట్లు అయాన్‌ తెలిపాడు. గురుపౌర్ణమిలాంటి పవిత్రమైన రోజున ఈ బ్రహ్మాస్త్ర కాన్సెప్ట్‌ గురించి తాను చెప్పాలనుకొని ఈ వీడియో రూపొందించినట్లు చెప్పాడు.

ఈ సినిమా కోసం తాము అస్త్రాలతో ఓ అస్త్రావెర్స్‌ను క్రియేట్‌ చేసినట్లు అయాన్‌ చెప్పడం విశేషం. ఎప్పుడో ఐదేళ్ల కిందటే షూటింగ్‌ ప్రారంభమైన ఈ బ్రహ్మాస్త్ర మూవీ కరోనా కారణంగా చాలా ఆలస్యమైంది. ఈ ఏడాది మార్చిలోనే షూటింగ్‌ పూర్తి చేసుకొని సెప్టెంబర్‌ 9న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఓ పాన్‌ ఇండియా సినిమాగా రిలీజ్‌ కాబోతోంది.

IPL_Entry_Point