Kashmir Files | బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న కశ్మీర్ ఫైల్స్
Kashmir Files మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. రిలీజైన 9 రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది.
సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రమోట్ చేసిన కశ్మీర్ ఫైల్స్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనూహ్యంగా దూసుకెళ్తోంది. ఓ చిన్న సినిమాగా రిలీజైన ఈ వివేక్ అగ్నిహోత్రి మూవీ.. ఇప్పుడు రూ.150 కోట్ల కలెక్షన్ల మార్క్‌కు చేరవవుతుండటం విశేషం. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.
తాజాగా 9వ రోజు అయిన శనివారం ఈ మూవీ తన అత్యధిక ఒకరోజు కలెక్షన్లను నమోదు చేసింది. శనివారం ఒక్క రోజే కశ్మీర్ ఫైల్స్ రూ.24.80 కోట్ల వసూలు చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెప్పారు. దీంతో ఇప్పటి వరకూ ఈ మూవీ మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.141.25 కోట్లకు చేరాయి. రెండో వారం పూర్తయ్యే సరికి రూ.150 కోట్లు మార్క్ అందుకుంటుందని మొదట భావించినా.. ఇప్పుడు సోమవారంతోనే ఆ రికార్డు అందే అవకాశాలు ఉన్నాయి.
రెండో వారం ముగిసే సమయానికి మొత్తం కలెక్షన్లు రూ.175 కోట్ల మార్క్ కూడా దాటేస్తుందని అంచనా. ఆదివారం ఈ మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క రోజే రూ.28 కోట్లయినా రావచ్చని చెబుతున్నారు. తొలిరోజు కేవలం రూ.3.55 కోట్ల కలెక్షన్లకే పరిమితమైన ఈ మూవీ.. క్రమంగా తన రికార్డును పెంచుకుంటూ వస్తోంది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, ఈ మూవీ సక్సెస్‌ను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ సాక్షాత్తూ ప్రధాని మోదీయే అనడంతో కశ్మీర్ ఫైల్స్‌కు పబ్లిసిటీ విపరీతంగా పెరిగిపోయింది.
8వ రోజే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. మొదట్లో కేవలం 630 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా.. రెండో వీకెండ్‌కు 4000 స్క్రీన్లకు చేరింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోకీ డబ్ చేశారు. 1990ల్లో చెలరేగిన కశ్మీర్ తిరుగుబాటులో భాగంగా అక్కడి పండిట్లు లోయను వదిలి వలస వెళ్లిన తీరును ఈ సినిమా కళ్లకు కట్టింది. ఈ మూవీ చూసిన చాలా మంది భావోద్వేగానికి గురవుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్