Brahmamudi September 16th Episode: కొడుకు తప్పుచేశాడని అపర్ణ తీర్పు - కావ్యకు క్షమాపణలు చెప్పనున్న రాజ్
16 September 2024, 7:42 IST
Brahmamudi: బ్రహ్మముడి సెప్టెంబర్ 16 ఎపిసోడ్‌లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అపర్ణకు కావ్య కనిపించదు. కోడలు ఇంట్లో లేకపోవడంతో కావ్యను రుద్రాణి ఏదో చేసి ఉంటుందని అపర్ణ అనుమానిస్తుంది. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి రాజ్ కారణమని స్వప్న నిజం బయటపెడుతుంది.
బ్రహ్మముడి సెప్టెంబర్ 16 ఎపిసోడ్
Brahmamudi September 16th Episode: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అపర్ణ ఇంటికొస్తుంది. అపర్ణకు స్వప్న హారతి ఇస్తుంది. ఇలాంటి పనులన్నీ కావ్య చేస్తుంది కదా. నా కోడలు ఎక్కడ, కావ్య ఎందుకు కనిపించడం లేదు అని కుటుంబసభ్యులను అపర్ణ అడుగుతుంది. స్వప్నతో పాటు ఎవరూ సమాధానం చెప్పరు. ఇంకెక్కడి నీ కోడలు...ఎప్పుడో వెళ్లిపోయిందంటూ రుద్రాణి నిజం చెప్పబోతుంది. రుద్రాణి మాటలను రాజ్ అడ్డుకుంటాడు.
రాజ్ అబద్ధం...
నీ ఆరోగ్యం కుదుటపడాలని అమ్మవారికి కావ్య మొక్కుకుందట. వారం నుంచి ప్రతిరోజు గుడికి వెళుతుందని తల్లితో అబద్దం చెబుతాడు రాజ్. నేను కళ్లు తెరవగానే నా పక్కనే కావ్య ఉంటుందనుకున్నా...అసలు నేను డిశ్చార్జ్ అయిన విషయం కావ్యకు తెలుసా అని రాజ్‌ను అడుగుతుంది. కావ్య పూజలో ఉందని, వ్రతం పూర్తయిన తర్వాత తప్పకుండా వస్తుందంటూ కావ్య గురించి తల్లికి అబద్దాల మీద అబద్దాలు చెబుతాడు రాజ్.
రుద్రాణికి వార్నింగ్...
నీ పిచ్చివాగుడు పక్కనపెట్టి కొద్ది రోజులు పద్దతిగా ఉండమని రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయం ఇప్పుడే అపర్ణకు చెప్పొద్దని రాజ్ అందరికి చెప్పాడుగా...అయినా ఎలా నోరుజారావు అని క్లాస్ ఇస్తుంది.
అపర్ణకు ఏదైనా జరిగితే నిన్ను వదిలిపెట్టనని రుద్రాణిని హెచ్చరిస్తుంది కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందనే నిజం తెలిసిన వెంటనే అపర్ణ గుండె ఆగిపోవడం ఖాయమని, అదే జరిగితే రాజ్ డిప్రెషన్‌లోకి వెళతాడని, కావ్య ఇక ఎప్పటికీ ఇంటికి రాదని రుద్రాణి లోలోన అనుకుంటుంది.
కావ్య ఉద్యోగ ప్రయత్నాలు...
కావ్య ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఉద్యోగం కోసం గతంలో తన డిజైన్స్‌ను అమ్మి పెట్టిన సందీప్ అనే వ్యక్తిని కలుస్తుంది. కావ్య వేసిన డిజైన్స్‌ను తాను దుగ్గిరాల కంపెనీకి అమ్మేవాడినని, ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కోడలివే కదా అని అతడు అడుగుతాడు.
నువ్వు తలచుకుంటే కొత్త కంపెనీనే పెట్టొచ్చని అంటాడు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని తన సమస్యలను అతడికి ఇన్‌డైరెక్ట్‌గా అర్థమయ్యేలా చెబుతుంది. ఎవరైనా డిజైనర్ అవసరం ఉందని అంటే తప్పకుండా నీకు చెబుతానని కావ్యకు మాటిస్తాడు సందీప్.
రాజ్ తడబాటు...
అపర్ణకు ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి తల్లి రూమ్‌కు వస్తాడు రాజ్. కావ్య ఇంకా రాలేదా అని రాజ్‌ను అడుగుతుంది అపర్ణ. తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రాజ్ తడబడిపోతాడు. కావ్య వస్తుందని సర్ధిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.ఆ తర్వాత ధాన్యలక్ష్మి...అపర్ణ రూమ్‌కు వస్తుంది. నేను హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత ఇంట్లో ఏమైనా జరిగిందా?
కావ్య ఎందుకు కనిపించడం లేదు...ఎక్కడికి వెళ్లిందని ధాన్యలక్ష్మిని అపర్ణ అడుగుతుంది. ధాన్యలక్ష్మితో పాటు అక్కడే ఉన్న ఇందిరాదేవి కూడా సమాధానం దాస్తారు. నా ఆరోగ్యం బాగా లేదని తెలిసి కూడా కావ్య పక్కన ఉండకుండా ఎక్కడికి వెళ్లింది? నా కోడలికి ఏమైందో చెప్పమని అపర్ణ ఎమోషనల్ అవుతుంది.
అపర్ణకు నిజం తెలిస్తే ఆమె బతుకుతుందో లేదో అని ఇందిరాదేవి కంగారు పడుతుంది. ఈ నిజాన్ని దాచడం కష్టమని అనుకుంటుంది. ఏం జరిగినా నువ్వే బాధ్యత వహించాలని రాజ్‌తో చెబుతుంది ఇందిరాదేవి.
కావ్య కోసం ఎదురుచూపులు...
రాత్రయిన నిద్రపోకుండా కావ్య కోసం గుమ్మంలో ఎదురుచూస్తుంటుంది అపర్ణ. కానీ కావ్య ఎంతకి రాకపోవడంతో తాను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఇంట్లో ఏదో జరిగి ఉందని అనుకుంటుంది. కావ్య ఎక్కడికి వెళ్లిందో చెప్పమని కొడుకును నిలదీస్తుంది. ఇప్పటివరకు ఎందుకు రాలేదని అడుగుతుంది. కావ్య రాకపోతే నువ్వు ఎందుకుపట్టించుకోనట్లుగా ఉంటున్నావని ప్రశ్నిస్తుంది. కావ్య ఎప్పటికీ ఈ ఇంటికి రాదా చెప్పమని కొడుకును గట్టిగా అడుగుతుంది. అందరూ ఏదో దాస్తున్నారని అర్థమైపోయిందని అపర్ణ అంటుంది.
రుద్రాణిపై విరుచుకుపడ్డ అపర్ణ...
కావ్య ఇంట్లో లేదంటే ఆమె మనసు విరిగి వెళ్లిపోయి ఉండాలి. లేదంటే ఆమెను ఇంట్లో నుంచి బలవంతంగా ఎవరో ఒకరు పంపించి ఉంటారని అపర్ణ అంటుంది. భూదేవి అంత సహనం ఉన్న నా కోడలిని ఎవరు ఏమన్నారో చెప్పాలని అపర్ణ కోపంగా అందరిని అడుగుతుంది.నువ్వే కావ్యను ఏదో చేసుకుంటావని రుద్రాణిపై విరుచుకుపడుతుంది రుద్రాణి. ఏదో చాడీలు చెప్పి కావ్యను ఇంట్లో నుంచి పంపించి ఉంటావని వార్నింగ్ ఇస్తుంది. నీ కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి నేను కారణం కాదు...నీ కొడుకే పంపించాడని అసలు నిజం బయటపెడుతుంది రుద్రాణి.
తప్పులు చేసింది...
నీ కోడలు చేయాల్సిన తప్పులన్నీ చేసింది. నిలదీసేసరికి మొహం చూపించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని రుద్రాణి అంటుంది. రుద్రాణి మాటల్ని స్వప్న సహించలేకపోతుంది. నా చెల్లెలు తప్పు చేసిందని అంటే అత్తవని చూడకుండా లాగిపెట్టి చెంప పగలగొడతానని విరుచుకుపడుతుంది.కావ్య ఏ తప్పు చేయదు. తప్పు చేసేవాళ్లను క్షమించదని అపర్ణతో అంటుంది స్వప్న.
నిజం చెప్పిన స్వప్న...
కావ్యను మీరు కంపెనీకి పంపిస్తే వెళ్లిందా? తనంతట తానే వెళ్లిందా అని అపర్ణను అడుగుతుంది స్వప్న. నేను పంపిస్తేనే వెళ్లిందని అపర్ణ సమాధానమిస్తుంది. రాహుల్ తప్పు చేస్తున్నాడని ఎవరో ఫోన్ చేస్తే ఆపడానికి వెళ్లింది. ఆఫీస్‌కు కావ్య వెళ్లను అంటే నేను బలవంతంగా నేను ఆమెను పంపించానని అపర్ణ నిజం బయటపెడుతుంది. తల్లి చెప్పిన సమాధానం విని రాజ్ షాకవుతాడు.
రాహుల్ కావ్యను చంపేశాడని అపర్ణ పొరపడుతుంది. కావ్యను చంపేసింది మీ అబ్బాయి అని స్వప్న అంటుంది. కావ్య మనసును, వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చంపేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశాడని అసలు నిజం అపర్ణకు చెబుతుంది స్వప్న.
రుద్రాణి గొడవ...
కావ్య మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోవడం వల్లే మీరు కోమాలోకి వెళ్లిపోయారని, తప్పుచేసిన కావ్య దుగ్గిరాల ఇంటి కోడలిగా ఉండకూడదని రుద్రాణి గొడవ చేసిందని అపర్ణతో చెబుతుంది స్వప్న. రాజ్ భార్యగా కావ్య ఉండటానికి అర్హత లేదని తీర్మాణించిందని స్వప్న చెబుతుంది.
ఆ తర్వాత మీ అబ్బాయి కూడా కావ్యపైనే నిందలు వేశాడని జరిగిన సంగతి మొత్తం చెబుతుంది. నిన్ను ఇష్టం, ప్రేమతో పెళ్లిచేసుకోలేదని, అందరూ బలవంతం చేస్తే తప్పక కాపురం చేస్తున్నానని, నీకు నా భార్యగా ఉండే అర్హత లేదని కావ్య మనసు విరిగిపోయేలా రాజ్ మాట్లాడాడని, భర్త మనసులో స్థానమే లేనప్పుడు ఈ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదని కావ్య వెళ్లిపోయిందని నిజం మొత్తం చెప్పేస్తుంది స్వప్న.
రుద్రాణి, ధాన్యలక్ష్మి ఎంత వేధించిన సర్ధుకుపోయిన కావ్య...చివరకు భర్త ప్రేమలేదని అనేసరికి ఆత్మాభిమానం దెబ్బతిని వెళ్లిపోయిందని అంటుంది.
రాజ్‌దే తప్పు...
స్వప్న మాటలు విని అపర్ణ కంగారుపడుతుంది. రుద్రాణి చెప్పుడు మాటలకు లొంగిపోయి కట్టుకున్న భార్యను అవమానించి ఆమె మనసు విరిగిపోయేలా చేసిన రాజ్‌దే తప్పని అపర్ణ తీర్మాణిస్తుంది. నా కోడలు నిప్పు అని అంటుంది. కావ్యకు క్షమాపణలు చెప్పి ఆమెను ఇంటికి తీసుకురమ్మని రాజ్‌కు అర్డర్ వేస్తుంది అపర్ణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.