Horror OTT: మైండ్ బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే మలయాళం హారర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది - తెలుగులోనూ స్ట్రీమింగ్
16 September 2024, 6:12 IST
Horror OTT: మలయాళం హారర్ మూవీ హంట్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. హంట్ మూవీ జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భావన హీరోయిన్‌గా నటించిన హంట్ మూవీకి మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు.
హారర్ ఓటీటీ
Horror OTT: లేటెస్ట్ మలయాళం హారర్ మూవీ హంట్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. హంట్ మూవీలో భావన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు.
మిక్స్‌డ్ టాక్...
ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజైన హంట్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. భావన యాక్టింగ్ బాగున్నా రొటీన్ స్టోరీ కారణంగా హంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా హంట్ మూవీ ఓటీటీలోకి వస్తోన్నట్లు సమాచారం. ఈ నెల 20 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో హంట్ రిలీజ్ అవుతోన్నట్లు చెబుతోన్నారు.
పద్దెనిమిదేళ్ల తర్వాత...
హంట్ మూవీలో భావనతో పాటు రెంజీ ఫణిక్కర్, అజ్మల్ అమీర్ కీలక పాత్రల్లో నటించారు. 2006లో రిలీజైన చింతామణి కోలాకేస్ తర్వాత 18 ఏళ్ల అనంతరం భావన, డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాను తెరకెక్కించారు.
కానీ షాజీ కైలాస్ థ్రిల్లర్ సినిమాల్లో కనిపించే మెరుపులు, మ్యాజిక్ మాత్రం హంట్‌లోమిస్సయ్యాయి. థియేటర్లలో హంట్ మూవీ మోస్తారు కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ హారర్ మూవీకి పది కోట్ల లోపే కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
హంట్ మూవీ కథ ఇదే...
డాక్టర్ కీర్తి (భావన) ఫోరెన్సిక్ డాక్టర్. ఓ మహిళా హత్య కేసుకు సంబంధించిన ఆధారాల్ని కనిపెట్టే బాధ్యత కీర్తిపై పడుతుంది. ఆ కేసు ఇన్వేస్టిగేషన్ చేపట్టినప్పటి నుంచి కీర్తి జీవితంలో అంతుచిక్కని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఓ ఆత్మ ఆమెను వెంటాడుతుంది. ఆ ఆత్మ ఎవరిది? తన మరణంపై ఆత్మ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? చనిపోయిన మహిళకు కీర్తికి ఉన్న సంబంధం ఏమిటన్నదే హంట్ మూవీ కథ.
థ్రిల్లర్ మూవీస్...
మలయాళంలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతోన్న భావన గత కొన్నాళ్లుగా ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలే చేస్తోంది. ఆమె గత సినిమాలు కేస్ ఆఫ్ కొండన్న, రెయిన్ ది రియల్ స్టోరీ, గోవిందా గోవిందా థ్రిల్లర్ కథాంశాలతోనే తెరకెక్కాయి. ప్రస్తుతం భావన హీరోయిన్‌గా నటిస్తోన్న పింక్ నోట్, ఉత్తర కాండ హారర్ థ్రిల్లర్ స్టోరీస్‌తో తెరకెక్కుతోన్నాయి.
తెలుగులో మూడు సినిమాలు...
తెలుగులో భావన మూడు సినిమాలు చేసింది. గోపీచంద్ ఒంటరి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కృష్ణవంశీ మహాత్మతో పాటు రవితేజ నిప్పులో హీరోయిన్‌గా నటించింది. మహాత్మ మినహా మిగిలిన రెండు సినిమాలు ఆమెకు విజయాల్ని తెచ్చిపెట్టలేకపోయాయి. పరాజయాల కారణంగా టాలీవుడ్‌కు దూరమైంది. కన్నడ, మలయాళ భాషలకే పరిమితమైంది.