Maruthi Nagar Subramanyam: రావురమేష్ మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీతో అల్లు అర్జున్‌కు ఉన్న లింకేంటి?
17 April 2024, 11:37 IST
Maruthi Nagar Subramanyam: రావురమేష్ హీరోగా నటిస్తోన్న మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలోని సీన్లను రీక్రియేట్ చేయబోతున్నారు. అల్లు అర్జున్‌తో ఈ మూవీకి చిన్న కనెక్షన్ ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ కనెక్షన్ ఏమిటంటే?
మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం
Maruthi Nagar Subramanyam: రావు రమేష్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మారుతీ నగర్ సుబ్రమణ్యం లో అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాల్లోని సీన్లను రీ క్రియేట్ చేశారు. అంతే కాకుండా అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ ఫేమస్ డైలాగ్ మేడమ్ సార్ మేడమ్ అంతే అనే డైలాగ్‌తో మారుతీ నగర్ సుబ్రహ్మణ్యంలో ఓ పాట కూడా ఉండబోతుంది.
సిధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను బుధవారం రిలీజ్ చేశారు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు.
అల్లు అర్జున్ అభిమానిగా...
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద మేడమ్ సార్ మేడమ్ అంతే పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు.
అందుకని అతడు అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నట్లుగా వెరైటీగా పాటను షూట్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు భాస్కరభట్ల రాశాడు. కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ అందించాడు.
త్వరలో రిలీజ్ డేట్..
మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... టైటిల్ పాత్రలో రావు రమేష్ గారి లుక్, ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ సాంగ్ నేనే సుబ్రమణ్యం... మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యంకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. బుధవారం అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటిలపై సినిమాలో వచ్చే మేడమ్ సారు మేడమ్ అంతే సాంగ్ విడుదల చేశాం.
అంకిత్ పాత్రకు, అల్లు అర్జున్ కు సినిమాలో చిన్న కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం అని చెప్పారు.జోహార్ తిమ్మరుస', మజిలీ, శ్యామ్ సింగ రాయ్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు అంకిత్ కొయ్య.
మేడమ్ సార్ మేడమ్ అంతే పాట లిరిక్స్ ఇవిగో...
'తొలి తొలి సారి తొలిసారి
గుండె గంతులేస్తున్నదే!
ఏంటీ అల్లరి అంటే వినకుందే!
ఎందుకనో నువ్వు నచ్చేసి
వెంట వెంట పడుతున్నదే!
కన్ను తోడు రమ్మని పిలిచిందే!
నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత
నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత
ఒక్క మాట చెప్పు ఇంటి ముందు వాలిపోతా
ఏదో మాయ చేశావటే
నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా
నక్సలైటు లాగ నేను నీకు లొంగిపోతా
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఎప్పుడు లేదే
తనందం ఎంతటి గొప్పది అంటే
తలెత్తి చూడక తప్పదు అంతే
తలొంచి మొక్కిన తప్పేం కాదే
మేడమ్ సారు మేడమ్ అంతే