Most Releases in a year: సూపర్ స్టార్ సూపర్ రికార్డు.. తెలుగులో ఒకే ఏడాది అత్యధిక సినిమాలు రిలీజ్-most releases in a year in telugu super star krishna on top with 18 releases chiranjeevi ntr shoban babu anr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Releases In A Year: సూపర్ స్టార్ సూపర్ రికార్డు.. తెలుగులో ఒకే ఏడాది అత్యధిక సినిమాలు రిలీజ్

Most Releases in a year: సూపర్ స్టార్ సూపర్ రికార్డు.. తెలుగులో ఒకే ఏడాది అత్యధిక సినిమాలు రిలీజ్

Hari Prasad S HT Telugu

Most Releases in a year: ఒకే ఏడాది అత్యధిక సినిమాలు రిలీజ్ అయిన రికార్డు సూపర్ స్టార్ కృష్ణ పేరిట ఉన్న సంగతి తెలుసా? ఈ జాబితాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, శోభన్ బాబులాంటి స్టార్లు కూడా ఉన్నారు.

సూపర్ స్టార్ సూపర్ రికార్డు.. తెలుగులో ఒకే ఏడాది అత్యధిక సినిమాలు రిలీజ్

Most Releases in a year: తెలుగులో ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేస్తే ఎక్కువ. ఒక్కోసారి రెండు, మూడేళ్ల పాటు ఒక్క సినిమా కూడా ఉండదు. కానీ టాలీవుడ్ లో ఒకప్పుడు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు తీసిన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అందులో సూపర్ స్టార్ కృష్ణనే టాప్ లో ఉండటం విశేషం. అంతేకాదు ఈ జాబితాలో చిరంజీవి, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నటులు కూడా ఉన్నారు.

ఒకే ఏడాది అత్యధిక రిలీజ్‌లు

హీరోయిన్లు, కమెడియన్లు, సైడ్ క్యారెక్టర్లు వేసే వాళ్లు ఒకేసారి ఒకటికి మించి సినిమాలు చేయడం సహజం. కానీ ఓ స్టార్ హీరో హోదా అన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకొని చేస్తుంటారు. ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ అయినా ట్రెండ్ ఇదే. కానీ తెలుగులో కొన్ని దశాబ్దాల కిందటి వరకూ స్టార్ హీరోలు కూడా ఒకేసారి పది, ఇరవై సినిమాల వరకూ చేశారంటే నమ్మశక్యం కాదు.

ఈ జాబితాలో సూపర్ స్టార్ కృష్ణ టాప్ లో ఉన్నాడు. 1972లో అతడు నటించిన 18 సినిమాలు రిలీజ్ కావడం విశేషం. వాటిలో మా ఊరి మొనగాళ్లు, రాజ్ మహల్, హంతకులు దేవాంతకులు, పండంటి కాపురం, కత్తుల రత్తయ్య, ఇల్లు ఇల్లాలులాంటి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కృష్ణ అంతకుముందు 1970లో 16 సినిమాలు, 1973లో 15 సినిమాల్లో నటించడం గమనార్హం.

అంతకుముందు వరకు ఎన్టీఆర్ పేరిట ఈ రికార్డు ఉండేది. 1964లో అతడు నటించిన 17 సినిమాలు రిలీజయ్యాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ టాప్ ఫామ్ లో ఉన్నారు. ఆ ఏడాది రాముడు భీముడు, గుడి గంటలు, అగ్గి పిడుగు, దాగుడు మూతలు, బొబ్బిలి యుద్ధంలాంటి సూపర్ హిట్ సినిమాలు తీశాడు.

లిస్టులో ఉన్న టాప్ హీరోలు వీళ్లే

కృష్ణ, ఎన్టీఆర్ తర్వాత ఇలా ఒకే ఏడాది అత్యధిక రిలీజ్ లు ఉన్న హీరోల జాబితాలో ఇంకా ఏయే హీరోలు ఉన్నారో ఒకసారి చూద్దాం.

కృష్ణంరాజు - 17 సినిమాలు (1974)

రాజేంద్రప్రసాద్ - 17 సినిమాలు (1988)

చిరంజీవి - 14 సినిమాలు (1980)

శోభన్ బాబు - 12 సినిమాలు (1980)

ఓవరాల్ గా ఇండియాలో ఈ రికార్డు మాత్రం మిథున్ చక్రవర్తి పేరిట ఉంది. 1989లో అతడు నటించిన 19 సినిమాలు రిలీజ్ కావడం విశేషం. అవన్నీ లీడ్ రోల్స్ లో నటించిన సినిమాలే. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు.

అప్పటికి ఇప్పటికి ఎంత మార్పో?

అప్పట్లో స్టార్ హీరోలు కూడా ఏడాదికి పదికి మించిన సినిమాలు చేస్తే.. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ నే తీసుకుంటే అతడు 2022లో ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమాలో కనిపించలేదు. ఇక 2007లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్.. ఇప్పటి వరకూ నటించిన మొత్తం సినిమాలు 14 మాత్రమే.