Abhishekam Serial: 2008లో ఓపెనింగ్ - 2022లో శుభం కార్డ్ - తెలుగులో 14 ఏళ్లు బ్రేక్ లేకుండా టెలికాస్ట్ అయిన సీరియల్ ఇదే
08 June 2024, 12:23 IST
Abhishekam Serial: తెలుగులో అత్యధిక కాలం టెలికాస్ట్ అయిన సీరియల్‌గా అభిషేకం రికార్డును నెలకొల్పింది. 2008లో నుంచి 2022 వరకు ఈ టీవీలో ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది.
అభిషేకం సీరియల్
Abhishekam Serial: ఓ సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడాలంటే మినిమం నాలుగైదేళ్లు పట్టడం కామన్. ఒక్కోసారి అంతకుమించి కూడా సీరియల్స్ టెలికాస్ట్ అవుతుంటాయి. ఏళ్లకు ఏళ్లు సాగి...పోతూనే ఉంటాయి. పదేళ్ల పాటు టెలికాస్ట్ కావడం అన్నది మాత్రం రికార్డ్‌గానే చెప్పవచ్చు. కానీ తెలుగు సీరియల్ అభిషేకం మాత్రం ఏకంగా పధ్నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది.
2008లో మొదలు...
అభిషేకం సీరియల్ 2008లో మొదలైంది. డిసెంబర్ 22న ఫస్ట్ ఎపిసోడ్ ఈటీవీలో స్క్రీనింగ్ అయ్యింది. అప్పటి నుంచి నిరవధికంగా 2022 వరకు ఈటీవీలో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతూనే వచ్చింది. 2022 ఫిబ్రవరి 1న మేకర్స్ ఈ సీరియల్‌ను ఎండ్ చేశారు. తెలుగులో అత్యధిక కాలం టెలికాస్ట్ అయిన టీవీ సీరియల్‌గా అభిషేకం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సీరియల్ ముగిసి రెండేళ్లు అయినా ఇప్పటికి అభిషేకం రికార్డ్ మాత్రం బ్రేక్ కాలేదు. అత్యధిక ఎపిసోడ్స్ రికార్డుల్లో అభిషేక్ టాప్ ప్లేస్‌లో ఉంది.
ఆడదే ఆధారం సెకండ్ ప్లేస్...
అత్యధిక కాలం ప్రసారమైన తెలుగు సీరియల్స్‌జాబితాలో రెండో స్థానంలో ఈటీవీ లోనే టెలికాస్ట్ అయిన ఆడదే ఆధారం సీరియల్ నిలిచింది. 2009లో మొదలైన ఈ సీరియల్ 2020 వరకు టెలికాస్ట్ అయ్యింది. పదకొండేళ్ల తర్వాత ఈ సీరియల్‌కు శుభం కార్డు వేశారు మేకర్స్. మూడో స్థానంలో మనసు మమతా నిలిచింది.
దాసరి నారాయణరావు దర్శకనిర్మాత...
అభిషేకం సీరియల్‌ను దివంగత టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తూనే స్వయంగా నిర్మించారు.దాసరి నారాయణరావు మరణం తర్వాత హరిచరణ్, లక్ష్మి శ్రీనివాస్, వెంకట్ శ్రీరామోజు ఈ సీరియల్‌కు దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. 2020లో కొవిడ్ కారణంగా మూడు నెలల పాటు సీరియల్ షూటింగ్ నిలిచిపోయింది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ...
ట్రాయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన అభిషేకం సీరియల్‌లో రవికిరణ్, సతీష్, మౌనిక, సమీరా షరీష్ కీలక పాత్రలు పోషించారు. బెంగళూరు పద్మ, కౌషిక్, హరితేజతో పాటు బుల్లితెరపై ఫేమస్ అయిన ఎంతో మంది తెలుగు ఆర్టిస్టులు సైతం ఈ సీరియల్‌లో కనిపించారు.
అభిషేకం సీరియల్ కథ ఇదే...
వినయ్ తండ్రిపై ద్వేషంతో ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. రేఖను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ వారి ప్రేమకు అడ్డంకులు ఎదురవ్వడంతో బాస్ కూతురు స్వాతిని పెళ్లాడుతాడు. రేఖ చావుబత్రువుల్లో ఉండటంతో ఆమెను వినయ్ పెళ్లిచేసుకోవాల్సివస్తుంది. వినయ్‌తో పెళ్లి తర్వాత రేఖ కోలుకుంటుంది. తన రెండు పెళ్లిళ్ల రహస్యం రేఖ, స్వాతిలకు తెలియకుండా వినయ్ ఎలా దాచిపెట్టాడు? నిజం ఎలా బయటపడిందనే కాన్సెప్ట్‌తో ఏకంగా పధ్నాలుగేళ్ల పాటు ఈ సీరియల్ రన్ అయ్యింది. టీఆర్‌పీ రేటింగ్‌లో చాలా ఏళ్ల పాటు ఈ సీరియల్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. దాసరి మరణం తర్వాత సీరియల్‌లో ఆసక్తి లోపించడం, సాగతీత ధోరణి ఎక్కువ కావడంతో క్రేజ్ తగ్గింది.
గెస్ట్ రోల్స్....
అభిషేకం సీరియల్‌లో గెస్ట్ పాత్రల్లో మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌తో పాటు హీరోయిన్ ప్రియా ఆనంద్ కనిపించింది. అభిషేకం సీరియల్ పలు నంది టీవీ నంది అవార్డులను గెలుచుకున్నది.