Cantonment By Election : కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ మల్లగుల్లాలు?
03 April 2024, 20:19 IST
Cantonment By Election : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిపై బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. ఈసారి టికెట్ ను దివంగత సాయన్న కుటుంబానికే ఇవ్వాలా? మరొకరి ఛాన్స్ ఇవ్వాలా? అని సర్వేలు చేస్తుంది.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?
Cantonment By Election : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్(BRS) అధిష్టానానికి ఇప్పుడు సవాల్ గా మారింది. త్వరలోనే కంటోన్మెంట్ ఉపఎన్నిక(Cantonment By Election) నోటిఫికేషన్ కూడా రానున్న నేపథ్యంలో.....ఎవరిని బరిలో నిలపాలనే దానిపై మాత్రం పార్టీ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవైపు టికెట్ తనకే కేటాయించాలని లాస్య నందిత సోదరి నివేదిత ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ ను రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఉద్యమకారులు సైతం ఈసారి కంటోన్మెంట్ టికెట్ తమకే కావాలని వేడుకుంటున్నారు. దీంతో సర్వే ఆధారంగా టికెట్ కేటాయిస్తామని ఆశావహులతో కీలక నేతలు చెబుతున్నారట.
మరోసారి సాయన్న కుటుంబానికి టికెట్ దక్కనుందా?
కంటోన్మెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్(BRS) సిట్టింగ్ స్థానం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుమార్తె లాస్య నందితకు(Lasya Nandita) బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించగా....ఆమె గెలుపొందారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో కంటోన్మెంట్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 18న కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్(Secunderabad Cantonment Byelection) కూడా రానుంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కానీ టికెట్ ఎవరికీ ఇవ్వాలి అనేది మాత్రం అధిష్ఠానానికి తల నొప్పిగా మారింది. టికెట్ తనకే ఇవ్వాలని నందిత సోదరి నివేదిత పార్టీ అధినేత కేసీఆర్ ను రిక్వెస్ట్ చేశారు. అయితే ఒకే కుటుంబానికి ఇన్ని సార్లు టికెట్ ఇస్తే గెలుస్తామా? లేదా అనేదానిపై పార్టీ సమాలోచన చేస్తుంది. ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ కావడంతో మరొకరికి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే దానిపై కేసిఆర్ వివరాలను నేతల నుంచి ఆరా తీస్తున్నట్లు సమాచారం.
టికెట్ ఆశిస్తున్న ఉద్యమకారులు వీరే
ఇదిలా ఉంటే ఇదే స్థానం నుంచి పలువురు ఉద్యమకారులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్, ఖనిజానివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ కృషాంక్ తో పాటు మరో ఇద్దరు పేర్లను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వీరు ఇద్దరు కంటోన్మెంట్ టికెట్ ఆశించి భంగపడ్డారు. కాగా కృషాంక్ లాంటి తెలంగాణ ఉద్యమకారులను పార్టీ ఎన్నడూ మర్చిపోదని వారికి మంచి ప్రాధాన్యత కల్పిస్తామని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే కృషాంక్ తో పాటు నాగేష్ సైతం... ఇప్పుడైనా కంటోన్మెంట్ టికెట్(Cantonment BRS Ticket) కేటాయించాలని పార్టీని అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ ఉన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం వీరితో భేటీ అవుతున్నారు.
అభ్యర్థి ఎంపికపై ఆచీతూచీ అడుగులు
మరోపక్క కంటోన్మెంట్(Secunderabad Cantonment) నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తుంది. పార్టీ పైన, నేతల పైన ప్రజాభిప్రాయాలను సేకరిస్తుంది. వీటితో పాటు సాయన్న కుటుంబంపైన ఆదరణ ఏమైనా తగ్గిందా? అనే వివరాలను కూడా పార్టీ తెలుసుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే టికెట్(By Election Ticket) కేటాయింపు పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సర్వేలో ఎవరికి పాజిటివ్ వచ్చింది అనే విషయంపై మాత్రం నేతలు క్లారిటీ ఇవ్వడం లేదు. అసెంబ్లీ పరిధిలో జరిగే పరిణామాలను నేతలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి చెరవెస్తునట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్(BRS) గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. కేవలం 39 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కావడం, ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ పార్టీ మరింత అలర్ట్ అయింది. కంటోన్మెంట్ లో పార్టీ టికెట్ ఇచ్చేవారు పార్టీ విధేయులుగా ఉండాలని.... గెలిచిన తర్వాత పార్టీ మారకుండా ఉండే వారికే టికెట్ ఇవ్వాలని భావిస్తుంది. అలాంటి వ్యక్తికే టికెట్ ఇచ్చి దగ్గరుండి గెలిపించుకోవాలని పార్టీ అధిష్టానం ప్రణాళిక రూపొందిస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తుంది. అయితే మరోసారి సాయన్న కుటుంబానికి టికెట్ ఇస్తారా? లేకుంటే మరొకరికి అవకాశం కల్పిస్తారా? అనేది మాత్రం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా