Cantonment Bypoll 2024 : కంటోన్మెంట్ లో మొదలైన టికెట్ల లొల్లి..…!వేగంగా మారుతున్న రాజకియ సమీకరణాలు
Secunderabad Cantonment Bypoll 2024: కంటోన్మెంట్ ఉపఎన్నిక తేదీ ఖరారు కావటంతో… అక్కడి రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంటే… ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
Cantonment Assembly Constituency: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రాజకీయ వేడి మొదలైంది.పార్లమెంట్ తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజీకవర్గానికి ఉప ఎన్నిక ఖరారైంది.దీంతో అక్కడ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్…. అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో ఒక్కసారే బీజేపీ వర్గాలు షాక్ తిన్నాయి.బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.అయితే లాస్య నందిత అక్క నివేదిత బిఆర్ఎస్ తరఫున ఈసారి బరిలో ఉంటారని సమాచారం.ఇదిలా ఉండగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మాత్రం వలసలు ఆగడం లేదు.
కాంగ్రెస్ నుంచి బరిలో అద్దంకి దయాకర్....?
గత ఎన్నికల్లో కారు పార్టీకి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డి, డిబి దేవేందర్,ముప్పిడి గోపాల్ వంటి కీలక నేతలు ఇప్పటికే సొంత గూటికి చేరుకున్నారు.తాజాగా కంటోన్మెంట్ ఏడో వార్డుకు చెందిన సీనియర్ నేత,ఉద్యమ కారుడు రంగ రవీందర్ గుప్తా మంత్రి తుమ్మల సమక్షంలో హస్తం గూటికి చేరుకున్నారు.ఒకటి రెండు రోజుల్లో మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాలు బీజేపీ నుంచి పోటీ చేసి,ఈసారి కూడా టికెట్ పక్కా అనుకున్న సమయంలో శ్రీ గణేష్ కాంగ్రెస్ గూటికి చేరుకోవడం తో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గద్దర్ కుమార్తె వెన్నల తో పాటు,కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
బలమైన అభ్యర్థి వేటలో బీజేపీ..…
బలమైన బీజేపీ అభ్యర్థిగా భావించిన శ్రీ గణేష్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరడంతో బీజేపీ కొత్త అభ్యర్థి కోసం వెతికే పనిలో పడింది. గతంలో పార్టీ టికెట్ కోసం పోటీ పడి,దక్కకపోవడంతో నిరాశ చెందిన నేతలు మళ్ళీ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన కంటోన్మెంట్ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి పరుశురాం,బీజేపీ ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా,బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శ్రుతి,మాజీ మంత్రి గుండె విజయరమ రావు తనకు లేదా తన కుమార్తె గుండె సురేఖ మరియు తదితర నేతలు కంటోన్మెంట్ బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.....దివంగత నేత సాయన్న కుమార్తె నివేధిత తొనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం బిఆర్ఎస్ లో కొనసాగుతున్న బోర్డ్ మాజీ సభ్యులు లోక నాథం,నళిని కిరణ్ పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు వినిపిస్తుంది.