తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Raghurama Issue: చంద్రబాబు మెడలో గంటలా మారిన Rrr, టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు.. ఎన్నికల్లో పోటీపై ధీమా

Raghurama Issue: చంద్రబాబు మెడలో గంటలా మారిన RRR, టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు.. ఎన్నికల్లో పోటీపై ధీమా

Sarath chandra.B HT Telugu

04 April 2024, 6:00 IST

google News
    • Raghurama Issue: తెలుగుదేశం  పార్టీకి  రఘురామ కృష్ణంరాజు సమస్య తీరడం లేదు. నరసాపురం పార్లమెంటు నుంచి రఘురామ పోటీ ఆశలు గల్లంతు కావడంతో ఆ ప్రభావం టీడీపీపై పడుతోంది. 
టీడీపీకి తలనొప్పిగా మారిన రఘురామ టిక్కెట్ వ్యవహారం
టీడీపీకి తలనొప్పిగా మారిన రఘురామ టిక్కెట్ వ్యవహారం

టీడీపీకి తలనొప్పిగా మారిన రఘురామ టిక్కెట్ వ్యవహారం

Raghurama Issue: పార్లమెంటు ఎన్నికల్లో నర్సాపురం Narsapuram టిక్కెట్ ఆశించిన రఘురామ కృష్ణంరాజుకు చివరి నిమిషంలో నిరాశ తప్పలేదు. దాదాపు నాలుగేళ్లుగా టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు శ్రమించిన రఘురామ.. బీజేపీ టిక్కెట్ BJP Ticket ఆశించినా ఫలితం దక్కలేదు. తనకు టిక్కెట్ దక్కకపోవడానికి వైసీపీ కారణమని కూడా ఆరోపించారు. సోము వీర్రాజు ద్వారా తనపై సిఎం జగన్ విజయం సాధించారని ఆరోపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీకి మేలు చేసేవిగా ఉండటంతో ఆ తర్వాత నష్ట నివారణ టీడీపీకి అనివార్యమైంది.

మరోవైపు కొద్ది రోజులుగా రఘురామ కృష్ణం రాజుకు మద్దతుగా టీడీపీ TDPలో ఓ వర్గం ఆందోళన చేస్తోంది. అమరావతి రైతులతో పాటు, వైసీపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వారందరికి రఘురామ నాయకత్వం వహించారని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోతే అది వైసీపీ విజయమేనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ, బీజేపీల మీద ఒత్తిడి చేస్తున్నారు.

రఘురామ కృష్ణం రాజు విషయంలో బీజేపీ స్ఫష్టమైన వైఖరితోనే ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నా పార్టీలో చేరే విషయంలో బీజేపీ పెద్దల సూచనల్ని ఆయన ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదని చెబుతున్నారు. దాదాపు ఏడాది క్రితమే బీజేపీలో చేరాలని అమిత్‌ షా స్వయంగా రఘురామ కృష్ణంరాజుకు సూచించినా ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో స్ఫష్టత రాకపోవడం, టీడీపీ నుంచి సహకారం లభిస్తుందో లేదోననే సందేహాలతో వెనకడుగు వేశారు.

బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలిగినట్టే రఘురామ టీడీపీ నేతలతో కూడా అంటకాగారు. టీడీపీ అభ్యర్థుల కోటాలో రఘురామకు టిక్కెట్ ఇచ్చి ఉండాల్సిందని బీజేపీ నేతలు ప్రశ్నించడంతో టీడీపీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులపై ఫిర్యాదులు,కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన రుణాలు, ప్రభుత్వ విధానపరమైన అంశాలపై వైసీపీలో ఉంటూనే రఘురామ విమర్శలు గుప్పించేవారు.

వైసీపీ అనర్హత వేటు వేయాలని చేసిన ఫిర్యాదుల నుంచి రక్షణ కోసమే బీజేపీ నేతలతో సాన్నిహిత్యం కొనసాగించారనే విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు 2018లో బీజేపీ కూటమి నుంచి టీడీపీ వైదొలగిని తర్వాత ఆ పార్టీని తిరిగి ఎన్డీఏకు దగ్గర చేయడంలో రఘురామ పాత్ర కూడా ఉంది. వైసీపీ అధ్యక్షుడి మీద కోపం, పంతంతో ఈ పనులు చేసినా దాని ప్రయోజనం ఎవరికి దక్కిందనే ప్రశ్న తలెత్తింది. రఘురామ చర్యలతో ఎక్కువ లాభపడింది టీడీపీ కావడంతో ఆయన రాజకీయ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కూడా టీడీపీపై పడింది.

దీంతో రఘురామ కృష్ణం రాజును ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నరసాపురం ఎంపీ టిక్కెట్‌ను టీడీపీకి కేటాయిస్తే ... ఉండి ఎమ్మెల్యే సీటును ప్రస్తుత BJP అభ్యర్థికి కేటాయించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

దీంతో పాటు కడప ఎంపీ స్థానాన్ని బీజేపీకి, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇవ్వాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆందోనళనతో ఆ స్థానం కూడా TDP ఖాతాలోకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సోమవారం ప్రకటన వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన రఘురామకృష్ణరాజు, వచ్చే ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.తనకు టికెట్ వస్తుందని మూడు నాలుగురోజుల్లో మంచి వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తదుపరి వ్యాసం